మిగిలింది ఆయనే! | to competition the candidates drought from Congress party | Sakshi
Sakshi News home page

మిగిలింది ఆయనే!

Published Wed, Jan 22 2014 2:38 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

to competition the candidates drought from Congress party

 2009లో... రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అమలుతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో కొలువయ్యారు. ఫలితంగా ఆ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున టిక్కెట్ దొరకడం ప్రతిష్టాత్మకంగా భావించారు.
 
 2014లో... తెలుగు ప్రజలను నిలువునా చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ పరిస్థితుల్లో పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా బరిలో నిలిచే అభ్యర్థులు కరువయ్యారు. పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదానికి తెరతీసింది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా విభజన వైపు ఆ పార్టీ వేస్తున్న ఒక్కో అడుగు రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఇతర పార్టీల ఆహ్వానం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచినా అటువైపు అడుగులేసే నాయకుడు కరువయ్యారు.

 ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కోట్ల కుటుంబం పెద్ద దిక్కుగా మారింది. రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన రానున్న ఎన్నికలకు సంబంధించి
 అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించే అభ్యర్థులే కరువయ్యారు. విధిలేని పరిస్థితుల్లో ఈ విడత కోట్ల కుటుంబమంతా బరిలో నిలిచేందుకు నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది.

పార్లమెంట్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బరిలో నిలుస్తుండగా.. కుటుంబ సభ్యులు రెండు అసెంబ్లీ స్థానాల నుంచి.. అనుచరుడు మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం ఉంది. కోట్ల తన కుమారుడు రాఘవేందర్‌రెడ్డి రాజకీయ రంగప్రవేశం ఆలూరు నియోజకవర్గం నుంచి చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీ స్థానం నుంచి అనుచరుడిని బరిలో నిలపనున్నట్లు సమాచారం. ఇక డోన్ అసెంబ్లీ స్థానం నుంచే తాను బరిలో నిలవనున్నట్లు కోట్ల సుజాతమ్మ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు.

ఆ మేరకు గత ఆదివారం స్థానికంగా ఆమె ఓ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమై మద్దతు కోరడం తెలిసిందే. తక్కిన పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను సైతం అధిష్టానం కోట్ల భుజస్కంధాలపైనే ఉంచినట్లు పార్టీ వర్గీయుల్లో చర్చ కొనసాగుతోంది. ఎమ్మిగనూరు బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా టీడీపీ నేత ఒకరికి పార్టీ తీర్థం ఇప్పించి పోటీ చేయించవచ్చని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.

అదేవిధంగా మంత్రి టీజీ వెంకటేష్ ఒకవేళ పార్టీ మారితే ఎవరిని బరిలో నిలపాలనే విషయమై కోట్ల ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రచారం జరుగుతున్నట్లుగా టీజీ పార్టీ వీడితే టీడీపీ నేత ఒకరిని కాంగ్రెస్‌లో చేర్చుకుని పోటీ చేయించేందుకు అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement