ఆఖరి చాన్స్
=నేటితో ముగియనున్న ఓటరు నమోదు గడువు
=ప్రత్యేక డ్రైవ్‌లో వేలాదిగా దరఖాస్తులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఓటరు నమోదుకు గడువు సోమవారంతో ముగియనుంది. ఆదివారం నిర్వహించిన తుది ప్రత్యేక డ్రైవ్‌లో వేల మంది ఓటరు నమోదు, సవరణలు, తొలగింపుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అధిక శాతం ఆన్‌లైన్‌లో తమ వివరాలను పొందుపరిచారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 2.5 లక్షల మంది కొత్త ఓటర్లు చేరే అవకాశముంది. గత నెల 18న ప్రచురించిన ఓటరు జాబితా ముసాయిదా ప్రకారం జిల్లాలో 30,76,374 మంది ఓటర్లు కాగా ఇందులో 15,33,783 మంది పురుషులు, 15,42,591 మహిళా ఓటర్లు ఉన్నారు.
వరుసగా ఐదు ఆది వారాలు జిల్లాలో ఉన్న 3506 పోలింగ్ కేంద్రా ల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 89,679 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 47 వేల డూప్లికేట్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత వారం వరకు మొత్తంగా 1.56 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఆదివారం నిర్వహించిన తుది డ్రైవ్‌లో కూడా వేల సంఖ్యల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్రాల పనితీరును పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ 50 మంది ప్రత్యేకాధికారులను నియమించారు.
ఆన్‌లైన్ ద్వారా ఇప్పటి వరకు 90 వేల మంది వరకు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారిలో అత్యధికులు యువతీ యువకులే. సో మవారంతో గడువు ముగుస్తుండడంతో మరో ఐదు వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశా లు ఉన్నాయని భావిస్తున్నారు. చివరి రోజున జీవీఎంసీ జోనల్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే త ప్పనిసరిగా సోమవారమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.