ఒంగోలు ఒన్‌టౌన్ : జిల్లాలో 2014-15 విద్యా సంవత్సరానికి విద్యా వార్షిక ప్రణాళికను ఖరారు చేసినట్లు డీఈఓ, డీసీఈబీ చైర్మన్ బి.విజయభాస్కర్, డీసీఈబీ కార్యదర్శి జి.పుల్లారెడ్డి తెలిపారు. ఈ ఏడాది పాఠశాలల మొత్తం పని దినాలు 229 అని, స్వయం నిర్ణయక, ఐచ్ఛిక సెలవులు మొత్తం 8 పోను, పాఠశాలలు నికరంగా 221 రోజులు పని చేయాలని పేర్కొన్నారు. ఇతర సెలవులను ప్రభుత్వ ప్రకటనల మేరకు పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. ఐచ్ఛిక సెలవులు 5, స్వయం నిర్ణయక సెలవులు 3 వాడుకునే వివరాలను పాఠశాలల తనిఖీ అధికారికి ముందుగా సమాచారం అందజేయాలని వివరించారు. మారిన నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్నారు.
- జూలైలో నిర్మాణాత్మక మదింపు-1 (ఫార్మెటివ్ అసెస్‌మెంట్ -1) నిర్వహించాలి.
- ఆగస్టులో నిర్మాణాత్మక మదింపు-2 (ఫార్మెటివ్ అసెస్‌మెంట్ -2) నిర్వహించాలి.
- సెప్టెంబర్‌లో సంగ్రహణాత్మక మదింపు -1 (సమ్మెటివ్ అసెస్‌మెంట్-1) నిర్వహించాలి. ఈ పరీక్షలను సెప్టెంబర్ 11 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించాలి. ఆగస్టు సిలబస్ వరకు మాత్రమే ప్రశ్నలివ్వాలి.
- పాఠశాలలకు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించాలి. సెలవుల అనంతరం 6వ తేదీన పాఠశాలలను పునఃప్రారంభించాలి.
- నవంబర్‌లో నిర్మాణాత్మక మదింపు-3 (ఫార్మెటివ్ అసెస్‌మెంట్ -3) నిర్వహించాలి.
- డిసెంబర్‌లో సంగ్రహణాత్మక మదింపు -2 (సమ్మెటివ్ అసెస్‌మెంట్-2) నిర్వహించాలి. డిసెంబర్ 10 నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలి. నవంబర్ సిలబస్ వరకు మాత్రమే ప్రశ్నలివ్వాలి.
- క్రిస్టియన్ యాజమాన్య పాఠశాలలకు డిసెంబర్ 24 నుంచి 2015 జనవరి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించాలి. జనవరి 3న పాఠశాలలను పునఃప్రారంభించాలి.
- ఇతర యాజమాన్యాల పాఠశాలలకు జనవరి 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించాలి. 17న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
- ఫిబ్రవరిలో నిర్మాణాత్మక మదింపు -4 (ఫార్మెటివ్ అసెస్‌మెంట్ -4) నిర్వహించాలి. ఈ మదింపును ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ లోపు నిర్వహించాలి.
- ఏప్రిల్‌లో సంగ్రహణాత్మక మదింపు -3 (సమ్మెటివ్ అసెస్‌మెంట్-3) నిర్వహించాలి. ఏప్రిల్ 9 నుంచి 21వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని వారు వివరించారు.
జిల్లా విద్యా వార్షిక ప్రణాళిక ఖరారు
Published Fri, Jul 4 2014 1:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement