
హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయండి
అనంతపురం అర్బన్: హంద్రీ-నీవా పనులు వేగవంతం చేయాలని ప్రాజెక్టు ఇంజనీర్లను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో హంద్రీ-నీ వా పనుల పురోగతిపై ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ఆ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. ప్యాకేజీల వారీగా పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టు డిజైన్లను ప్యాకేజీల వారీగా మూడు రోజుల్లో అనుమతి మంజూరు చేయించుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అక్విడెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. రైల్వే క్రాసింగ్‌లను జాగ్రత్తగా పరిశీలించి పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్‌ను ఆదేశించారు. హంద్రీ-నీవా పూర్తి చేసి బుక్కపట్నం చెరువుకి నీరిస్తే జిల్లా రైతాంగాన్ని కరువు బారిన నుంచి కాపాడుకోవచ్చన్నారు. సమావేశంలో సీఈ జలందర్, ఎస్‌ఈ సుధాకర్‌బాబు, ఈఈ సుభాష్‌చంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.