సాక్షి ప్రతినిధి, కడప: ‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్ నేతలు. నిత్యం వైరిపక్షాలుగా తలపడిన నేతలు ప్రస్తుతం ఒకే వేదిక ఎక్కన్నున్నారు. అపవిత్ర కలయికతో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల్లో తలపడిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇకపై ఒకే మాట, ఒకే బాటగా పయనించేందుకు రెఢీ అవుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీని వీడేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమైన నేపథ్యంలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
అవకాశం కల్పిస్తే కాంగ్రెస్‌ను
భూస్థాపితం చేస్తా..
తనకు మరోమారు అవకాశం కల్పిస్తామంటే పార్టీ మారేందుకు రెఢీ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక రు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను మొదటి నుంచి టీడీపీ సభ్యుడినేనని, రెండు పర్యాయాలు ఆ పార్టీ నుంచే ఎంపికయ్యానని విధిలేక కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని ఆయన రాయబేరాలు పెట్టినట్లు సమాచారం. తనకు గట్టి హామీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన నేతలందర్ని తీసుకు వస్తానని ఆయన ఓ టీడీపీ ఎంపీతో అన్నట్లు తెలిసింది. పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అవకాశవాద రాజకీయాలలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన ఆ ఎమ్మెల్యే ఇప్పటి నుంచే తన ప్రధాన ప్రత్యర్థిని పొగడ్తలతో ముంచెత్తుతున్నట్లు సమాచారం. తనతో పాటు మరో సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యేను కూడా పార్టీలోకి తీసుకువస్తానని చెప్పినట్లు వినికిడి.
మాజీ పీఆర్పీ నేతలకు గాలం..
వలసలను ప్రోత్సహించి లేని ఊపును తెచ్చుకోవాలనే దిశగా టీడీపీ ఎత్తుగడలను ముమ్మరం చేస్తోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలం వేస్తూనే మరోవైపు సామాజికవర్గ సమీకరణలకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ పీఆర్పీ నేతలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ప్రస్తుతం ఓ మంత్రికి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందిన నాయకుడు రాజంపేట టికెట్ కోరుతున్నట్లు సమాచారం.
మంత్రి మినహా పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ప్రధాన నాయకులంతా మూకుమ్మడిగా టీడీపీ తీర్థం పుచ్చుంటామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వలసబాట పడుతున్న నాయకులకు ప్రజల్లో ఎంతమాత్రం పట్టు ఉందన్న విషయాన్ని ప్రక్కన పెడితే పార్టీ ఇమేజ్ పెంచవచ్చనే భావనలో టీడీపీ నేతలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగా ఈనెల 5న టీడీపీ ముఖ్యనేతలు సమావేశమై వలసల విషయం చర్చించనున్నట్లు సమాచారం.
కలిసుందాం.. రండి!
Published Thu, Jan 2 2014 2:37 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement