సత్తెనపల్లి, న్యూస్‌లైన్ : గ్రామ సర్పంచి నుంచి పార్లమెంట్ సభ్యులకు వరకు అంతా ప్రజా ప్రతినిధులే.. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నవారే.. వారు బాధ్యతలు నిర్వర్తించే పరిధిలోనే తేడా. ఎంపీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తే జెడ్పీటీసీ జిల్లాకు, ఎంపీపీ మండలానికి, సర్పంచ్ తన గ్రామ పంచాయతీకి బాధ్యులుగా వ్యవహరిస్తుంటారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవవేతన ం లక్షల రూపాయల్లో ఉంటుంది. స్థానిక ప్రజా ప్రతినిధులకు మాత్రం మరీ దారుణం. జెడ్పీటీసీ సభ్యులకైతే మండల పరిషత్‌లో కూర్చునేందుకు కనీసం కుర్చీ కూడా కేటాయించకపోవడం మన వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతోంది.
పార్లమెంట్, శాసనసభ సభ్యులుగా గెలుపొందిన వారికి విలాస వంతమైన భవనాల్లో నివాసం, కార్లు, రైళ్లు, విమానాల్లో ప్రయాణాలు, రాయితీపై వైద్యం, టెలిఫోన్ సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఒక్కసారి పోటీచేసి గెలిస్తే జీవితాంతం లభించే పింఛను, ఇలా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎంపీకి నెలకు అన్నీ కలిపి రూ. 2 లక్షలకు పైగా చెల్లిస్తుండగా,ఎమ్మెల్యేకు రూ. లక్ష వరకు అందుతుంది. ఏటా ఎంపీ నిధుల ద్వారా రూ.5 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు రూ. 50 లక్షల నుంచి కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోవచ్చు. జిల్లా, మండల పరిషత్ సమావేశాలకు హాజరైతే వీరికి మరికొంత అదనంగా చెల్లిస్తారు.
ఎంపీపీకి రూ. వందల్లోనే...
స్థానిక ప్రజాప్రతినిధులుగా గెలిచిన జెడ్పీటీసీ సభ్యులకు నెలకు రూ. 2,250 వేతనం చెల్లిస్తారు. అదే ఎంపీపీకి రూ. వెయ్యి మాత్రమే చెల్లిస్తారు. జిల్లా, మండల సర్వసభ్య సమావేశాలకు హాజరైతే రవాణా భత్యం రూ. వందల్లో చెల్లిస్తారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్నవారు నామినేషన్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 2,500 చెల్లించాలి. ఇతరులు రూ. 5వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీపీ స్థానానికి పోటీచేయాలనుకునేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 1250, ఇతరులు రూ.2,500 చెల్లించాలి. ఎన్నికల ఖర్చు కింద జెడ్పీటీసీ అభ్యర్థులు రూ. 2 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ అభ్యర్థులు రూ. లక్షలోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఎన్నికల్లో గెలిచిన జెడ్పీటీసీకి రూ. 2,250 చెల్లిస్తుండగా, ఏడాదికి రూ. 27వేలు చొప్పున ఐదేళ్ళల్లో రూ. 1.35 లక్షలు మాత్రమే అందుతాయి. ఎంపీపీకి నెలకు రూ. వెయ్యి చెల్లిస్తుండగా, ఏడాది రూ. 12వేలు చొప్పున ఐదేళ్లకు రూ. 60 వేలు అందుతాయి. ఎంపీపీలు జిల్లా సమావేశాలకు హాజరయ్యేందుకు నెలకు రూ. 500 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులకు ఐదేళ్లలో చెల్లిస్తున్న జీతాలు మొత్తం ఎన్నికల్లో వెచ్చించిన ఖర్చులకంటే చాలా తక్కువ. జెడ్పీటీసీ సభ్యుడికి మండల పరిషత్ కార్యాలయంలో కనీసం కుర్చీ కూడా ఉండదు. అరకొర వేతనం ఇస్తున్నా సర్దుకుపోతున్న జెడ్పీటీసీ సభ్యులకు కనీసం కుర్చీ కూడా కేటాయించలేదని గతంలో పలువురు సభ్యులు వాపోయిన సంఘటనలున్నాయి.
ఔరా.. ఎంత తేడా!
Published Mon, Jun 9 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM
Advertisement
Advertisement