Assembly members
-
శాసనసభలో ప్రజా సమస్యలపై చిత్తూరు ఎమ్మెల్యేల గళం
ప్రజల కోసం, ప్రాంతం కోసం జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ ప్రాంతా ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ హయాంలో ప్రజాధ నం దుర్వినియోగం, ప్రభుత్వ పథకాల్లో దోపిడీని ఎండగట్టారు. ఎంతో కాలంగా తిష్టవేసిన ఏనుగుల సమస్య, వాటి దాడిలో నష్టపోయిన బాధితులకు పరిహారంపై ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లుల వల్ల జిల్లాకు లభించే ప్రయోజనాలను వివరించారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తిగత దూషణలు, ఎత్తిపొడుపులు, ప్రజాగొంతుకను నియంత్రించడం ఇదివరకూ కన్పించిన దృశ్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సరికొత్త చర్చకు నాంది పలికింది. ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. అసెంబ్లీ వేదికను సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం కొందరు పరితపిస్తే, రాజకీయాలు చేయాలనే దిశగా మరికొందరు ప్రయత్నిం చారు. వెరసి 20 రోజుల బడ్జెట్ సమావేశాలకు మంగళవారంతో తెరపడింది. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దోపిడీపై ధ్వజమెత్తారు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.750 కోట్లతో 7,937 వివిధ పనులు చేపట్టారు. వాటిలో ప్రజాప్రయోజనాల నిమిత్తం చేపట్టిన పనులు అతి స్వల్పమనే చెప్పాలి. నీరు–చెట్టు పథకం రూపేణా టీడీపీ కార్యకర్తలు ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. ఈ విషయాన్ని సమీక్షించిన మంత్రి పెద్దిరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించి, విజిలెన్సు విచారణకు ఆదేశించారు. డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు అండగా పథకాలు రూపొందిస్తున్నారని తెలిపారు. అవినీతిని అంతమొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. గత పాలనలో కుట్రలు, కుయుక్తులు అడుగడుగునా కన్పించేవని, ప్రజాశ్రేయస్సే ఎజెండాగా ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని వివరించారు. పదవుల్లో, పనుల్లో 50శాతం మహిళలకు వాటా కల్పించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రస్తావించారు. తోబుట్టువులకు అన్నలా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుస్తున్నారని తెలిపారు. ఏనుగుల సమస్య పరిష్కారం కోసం.. కుప్పం, పలమనేరు, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలో వ్యవసాయ పంటలపై ఏనుగులు దాడులు చేసి తీవ్రంగా నష్టాలపాలు చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఏనుగుల దాడుల్లో 9మంది రైతులు మృతి చెందగా, సుమారు 6వేల ఎకరాల్లో వివిధ పంటలు ధ్వంసం అయ్యాయి. దాదాపు 3,500 బాధిత రైతులున్నారు. వీరికి గత ఐదేళ్లుగా అతి తక్కువ మొత్తంలో పరిహారం అందించారు. ఎకరాకు రూ.25వేలు పరిహారం కోరగా, రూ.6వేలు మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. రైతులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. హౌసింగ్, భూఆక్రమణలపై విచారణకు డిమాండ్ అధికారం అండతో పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా భూములు ఆక్రమించారు. పక్కాగృహాల నిర్మాణాల పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వీటిపై సమగ్రంగా విచారణ చేపట్టి అక్రమార్కులౖపై చర్యలు చేపట్టాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లు ఎంతో ప్రయోజనమని, స్థానికులకు ఉపాధి మెరుగవుతోందని వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కువమంది యువతకు ఉపాధి దక్కుతోందని తెలిపారు. జిల్లాలో పాఠశాలలు మూతపడిపోతున్నాయి. వాటిని తెరిపించి, నాణ్యమైన విద్యను అందించాలని పలమనేరు, సత్యవేడు ఎమ్మెల్యేలు వెంకటేగౌడ్, ఆదిమూలం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా ప్రభుత్వం చేపట్టగా ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, జంగాలపల్లె శ్రీనివాసులు, ఎంఎస్ బాబు పాల్గొన్నారు. చిత్తూరులో మౌలిక వసతులు కల్పించండి – అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆరణి చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరులో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం అసెంబ్లీలో తెలియజేశారు. నియోజకవర్గంలో 30 సంవత్సరా లుగా తాగునీటి సమస్య ఉందని, ప్రస్తుతం నగరపాలక సంస్థ తరఫున అందిస్తున్న ట్యాంకర్ల నీరే దిక్కుగా మారిందని అన్నారు. నగరానికి అమృత్‌పథకం కింద నిధులు మంజూరు చేసి సమస్య తీర్చాలని అధికారులు నివేదిక పెట్టి 16 నెలలవుతోందని గుర్తు చేశారు. పది పంచాయతీల విలీనంతో చిత్తూరు కార్పొరేషన్‌గా ఆప్‌గ్రేడ్ అయి ఏడు సంవత్సరాలవుతున్నా నిధుల లేమితో అవస్థలు పడుతున్నామన్నారు. నీటి సరఫరా, మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఇంతవరకు పనులు జరగలేదని గుర్తు చేశారు. చెరువుల అనుసంధానం చేసి నీటి సమస్య తీర్చాలని కోరారు. డెయిరీ, షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని కోరారు. శ్మశాన వాటిక సమస్యలు పరిష్కరించండి – సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వరదయ్యపాళెం : సత్యవేడు నియోజకవర్గ పరిధిలో శ్మశాన స్థలాల సమస్య పరిష్కరిం చాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరా రు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రధానంగా శ్మశాన స్థలాల సమస్య తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కొన్నింటికి దారి లేదని, మరి కొన్ని చోట్ల స్థలం లేదని, ఉన్నా కబ్జాకు గురయ్యాయని చెప్పారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. తమ నియోజకవర్గం తమిళనాడు సరిహద్దులో ఉందని, ఎన్నికల హామీలను త్వరగా నెరవేరుస్తుండడంతో జగన్మోహన్రెడ్డి లాంటి సీఎం తమకూ కావాలని ఆ రాష్ట్ర ప్రజలు అంటున్నారని చెప్పడంతో సభలో చప్పట్లు మార్మోగాయి. పీలేరు భూ అక్రమాలపై సభా సంఘం వేయాలి - ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ వాల్మీకిపురం: పీలేరులో జరిగిన భూ అక్రమాలపై సభా సంఘం వేసి, టీడీపీ నేతల దోపిడీపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. పీలేరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేల కోట్లు విలువ చేసే వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాన్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూములను అమ్ముకున్నారన్నారు. ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని, అయితే పీలేరులో సెంటు కూడా ప్రభుత్వ భూమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విచారణ చేపట్టి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ బడా నాయకులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారన్నారు. దీనిపై రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ ప్రభుత్వం కచ్చితంగా విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆ ఎమ్మెల్యేల్లో నేర చరితులే ఎక్కువ
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది నేర చరిత్ర ఉన్నవారని ఓ సర్వేలో వెల్లడైంది. మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, వారిలో 142 మంది(58 శాతం)ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నట్లు బిహార్ ఎన్నికలపై అసోసియేషన్ ఆఫ్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్ నిర్వహించిన సర్వేలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. ఆ ఎమ్మెల్యేలపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడడం వంటి కేసులు నమోదైనట్లు సమాచారం. క్రిమినల్ చేష్టలకు పాల్పడినందుకు 70 మంది ఎమ్మెల్యేలపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేలపై హత్య, హత్యాచారం కేసులున్నాయి. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన 228 ఎమ్మెల్యేలపై సర్వే చేయగా 76 మంది(33 శాతం)ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గతంలోనే వెల్లడైంది. కొత్తగా ఎన్నికైన ప్రతి నలుగురిలో ఒకరు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. -
గళమెత్తాలె..!
నిధుల్లేక సగంలో నిలిచిపోయిన సాగు నీటి ప్రాజెక్టులు... పని చేయని మంచినీటి పథకాలు... దిష్టిబొమ్మల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు... రాళ్లు తేలి నడవడానికి వీలులేని రహదారులు... ఇలా మరెన్నో సమస్యలు పాలమూరు జిల్లావాసులను పట్టిపీడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభ కొలువుదీరుతున్న వేళ జిల్లానుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై ప్రజానీకం కోటి ఆశలు పెట్టుకుంది. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి, మౌలిక సౌకర్యాల కల్పన వంటి బాధ్యతలు నూతన శాసనసభ్యులకు రాబోయే కాలంలో పరీక్షగా నిలవనున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దశాబ్దాల వెనుకబాటు తనానికి కొత్త రాష్ట్రంలోనైనా పరిష్కారం దొరుకుతుందనే ఆశ ప్రస్తుతం కనిపిస్తోంది. కరువు, వలసలు, నిరక్షరాస్యత రూపుమాపే దిశలో శాసనసభ్యులు కృషి చేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై మన నేతలు తెలంగాణ అసెంబ్లీలో గళమెత్తి, పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిలసాగర్ ఎత్తిపోతల పథకాల పనులు 90 శా తం మేర పూర్తయ్యాయి. మరో రూ. 628 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే నే పనులు పూర్తవుతాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం ఇంకా సర్వే దశలోనే ఉంది. జాతీయ హోదా లభించి నిధుల విడుదల జరిగితేనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తవుతుంది. హైదరాబాద్-బెంగళూరు 45వ నంబరు జాతీయ రహదారి వెన్నెముఖగా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు హామీలు ఇచ్చాయి. వల సల జిల్లాగా పేరొందిన పాలమూరులో పరిశ్రమల ఏర్పాటుతోనే స్థానికంగా ఉపాధి కల్పిస్తేనే శాశ్వత పరిష్కారం లభించనుంది. పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా మౌలిక వసతుల లేమీ, బోధనా సిబ్బంది కొరత బోధనపై ప్రభావం చూపుతోంది. జాతీయ, అంతర్జాతీయస్థాయి పరిశోధన , విద్యా సంస్థలు జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వర్షాధారంపై ఆధారపడి సాగు చేసిన రైతాంగం సాగునీటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తోంది. పత్తి విత్తన ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లాదే అగ్రస్థానం. పత్తి, వేరుశనగ వంటి పంటలపై పరిశోధనకు పెద్ద పీట వేయాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యుత్ ఉత్పత్తి పరంగా గద్వాలలో 600 మె గావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ ఉ త్ప త్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్ర కటించింది. తెలంగాణ రాష్ట్రంలో సౌ ర విద్యుత్‌కు అనువైన వాతావరణం మహబూబ్‌నగర్ జిల్లాలోనే అధికంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పా టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఔరా.. ఎంత తేడా!
సత్తెనపల్లి, న్యూస్‌లైన్ : గ్రామ సర్పంచి నుంచి పార్లమెంట్ సభ్యులకు వరకు అంతా ప్రజా ప్రతినిధులే.. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నవారే.. వారు బాధ్యతలు నిర్వర్తించే పరిధిలోనే తేడా. ఎంపీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తే జెడ్పీటీసీ జిల్లాకు, ఎంపీపీ మండలానికి, సర్పంచ్ తన గ్రామ పంచాయతీకి బాధ్యులుగా వ్యవహరిస్తుంటారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవవేతన ం లక్షల రూపాయల్లో ఉంటుంది. స్థానిక ప్రజా ప్రతినిధులకు మాత్రం మరీ దారుణం. జెడ్పీటీసీ సభ్యులకైతే మండల పరిషత్‌లో కూర్చునేందుకు కనీసం కుర్చీ కూడా కేటాయించకపోవడం మన వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతోంది. పార్లమెంట్, శాసనసభ సభ్యులుగా గెలుపొందిన వారికి విలాస వంతమైన భవనాల్లో నివాసం, కార్లు, రైళ్లు, విమానాల్లో ప్రయాణాలు, రాయితీపై వైద్యం, టెలిఫోన్ సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఒక్కసారి పోటీచేసి గెలిస్తే జీవితాంతం లభించే పింఛను, ఇలా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎంపీకి నెలకు అన్నీ కలిపి రూ. 2 లక్షలకు పైగా చెల్లిస్తుండగా,ఎమ్మెల్యేకు రూ. లక్ష వరకు అందుతుంది. ఏటా ఎంపీ నిధుల ద్వారా రూ.5 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు రూ. 50 లక్షల నుంచి కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోవచ్చు. జిల్లా, మండల పరిషత్ సమావేశాలకు హాజరైతే వీరికి మరికొంత అదనంగా చెల్లిస్తారు. ఎంపీపీకి రూ. వందల్లోనే... స్థానిక ప్రజాప్రతినిధులుగా గెలిచిన జెడ్పీటీసీ సభ్యులకు నెలకు రూ. 2,250 వేతనం చెల్లిస్తారు. అదే ఎంపీపీకి రూ. వెయ్యి మాత్రమే చెల్లిస్తారు. జిల్లా, మండల సర్వసభ్య సమావేశాలకు హాజరైతే రవాణా భత్యం రూ. వందల్లో చెల్లిస్తారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్నవారు నామినేషన్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 2,500 చెల్లించాలి. ఇతరులు రూ. 5వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీపీ స్థానానికి పోటీచేయాలనుకునేవారు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 1250, ఇతరులు రూ.2,500 చెల్లించాలి. ఎన్నికల ఖర్చు కింద జెడ్పీటీసీ అభ్యర్థులు రూ. 2 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ అభ్యర్థులు రూ. లక్షలోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో గెలిచిన జెడ్పీటీసీకి రూ. 2,250 చెల్లిస్తుండగా, ఏడాదికి రూ. 27వేలు చొప్పున ఐదేళ్ళల్లో రూ. 1.35 లక్షలు మాత్రమే అందుతాయి. ఎంపీపీకి నెలకు రూ. వెయ్యి చెల్లిస్తుండగా, ఏడాది రూ. 12వేలు చొప్పున ఐదేళ్లకు రూ. 60 వేలు అందుతాయి. ఎంపీపీలు జిల్లా సమావేశాలకు హాజరయ్యేందుకు నెలకు రూ. 500 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులకు ఐదేళ్లలో చెల్లిస్తున్న జీతాలు మొత్తం ఎన్నికల్లో వెచ్చించిన ఖర్చులకంటే చాలా తక్కువ. జెడ్పీటీసీ సభ్యుడికి మండల పరిషత్ కార్యాలయంలో కనీసం కుర్చీ కూడా ఉండదు. అరకొర వేతనం ఇస్తున్నా సర్దుకుపోతున్న జెడ్పీటీసీ సభ్యులకు కనీసం కుర్చీ కూడా కేటాయించలేదని గతంలో పలువురు సభ్యులు వాపోయిన సంఘటనలున్నాయి.