గళమెత్తాలె..!
నిధుల్లేక సగంలో నిలిచిపోయిన సాగు నీటి ప్రాజెక్టులు... పని చేయని మంచినీటి పథకాలు... దిష్టిబొమ్మల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు... రాళ్లు తేలి నడవడానికి వీలులేని రహదారులు... ఇలా మరెన్నో సమస్యలు పాలమూరు జిల్లావాసులను పట్టిపీడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభ కొలువుదీరుతున్న వేళ జిల్లానుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై ప్రజానీకం కోటి ఆశలు పెట్టుకుంది. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి, మౌలిక సౌకర్యాల కల్పన వంటి బాధ్యతలు నూతన శాసనసభ్యులకు రాబోయే కాలంలో పరీక్షగా నిలవనున్నాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దశాబ్దాల వెనుకబాటు తనానికి కొత్త రాష్ట్రంలోనైనా పరిష్కారం దొరుకుతుందనే ఆశ ప్రస్తుతం కనిపిస్తోంది. కరువు, వలసలు, నిరక్షరాస్యత రూపుమాపే దిశలో శాసనసభ్యులు కృషి చేస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై మన నేతలు తెలంగాణ అసెంబ్లీలో గళమెత్తి, పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.
నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిలసాగర్ ఎత్తిపోతల పథకాల పనులు 90 శా తం మేర పూర్తయ్యాయి. మరో రూ. 628 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే నే పనులు పూర్తవుతాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం ఇంకా సర్వే దశలోనే ఉంది. జాతీయ హోదా లభించి నిధుల విడుదల జరిగితేనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తవుతుంది. హైదరాబాద్-బెంగళూరు 45వ నంబరు జాతీయ రహదారి వెన్నెముఖగా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు హామీలు ఇచ్చాయి. వల సల జిల్లాగా పేరొందిన పాలమూరులో పరిశ్రమల ఏర్పాటుతోనే స్థానికంగా ఉపాధి కల్పిస్తేనే శాశ్వత పరిష్కారం లభించనుంది.
పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా మౌలిక వసతుల లేమీ, బోధనా సిబ్బంది కొరత బోధనపై ప్రభావం చూపుతోంది. జాతీయ, అంతర్జాతీయస్థాయి పరిశోధన , విద్యా సంస్థలు జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వర్షాధారంపై ఆధారపడి సాగు చేసిన రైతాంగం సాగునీటి కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తోంది. పత్తి విత్తన ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లాదే అగ్రస్థానం. పత్తి, వేరుశనగ వంటి పంటలపై పరిశోధనకు పెద్ద పీట వేయాల్సిన ఆవశ్యకత ఉంది.
విద్యుత్ ఉత్పత్తి పరంగా గద్వాలలో 600 మె గావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ ఉ త్ప త్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్ర కటించింది. తెలంగాణ రాష్ట్రంలో సౌ ర విద్యుత్‌కు అనువైన వాతావరణం మహబూబ్‌నగర్ జిల్లాలోనే అధికంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పా టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.