ఆ ఎమ్మెల్యేల్లో నేర చరితులే ఎక్కువ
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది నేర చరిత్ర ఉన్నవారని ఓ సర్వేలో వెల్లడైంది. మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, వారిలో 142 మంది(58 శాతం)ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నట్లు బిహార్ ఎన్నికలపై అసోసియేషన్ ఆఫ్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్ నిర్వహించిన సర్వేలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. ఆ ఎమ్మెల్యేలపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడడం వంటి కేసులు నమోదైనట్లు సమాచారం.
క్రిమినల్ చేష్టలకు పాల్పడినందుకు 70 మంది ఎమ్మెల్యేలపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేలపై హత్య, హత్యాచారం కేసులున్నాయి. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన 228 ఎమ్మెల్యేలపై సర్వే చేయగా 76 మంది(33 శాతం)ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గతంలోనే వెల్లడైంది. కొత్తగా ఎన్నికైన ప్రతి నలుగురిలో ఒకరు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.