నేడు ‘ఢీ’ఆర్సీ | Today dedicated short-range communications | Sakshi
Sakshi News home page

నేడు ‘ఢీ’ఆర్సీ

Published Sun, Nov 10 2013 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

Today dedicated short-range communications

 ఒంగోలు, న్యూస్‌లైన్:  మూడు నెలలకోసారి జరగాల్సిన డీఆర్సీ సమావేశాన్ని ఈసారి ఏకంగా ఎనిమిది నెలల తరువాత ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి స్థానిక సీపీఓ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సాకే శైలజానాథ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని కలెక్టర్ విజయ్‌కుమార్ ప్రకటించారు. సమస్యల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్న జనం తమ కోసం ప్రజాప్రతినిధులు ఏమేరకు నోరు విప్పుతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
 రైతు సమస్యలపై స్పష్టమైన  ప్రకటన వెలువడేనా..
 జిల్లాలో భారీ వర్షాలకు పంటలన్నీ తుడిచి పెట్టుకుపోయినా..రైతులకు ఇంత వరకు ప్రభుత్వం నుంచి కనీస సాయం లభించలేదు. సీఎం వచ్చి..రూ 600 కోట్ల మేర వరద నష్టం సంభవించిందని ప్రకటించారు. రైతులకు అవసరమైన వరి విత్తనాలు జిల్లాకు పంపుతామని ప్రకటించారు. కానీ ఇంత వరకు అవి జిల్లాకు చేరనే లేదు. గతంలో తుపాన్ల వల్ల పంట నష్టపోయిన వారికే ఇంత వరకు పరిహారం ఇవ్వకపోవడంపై రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  పర్చూరు, చీరాల ప్రాంతంలో వరద కాల్వల నిర్మాణం సరిగా లేదు. డ్రైనేజీ కాల్వలు   ఆక్రమణలకు గురయ్యాయి. అటువంటి వాటిపై ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా కనీస చర్యలు లేవు. ఈ సమావేశంలోనైనా వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీలు లభిస్తాయేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
 విత్తనాలకూ వెనకాడుతున్నారు:
 ప్రభుత్వం రైతులకు నగదు బదిలీ పథకం అమలుచేయడంతో సబ్సిడీ విత్తనాలు తీసుకునేందుకు సైతం వారు వెనుకాడుతున్నారు. కిలో శనగలు బహిరంగ మార్కెట్‌లో రూ 33 ఉంటే సబ్సిడీపై ఇచ్చే శనగల రేటు మాత్రం రూ 43.65 ఉంది. విత్తనాల ధర నిర్ణయంలోనే చాలా అక్రమాలు చోటుచేసుకున్నాయి. దాదాపు రెండేళ్లుగా శనగలన్నీ కోల్డు స్టోరేజీల్లోనే నిల్వ ఉన్నా విత్తన గిడ్డంగుల అధికారులు మాత్రం ముందు ప్రభుత్వ ధర ప్రకారం కొంటే తరువాత 25 శాతం సబ్సిడీ మొత్తాన్ని వారి ఖాతాలకు జమచేస్తామని ప్రకటిస్తుండడం రైతుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.  
 ముంపునకు ముగింపేదీ...
 ఒంగోలు నగరంలోని జనావాసాల ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు దాని ఊసే పట్టించుకోవడం లేదు. ఒంగోలును కార్పొరేషన్‌గా ప్రకటించారే తప్ప కనీసం మంచినీటి సమస్యకు కూడా పరిష్కారం చూపలేకపోతున్నారు. మున్సిపల్ నిధులు వెచ్చించి తాగునీరు ట్యాంకర్ల ద్వారా నీర ందించడమే తప్ప అందుబాటులో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులను ప్రారంభించేందుకు సైతం అధికారులు చొరవ చూపడంలేదు. శివారు కాలనీలు కార్పొరేషన్‌లో కలిసినా ఇంతవరకు కనీసం వీధి లైట్లు కూడా వెలగడంలేదు. ముంపునకు కారణమైన పోతురాజు కాలువ ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రూ18 కోట్లు వెచ్చించినా పనులు ముందుకు సాగడం లేదు.
 ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి ఏదీ..
 రిమ్స్‌లో  సీటీ స్కాన్ పనిచేయడం లేదు. సాక్షాత్తు అప్పటి వైద్య ఆరోగ్య శాఖామంత్రి ప్రకటించినా నేటికీ ప్లేట్‌లెట్స్ మెషీన్ అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర పురపాలక శాఖామంత్రి సొంత జిల్లా అయిన ఒంగోలు నగర పాలక సంస్థలో అయిదు నెలలుగా ప్రజారోగ్య శాఖ అధికారి పోస్టు కూడా ఖాళీగా ఉండడం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
 రోడ్లు- ప్రాజెక్టుపైనా చర్చ:
 ఒంగోలు- చీరాల రోడ్డులో ఉన్న గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి గతంలో కొంత భాగం కొట్టుకుపోయింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. శాశ్వత నిర్మాణం చేస్తామని జాతీయరహదారుల శాఖ ప్రకటించింది. అయినా ఇప్పటికీ దిక్కులేదు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ రహదారులు కోతకు గురయ్యాయి. పలు బ్రిడ్జిలు సైతం శిథిలావస్థకు చేరాయి. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఏడాదికేడాదికి అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. కానీ కేటాయిస్తున్న బడ్జెట్ మాత్రం అరకొరగానే ఉంటోంది. ఈ అంశాలు కూడా డీఆర్సీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
 చివరి డీఆర్సీ:
 గత డీఆర్సీ ఎనిమిది నెలల క్రితం జరిగింది. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ హయాంలో మరో మూడు నెలల్లో డీఆర్సీ జరుగుతుందనేది ఆశావాదమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement