సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఇంజినీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం ‘సాక్షి మీడియా గ్రూప్’ ఆధ్వర్యంలో ఆదివారం మాక్ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో వందలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు శ్రీకాకుళం పట్టణ శివారులోని మునసబుపేటలో ఉన్న గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ (గాయత్రి కళాశాల)లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) సంస్థ దీనికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం గురజాడ సంస్థ బస్సుల్ని కూడా ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఉదయం 8 నుంచి 8.20 గంటల మధ్య బస్సు ఉంటుందని పేర్కొంది. పరీక్షా సమయానికి అర్థగంట ముందుగా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.