పుట్టిన రోజు గుర్తుగా మొక్కలు నాటండి
విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పిలుపు
కర్నూలు(జిల్లా పరిషత్): ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజు నాడు గుర్తుగా ఒక మొక్క నాటి సంరక్షించాలని, ఇలా ప్రతి విద్యార్థి బాధ్యతగా నిర్వర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారిలోని రామలింగేశ్వరనగర్ రోడ్డు-2 నుంచి పార్కు వరకు నలువైపులా, రామలింగేశ్వర్ నగర్ ఉద్యానవనంలో మొక్కలు నాటారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి కేఈ మాట్లాడుతూ వంద బావులు తవ్వితే ఒక చెరువు తవ్వినట్లు, ఒకచెరువు తవ్వితే ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు ఎంత పుణ్యం వస్తుందో అలాగే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పెంచితే ఒక బిడ్డను పెంచినంత పుణ్యం వస్తుందన్నారు. ఇలా ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని, మొక్కల ప్రాదాన్యత గురించి వివరించాలని చెప్పారు.
నాలుగు లైన్ల రోడ్ల విస్తరణలో భాగంగా చెట్లను నరికేశారని, కానీ వాటి స్థానంలో కొత్త మొక్కలను పెంచలేదన్నారు. మొక్కలు నాటేందుకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు మున్సిపల్ కమిషనర్ సిద్దంగా ఉన్నారని తెలిపారు.
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ జనాభా పెరగడం, అడవులు తగ్గడంతో వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ ఎక్కువైందన్నారు. ఈ సమయంలో చెట్లు లేకపోతే జీవుల మనుగడ కష్టమవుతుందన్నారు. టెక్నాలజీ వైపు ముందుకు వెళ్తూ ప్రాణవాయువును విస్మరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధి మాట్లాడుతూ ఇంటిని శుభ్రం చేసుకున్నట్లే పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవాలని, తద్వారా వ్యాధులు రాకుండా సమాజాన్ని కాపాడుకోవచ్చన్నారు.
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మొక్కలు పెంచడం భావి భారత పౌరులైన చిన్నారులు బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఈ సమాజానికి వారే స్ఫూర్తిగా మొక్కలు నాటాలని చెప్పారు.
జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ మొక్కలు పెంచడం వల్ల సామాజిక అడవులు పెరిగి వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయన్నారు.
జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలానికి జిల్లాలో కోటి మొక్కలు పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వనమహోత్సవమైన ఈ రోజున జిలాల వ్యాప్తంగా 3లక్షల మొక్కలను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలు, కాలనీల్లో నాటుతున్నామన్నారు.
స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్ తాంతియా మాట్లాడుతూ వైజాగ్‌లో హుదూద్ తుఫాను సృష్టించిన విలయం కారణంగా నేడు మొక్కల నాటడం అనే ప్రాదాన్యత అందరికీ తెలిసి వస్తోందన్నారు. కార్తీక మాసంలో వనమహోత్సవం ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. వచ్చే కార్తీక మాసానికి ఈ మొక్కలు చెట్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మున్సిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని పచ్చదనంతో నింపేందుకు అందరి సహకారం తీసుకుంటున్నామన్నారు. ఇందులో బాగంగా మొక్కలు నాటి వదిలేయకుండా దాతల సహాయంతో వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్‌పీ ఆకె రవికృష్ణ, రాయలసీమ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతి కోయా పాండే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు హనుమంతచౌదరి, రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.