నేడు ‘ఎమ్మెల్సీ’ కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ మంగళవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరగనుంది. ఈ ఎన్నిక కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అట్ల చినవెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే మెజారిటీ లేకపోయినా పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసింది.
ఎంపీటీసీలతో బయట రాష్ట్రాల్లో క్యాంపు నిర్వహించడం, దీనిపై అధికార యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగాలు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 992 ఓట్లకుగాను 755 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల కౌంటింగ్ కోసం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఒంగోలు అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సుజాతశర్మ, ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ క్షుణ్ణంగా పరిశీలించారు. మంగళవారం జరగనున్న కౌంటింగ్ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కలెక్టర్ సంబంధిత అధికారులకు తెలియజేశారు. కౌంటింగ్ జరిగే సమయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని పేర్కొన్నారు. కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. వీరితో పాటు రిటర్నింగ్ అధికారి ఎం.హరిజవహర్‌లాల్, డీఎస్పీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో ప్రసాద్, నగరపాలక కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఉన్నారు.