ongole municipal corporation office
-
డామిట్..కథ అడ్డం తిరిగింది!
ఒంగోలు టౌన్ :డామిట్! కథ అడ్డం తిరిగింది!! ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ డివిజన్ నుంచే పోటీ చేస్తానంటూ ఇప్పటి వరకు ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన ప్రధాన రాజకీయ పార్టీల కార్పొరేట్ అభ్యర్థుల తలరాతలు మారాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఈ డివిజన్ మనదే. మనమే గెలుస్తామంటూ తమ అనుచరులకు గట్టి భరోసా ఇస్తూ వచ్చిన ప్రతిపాదిత అభ్యర్థులు బొక్కబోర్లా పడ్డారు. నాకు, మా పార్టీకి కంచుకోటగా ఉంటుందంటూ చెప్పుకొచ్చినవారు రిజర్వేషన్ల పుణ్యమా అంటూ మరో డివిజన్ చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఒంగోలు నగర పాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఆదివారం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ డివిజన్ నుంచి పోటీ చేసేది నేనేనంటూ చెప్పుకుంటూ వచ్చిన అభ్యర్థుల్లో కొంత మందికి స్థానచలనం కలిగింది. దీంతో తమకు అనుకూలమైన డివిజన్లపై కార్పొరేట్ అభ్యర్థులు కన్ను వేశారు. ఆ డివిజన్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయమై తన వర్గీయులతో చర్చల్లో మునిగిపోయారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక చోట్ల ప్రతిఘటన ఒంగోలు నగర పాలక సంస్థలోని డివిజన్లను రిజర్వేషన్ల ద్వారా మార్పులు చేర్పులు చేసుకున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆ డివిజన్ తానేదంటూ కర్చీఫ్ పరచినట్లుగా ఉన్న ప్రతిపాదిత అభ్యర్థులకు ఇతర డివిజన్లలో ప్రతిఘటన ఎదురుకానుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అన్ని డివిజన్లలో నాయకత్వాలు బలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల కారణంగా మారిన సమీకరణలతో ఆ డివిజన్లో స్థానికంగా ఉంటున్న ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ పదవిపై కన్నేశారు. అదృష్టం తలుపు తట్టినట్లుగా తన సామాజిక వర్గానికి రిజర్వ్ అయితే ఇక్కడి స్థానాన్ని మరో డివిజన్‌కు చెందిన నాయకుడు వచ్చి పాగా వేస్తానంటూ ఎలా కుదురుతుందని తమ నాయకుల వద్ద ప్రశ్నించడం మొదలెట్టారు. రిజర్వేషన్ల పుణ్యమా అంటూ వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదంటూ తమ నాయకులకు తేల్చి చెబుతున్నారు.ఈ పరిస్థితి ఒంగోలు నగర పరిధిలోని పలు డివిజన్లలో చోటు చేసుకుంటుంది. ఈ పంచాయతీని చక్కదిద్దేందుకు రెండు పార్టీలకు చెందిన కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు రంగంలో దిగుతున్నారు. రంగంలోకి నాయకత్వాలు ఒంగోలు నగర పాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ నుంచి ఒకరు చొప్పున కార్పొరేటర్ ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ పోల భాస్కర్ రిజర్వేషన్లను ఖరారు చేశారు. మొత్తం ఎస్టీ జనరల్‌కు ఒక డివిజన్, ఎస్సీ మహిళలకు నాలుగు డివిజన్లు, ఎస్సీ జనరల్‌కు ఐదు డివిజన్లు రిజర్వ్ చేశారు. బీసీలకు సంబంధించి మహిళలకు ఏడు డివిజన్లు, బీసీ జనరల్‌కు ఎనిమిది డివిజన్లు రిజర్వ్ చేశారు. జనరల్ కోటాలో మహిళలకు 14 డివిజన్లు రిజర్వ్ చేశారు. 11 డివిజన్లను అన్ రిజర్వ్డ్ కింద ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ సామాజిక వర్గాలకు చెందిన బలమైన అభ్యర్థులను కార్పొరేటర్లుగా నిలబెట్టేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు జంపింగ్ చేసే బలమైన అభ్యర్థుల విషయంలో ఆ డివిజన్‌కు చెందిన నాయకులను బుజ్జగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఘట్టం దగ్గర పడుతుండటంతో రిజర్వేషన్ల పంచాయతీని చక్కదిద్దుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. -
ఒంగోలు మేయర్ పదవి ఉత్కంఠ..!
ఒంగోలు టౌన్: ఒంగోలు నగర పాలక సంస్థ తొలి మేయర్ పదవి ఏ వర్గాన్ని వరించనుందోనన్న చర్చ నగరంలో నడుస్తోంది. తొలిసారిగా కార్పొరేషన్‌కు ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్ల పదువులు ఎవరికి రిజర్వ్ అవుతాయోనన్న చర్చ కూడా జరుగుతోంది. ఒంగోలు మేయర్ పదవితో పాటు 50 కార్పొరేటర్ల పదవులు కూడా ఏ వర్గానికి దక్కుతాయోనన్న ఉంత్కంఠ నాయకుల్లో నెలకొంది. ఒంగోలు నగరం మునిసిపాలిటీ నుంచి నగర పాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఒంగోలు నగర పాలక సంస్థ గురించి ఒక్క ఒంగోలులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజల దృష్టి ఇటువైపు ఉండటం గమనార్హం. మేయర్ పదవితో పాటు కార్పొరేటర్ల రిజర్వేషన్లను కూడా డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించనున్నారు. అక్కడి నుంచి ప్రకటన వచ్చిన తర్వాత దాన్ని నోటిఫై చేస్తూ నగర పాలక సంస్థ పబ్లికేషన్ చేయనుంది. ఒంగోలుది ఘన చరిత్ర ఒంగోలు నగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1876లో ఒంగోలు మునిసిపాలిటీగా ఆవిర్భవించింది. అనేక మంది మునిసిపల్ చైర్మన్లుగా వ్యవహరించారు. 2009లో చివరి మునిసిపల్ చైర్మన్‌గా బాపట్ల హనుమంతురావు వ్యవహరించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఒంగోలుకు ఎన్నికలు లేకుండాపోయాయి. ఒంగోలు పట్టణ జనాభా పెరిగి పోవడం.. అదే సమయంలో నగర పాలక సంస్థలు ప్రతిపాదనలోకి రావడంతో ఒంగోలును 2012 జనవరి 25వ తేదీన నగర పాలక సంస్థగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఒంగోలును నగర పాలక సంస్థగా ప్రకటించే సమయంలో చుట్టూ ఉన్న 12 గ్రామాలను కూడా ఒంగోలు నగర పాలక సంస్థలో విలీనం చేశారు. అయితే మూడు గ్రామాలకు చెందిన వారు తమను ఒంగోలు నగర పాలక సంస్థలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ మూడు గ్రామాలను తొలగించి మిగిలిన తొమ్మిది గ్రామాలతో ఒంగోలు నగర పాలక సంస్థ ఏర్పాటు చేస్తూ గజిట్ నోటిఫికేషన్ ప్రకటించారు. త్రోవగుంట, కొప్పోలు, గుత్తికొండవారిపాలెం, పేర్నమిట్ట, వెంగముక్కపాలెం, పెల్లూరు, చెరువుకొమ్ముపాలెం, ఎన్. అగ్రహారం, గుడిమెళ్లపాడు గ్రామ పంచాయతీలు ఒంగోలు నగర పాలక సంస్థలో విలీనమయ్యాయి. నగరాన్ని మొత్తం 50 డివిజన్లుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒంగోలులో 2 లక్షల 51 వేల మంది జనాభా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2 లక్షల 80 వేలకు చేరుకొంది. 2005లో చివరి ఎన్నికలు ఒంగోలు మునిసిపాలిటీగా ఉన్న సమయంలో చివరిసారిగా 2005 జూన్‌లో ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లపాటు అప్పటి కౌన్సిల్ కొనసాగింది. ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తూ వచ్చారు. రెండేళ్లపాటు ఎన్నికలు జరపకుండా అప్పటి ప్రభుత్వం కాలయాపన చేసింది. 2012 జనవరి 25వ తేదీ రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీలను నగర పాలక సంస్థలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఆ జాబితాలో ఒంగోలు కూడా ఉంది. ఒంగోలు నగర పాలక సంస్థ అయిన తర్వాత తొలిసారిగా మేయర్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు నగర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరపాలంటేనే భయపడి వాయిదా వేసుకుంటూ వచ్చింది. చివరకు తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థలైన మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగకుండానే పోయాయి. లక్షా 81 వేల 558 మంది ఓటర్లు ఒంగోలు నగర పాలక సంస్థకు ఎప్పుడు ఎన్నికల ప్రకటన వచ్చినా వాటిని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఇటీవల ఒంగోలు నగర పాలక సంస్థకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. మొత్తం లక్షా 81 వేల 558 మంది ఓటర్లుగా తేలారు. వారిలో 93951 మంది మహిళలు ఉండగా 87 వేల 573 మంది పురుషులు ఉన్నారు. మిగిలిన వారు థర్డ్ జండర్. అంతకు ముందుగానే 50 డివిజన్లకు సంబంధించి డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకోవడంతో ఏ వర్గానికి ఏ పదవి రిజర్వ్ అవుతుందోనన్న చర్చ సర్వత్రా నెలకొంది. -
కార్మికుల ఆందోళన ఉద్రిక్తం
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరపాలక సంస్థలో జీఓ నెం 279 తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జీఓ నం. 279లో భాగంగా ఆర్టీఎంఎస్, ఫేస్ రీడింగ్, జియోట్యాగింగ్ వంటివి అమలు చేయడాన్ని నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు గత ఆరురోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ వచ్చారు. ఏడవ రోజైన గురువారం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించాలని కార్మికులు నిర్ణయించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదరణ–2 పథకం కింద యూనిట్లు పంపిణీ చేసేందుకు స్థానిక శాసనసభ్యుడు హాజరవుతారని కార్మికులు భావించారు. నేరుగా ఆయన ముందే తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరుకాకపోవడం, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు ముఖ్య అతిథిగా హాజరు కావడంతో కార్యక్రమం ముగించుకొని వెళుతున్న మార్కండేయులు కారును నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో «ధర్నా చేస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. జీఓ నెం 279ని ఉపసంహరించుకోవాలని, అందుకు కమిషనర్ నుండి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దాంతో జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు కమిషనర్ ఎస్ వెంకటకృష్ణకు ఫోన్‌చేసి పిలిపించారు. జీఓ నం.279లో భాగమైన ఆర్టీఎంఎస్ అమలుపై ఒక్క అడుగు వెనక్కు వేసేది లేదని చెప్పడంతో పాటు నాలుగు గొంతులు వినిపిస్తే వాయిస్ కాదంటూ వ్యాఖ్యానించడంతో కార్మికులు, నాయకుల్లో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. తమకు న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయ గేట్ల ముందు బైఠాయించారు. అక్కడే మోహరించి ఉన్న పోలీసులు వారిని వారించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవంతంగా నాయకులు, కార్మికులను అదుపులోకి తీసుకునే సమయంలో ఇద్దరు మహిళా కార్మికులు అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు అరెస్టుచేసి వాహనాల్లో తీసుకువెళుతుండటంతో ఒక మహిళా కార్మికురాలు వాహనానికి అడ్డుగా నిలిచింది. ఆమెను కూడా పోలీసులు అరెస్టుచేసి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో సమీపంలో ఉన్న 108 వాహనంలో ఆమెను రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అరెస్టు చేసిన నాయకులు, కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ముందు సాయంత్రం ఆరు గంటల వరకు కార్మికులు, నాయకులు బైఠాయించి నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గురువారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని యూనియన్ నాయకులు ప్రకటించారు. గురువారం నాడు ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని బీసీలకు ఆదరణ–2 పథకం కింద యూనిట్ల పంపిణీకి స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్‌రావు హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులను అక్కడ పెద్ద సంఖ్యలో మోహరింప చేశారు. కమిషనర్ వ్యాఖ్యలతో ఉద్రిక్తం నాలుగు గొంతులు కలిస్తే వాయిస్ కాదు. స్కానర్ వేసుకుంటూ వెళ్లాల్సిందే. ఈ విధానాన్ని అమలు చేయడంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వెళ్లేది లేదంటూ కమిషనర్ వెంకటకృష్ణ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. కమిషనర్‌కు వ్యతిరేకంగా కార్మికులు, నాయకులు నినాదాలు చేశారు. మహిళా కార్మికులు అధికంగా ఉండటం, వారి సంఖ్యకు అనుగుణంగా మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో వారిని అదుపు చేయడం మిగిలిన పోలీసులకు కష్టసాధ్యమైంది. తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించాలంటూ కొంతమంది మహిళలు పోలీసుల తీరును ఎండగట్టారు. పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరుగుతున్న సమయంలో యూనియన్ నాయకురాలు యూ రత్నకుమారి స్పృహ తప్పి పడిపోయింది. మరో మహిళా కార్మికురాలు మార్తమ్మ కూడా స్పృహ తప్పి పడిపోయింది. రత్నకుమారిని నగర పాలక సంస్థ కార్యాలయ ముందు భాగంలో ఉన్న రూమ్‌లో ఉంచగా, మార్తమ్మను రిమ్స్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన నాయకులు శ్రీరాం శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసులు, కొర్నెపాటి శ్రీను, పద్మావతితోపాటు మరో పదకొండు మందిని వెంటనే విడుదల చేయాలంటూ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ముందు రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత కూడా బైఠాయింపు కొనసాగుతూనే ఉంది. -
నేడు ‘ఎమ్మెల్సీ’ కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ మంగళవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరగనుంది. ఈ ఎన్నిక కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అట్ల చినవెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే మెజారిటీ లేకపోయినా పోటీకి దిగిన తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసింది. ఎంపీటీసీలతో బయట రాష్ట్రాల్లో క్యాంపు నిర్వహించడం, దీనిపై అధికార యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగాలు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 992 ఓట్లకుగాను 755 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల కౌంటింగ్ కోసం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ఒంగోలు అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సుజాతశర్మ, ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ క్షుణ్ణంగా పరిశీలించారు. మంగళవారం జరగనున్న కౌంటింగ్ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కలెక్టర్ సంబంధిత అధికారులకు తెలియజేశారు. కౌంటింగ్ జరిగే సమయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని పేర్కొన్నారు. కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. వీరితో పాటు రిటర్నింగ్ అధికారి ఎం.హరిజవహర్‌లాల్, డీఎస్పీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో ప్రసాద్, నగరపాలక కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఉన్నారు. -
ఒంగోలులో చంద్రబాబు పోస్టర్లు దగ్దం
విభజనపై కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఒంగోలు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించాలి. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను కార్పొరేషన్ ఉద్యోగులు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. కోల్కత్తా - చెన్నై జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. అలాగే జిల్లాలోని కనిగిరి చర్చ్ సెంటర్లో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. చంద్రబాబు పోస్టర్లను తగులబెట్టారు. పామూరు బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముక్కు కాశిరెడ్డి, వైఎమ్ ప్రసాద్ రెడ్డిలు నిరసన చేపట్టారు.