ఒంగోలు టౌన్: ఒంగోలు నగర పాలక సంస్థ తొలి మేయర్ పదవి ఏ వర్గాన్ని వరించనుందోనన్న చర్చ నగరంలో నడుస్తోంది. తొలిసారిగా కార్పొరేషన్‌కు ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్ల పదువులు ఎవరికి రిజర్వ్ అవుతాయోనన్న చర్చ కూడా జరుగుతోంది. ఒంగోలు మేయర్ పదవితో పాటు 50 కార్పొరేటర్ల పదవులు కూడా ఏ వర్గానికి దక్కుతాయోనన్న ఉంత్కంఠ నాయకుల్లో నెలకొంది. ఒంగోలు నగరం మునిసిపాలిటీ నుంచి నగర పాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఒంగోలు నగర పాలక సంస్థ గురించి ఒక్క ఒంగోలులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజల దృష్టి ఇటువైపు ఉండటం గమనార్హం. మేయర్ పదవితో పాటు కార్పొరేటర్ల రిజర్వేషన్లను కూడా డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించనున్నారు. అక్కడి నుంచి ప్రకటన వచ్చిన తర్వాత దాన్ని నోటిఫై చేస్తూ నగర పాలక సంస్థ పబ్లికేషన్ చేయనుంది.
ఒంగోలుది ఘన చరిత్ర
ఒంగోలు నగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1876లో ఒంగోలు మునిసిపాలిటీగా ఆవిర్భవించింది. అనేక మంది మునిసిపల్ చైర్మన్లుగా వ్యవహరించారు. 2009లో చివరి మునిసిపల్ చైర్మన్‌గా బాపట్ల హనుమంతురావు వ్యవహరించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఒంగోలుకు ఎన్నికలు లేకుండాపోయాయి. ఒంగోలు పట్టణ జనాభా పెరిగి పోవడం.. అదే సమయంలో నగర పాలక సంస్థలు ప్రతిపాదనలోకి రావడంతో ఒంగోలును 2012 జనవరి 25వ తేదీన నగర పాలక సంస్థగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఒంగోలును నగర పాలక సంస్థగా ప్రకటించే సమయంలో చుట్టూ ఉన్న 12 గ్రామాలను కూడా ఒంగోలు నగర పాలక సంస్థలో విలీనం చేశారు. అయితే మూడు గ్రామాలకు చెందిన వారు తమను ఒంగోలు నగర పాలక సంస్థలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ మూడు గ్రామాలను తొలగించి మిగిలిన తొమ్మిది గ్రామాలతో ఒంగోలు నగర పాలక సంస్థ ఏర్పాటు చేస్తూ గజిట్ నోటిఫికేషన్ ప్రకటించారు. త్రోవగుంట, కొప్పోలు, గుత్తికొండవారిపాలెం, పేర్నమిట్ట, వెంగముక్కపాలెం, పెల్లూరు, చెరువుకొమ్ముపాలెం, ఎన్. అగ్రహారం, గుడిమెళ్లపాడు గ్రామ పంచాయతీలు ఒంగోలు నగర పాలక సంస్థలో విలీనమయ్యాయి. నగరాన్ని మొత్తం 50 డివిజన్లుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒంగోలులో 2 లక్షల 51 వేల మంది జనాభా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2 లక్షల 80 వేలకు
చేరుకొంది.
2005లో చివరి ఎన్నికలు
ఒంగోలు మునిసిపాలిటీగా ఉన్న సమయంలో చివరిసారిగా 2005 జూన్‌లో ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లపాటు అప్పటి కౌన్సిల్ కొనసాగింది. ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తూ వచ్చారు. రెండేళ్లపాటు ఎన్నికలు జరపకుండా అప్పటి ప్రభుత్వం కాలయాపన చేసింది. 2012 జనవరి 25వ తేదీ రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీలను నగర పాలక సంస్థలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఆ జాబితాలో ఒంగోలు కూడా ఉంది. ఒంగోలు నగర పాలక సంస్థ అయిన తర్వాత తొలిసారిగా మేయర్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు నగర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరపాలంటేనే భయపడి వాయిదా వేసుకుంటూ వచ్చింది. చివరకు తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థలైన మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగకుండానే పోయాయి.
లక్షా 81 వేల 558 మంది ఓటర్లు
ఒంగోలు నగర పాలక సంస్థకు ఎప్పుడు ఎన్నికల ప్రకటన వచ్చినా వాటిని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఇటీవల ఒంగోలు నగర పాలక సంస్థకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. మొత్తం లక్షా 81 వేల 558 మంది ఓటర్లుగా తేలారు. వారిలో 93951 మంది మహిళలు ఉండగా 87 వేల 573 మంది పురుషులు ఉన్నారు. మిగిలిన వారు థర్డ్ జండర్. అంతకు ముందుగానే 50 డివిజన్లకు సంబంధించి డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లు ఎంతమంది ఉన్నారో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకోవడంతో ఏ వర్గానికి ఏ పదవి రిజర్వ్ అవుతుందోనన్న చర్చ సర్వత్రా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment