మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరపాలక సంస్థలో జీఓ నెం 279 తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జీఓ నం. 279లో భాగంగా ఆర్‌టీఎంఎస్, ఫేస్ రీడింగ్, జియోట్యాగింగ్ వంటివి అమలు చేయడాన్ని నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు గత ఆరురోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ వచ్చారు. ఏడవ రోజైన గురువారం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించాలని కార్మికులు నిర్ణయించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదరణ–2 పథకం కింద యూనిట్లు పంపిణీ చేసేందుకు స్థానిక శాసనసభ్యుడు హాజరవుతారని కార్మికులు భావించారు. నేరుగా ఆయన ముందే తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరుకాకపోవడం, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు ముఖ్య అతిథిగా హాజరు కావడంతో కార్యక్రమం ముగించుకొని వెళుతున్న మార్కండేయులు కారును నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో «ధర్నా చేస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. జీఓ నెం 279ని ఉపసంహరించుకోవాలని, అందుకు కమిషనర్ నుండి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు.
దాంతో జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు కమిషనర్ ఎస్ వెంకటకృష్ణకు ఫోన్‌చేసి పిలిపించారు. జీఓ నం.279లో భాగమైన ఆర్‌టీఎంఎస్ అమలుపై ఒక్క అడుగు వెనక్కు వేసేది లేదని చెప్పడంతో పాటు నాలుగు గొంతులు వినిపిస్తే వాయిస్ కాదంటూ వ్యాఖ్యానించడంతో కార్మికులు, నాయకుల్లో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. తమకు న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయ గేట్ల ముందు బైఠాయించారు. అక్కడే మోహరించి ఉన్న పోలీసులు వారిని వారించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవంతంగా నాయకులు, కార్మికులను అదుపులోకి తీసుకునే సమయంలో ఇద్దరు మహిళా కార్మికులు అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు అరెస్టుచేసి వాహనాల్లో తీసుకువెళుతుండటంతో ఒక మహిళా కార్మికురాలు వాహనానికి అడ్డుగా నిలిచింది. ఆమెను కూడా పోలీసులు అరెస్టుచేసి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో సమీపంలో ఉన్న 108 వాహనంలో ఆమెను రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అరెస్టు చేసిన నాయకులు, కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ముందు సాయంత్రం ఆరు గంటల వరకు కార్మికులు, నాయకులు బైఠాయించి నినాదాలు చేశారు.
భారీగా మోహరించిన పోలీసులు
నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గురువారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని యూనియన్ నాయకులు ప్రకటించారు. గురువారం నాడు ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని బీసీలకు ఆదరణ–2 పథకం కింద యూనిట్ల పంపిణీకి స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్‌రావు హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులను అక్కడ పెద్ద సంఖ్యలో మోహరింప చేశారు.
కమిషనర్ వ్యాఖ్యలతో ఉద్రిక్తం
నాలుగు గొంతులు కలిస్తే వాయిస్ కాదు. స్కానర్ వేసుకుంటూ వెళ్లాల్సిందే. ఈ విధానాన్ని అమలు చేయడంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వెళ్లేది లేదంటూ కమిషనర్ వెంకటకృష్ణ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. కమిషనర్‌కు వ్యతిరేకంగా కార్మికులు, నాయకులు నినాదాలు చేశారు. మహిళా కార్మికులు అధికంగా ఉండటం, వారి సంఖ్యకు అనుగుణంగా మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో వారిని అదుపు చేయడం మిగిలిన పోలీసులకు కష్టసాధ్యమైంది. తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించాలంటూ కొంతమంది మహిళలు పోలీసుల తీరును ఎండగట్టారు. పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరుగుతున్న సమయంలో యూనియన్ నాయకురాలు యూ రత్నకుమారి స్పృహ తప్పి పడిపోయింది. మరో మహిళా కార్మికురాలు మార్తమ్మ కూడా స్పృహ తప్పి పడిపోయింది. రత్నకుమారిని నగర పాలక సంస్థ కార్యాలయ ముందు భాగంలో ఉన్న రూమ్‌లో ఉంచగా, మార్తమ్మను రిమ్స్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన నాయకులు శ్రీరాం శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసులు, కొర్నెపాటి శ్రీను, పద్మావతితోపాటు మరో పదకొండు మందిని వెంటనే విడుదల చేయాలంటూ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ముందు రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత కూడా బైఠాయింపు కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment