ర్యాలీ నిర్వహిస్తున్న వెలుగు ఉద్యోగులు
ఒంగోలు టూటౌన్:జిల్లాలోని వెలుగు (సెర్ఫ్) ఉద్యోగులు గురువారం రోడ్డెక్కారు. ప్రగతి భవనం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వెలుగు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇరవై ఏళ్లుగా నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలుగు ఉద్యోగులకు ఇచ్చిన హామీని ర్యాలీలో మైకుల ద్వారా ప్రజలకు వినిపించారు. చంద్రబాబు వెలుగు ఉద్యోగులకు ఇచ్చిన హామీ వాయిస్‌ను కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ విన్నారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ బుధవారం సమ్మెబాట పట్టిన వెలుగు (సెర్ఫ్ ) ఉద్యోగులు గురువారం ఉద్యమ తీవ్రతను మరింత పెంచారు. కలెక్టరేట్ సమీపంలోని చర్చి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. నాలుగు వైపులా వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.
పోలీసులు రంగ ప్రవేశం చేసినా.. తమకు అనుమతి ఉందంటూ నాయకులు ఆగ్రహించారు. తమ డిమాండ్, సమస్యలు చెప్పుకోనివ్వాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినాదించారు. అనంతరం మీడియాతో వెలుగు జేఏసీ నాయకులు మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వెలుగు జేఏసీ నాయకుడు నరేంద్రకుమార్ మాట్లాడుతూ సెర్ఫ్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వెలుగులో పనిచేసే ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సెర్ఫ్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. జేఏసీ నాయకులు అంబేడ్కర్, వెంకట్రావు మాట్లాడారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా అలవెన్సులు పెంచాలని, హెచ్‌ఆర్ లేని ఉద్యోగులకు హెచ్‌ఆర్ వర్తింపచేయాలన్నారు.
వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న ఉద్యోగులు
తమకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు 58 ఏళ్ల వరకు ఉద్యోగులను తొలగించేది లేదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు గుర్తు చేశారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ అధినేత, నారా చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నాలుగున్నరేళ్లు దాటినా నేటికీ తమకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. గత్యంతరం లేక సమ్మెబాట పట్టామన్నారు. ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకూ దశల వారీ ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ వినయ్‌చంద్‌కు వినతిపత్రం ఇచ్చారు. జేఏసీ నాయకులతో పాటు వెలుగు ఉద్యోగులు, స్టాఫ్ పాల్గొన్నారు.
నేటి నుంచి నిరాహార దీక్షులు
వెలుగు ఉద్యోగులు శుక్రవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహారదీక్షలకైనా వెనుకాడబోమని సెర్ఫ్ (వెలుగు) ఉద్యోగుల సంఘ నాయకులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment