ఓట్ల లెక్కింపు రిహార్సల్స్‌లో పాల్గొన్న ఉద్యోగులు
సాక్షి, నల్లగొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును ఈ నెల 26న పకడ్బందీగా నిర్వహించనున్నట్లు నల్లగొండ కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారులోని దుప్పలపల్లిలో గల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సకాలంలో ప్రారంభించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.
కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుందని, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6గంటలకే కౌంటింగ్ అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లు స్ట్రాంగ్‌రూం నుంచి హాల్‌కు తరలించి కౌంటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం విశ్రాంత కార్యదర్శి శ్రీ చావలి రామబ్రహ్మం మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ విధానంపై అవగాహన కల్పించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారని, ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి, ఫలితాన్ని నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
మొదట పోలింగ్‌స్టేషన్ వారీగా బ్యాలెట్ బాక్సుల్లో పోలైన ఓట్ల మొత్తాన్ని లెక్కించి, తరువాత మొదటి ప్రాధాన్యతా క్రమం ప్రకారం అభ్యర్థి వారీగా ఓట్లు లెక్కిస్తారన్నారు. ఈ క్రమంలో చెల్లుబాటు కాని ఓట్లను మినహాయించి, మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపునకు కావాల్సిన కోటాను నిర్ణయిస్తారని, ఒకవేళ మొదటిరౌండ్‌లో ఏదేని అభ్యర్థి కోటాకు కావాల్సిన ఓట్లను పొందితే, అతడినే గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటిస్తామన్నారు. ఒకవేళ ఏ అభ్యర్థికీ కోటాకు కావాల్సిన ఓట్లు రానట్లయితే, తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని తొలగింపజేసి, అతనికి పోలైన ఓట్లను కొనసాగింపులో ఉన్న ఇతర అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమం ఆధారంగా పంపిణీ చేస్తామన్నారు.
ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థి కోటాకు కావాల్సిన ఓట్లు పొందేవరకు, లేనట్లయితే ఆఖరు అభ్యర్థి మినహా మిగతా అభ్యర్థులందరూ తొలగింపబడేంతవరకు కొనసాగుతుందన్నారు. అనంతరం కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు కౌంటింగ్‌పై రిహార్సల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ రవీంద్రనాథ్, సూర్యాపేట జిల్లా డీఆర్‌ఓ చంద్రయ్య, అసిస్టెంట్ కలెక్టర్ ఉదయ్ కుమార్, ట్రైనింగ్స్ నోడల్ అధికారి ఎస్.పీ.రాజ్ కుమార్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఆర్‌ఓ పి.శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి శ్రీనివాసమూర్తి, మాస్టర్ ట్రైనర్ తరాల పరమేశ్‌తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment