నేడే సకల జన భేరి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఆదివారం హైదరాబాద్‌లో జరిగే సకల జనభేరి సదస్సు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ భేరిని విజయవంతం చేసేందుకు తెలంగాణ జేఏసీ అన్నివిధాలా కసరత్తు పూర్తి చేసింది. నిజాం కాలేజీ మైదానంలో సభావేదికను ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు నేతల ప్రసంగాలు మొదలవుతాయి. అప్పటివరకు ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాదాపు రెండు వందల మంది కూర్చొనేందుకు వీలుగా సభా వేదికను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల జేఏసీ కన్వీనర్లతో పాటు జేఏసీ భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలందరినీ సభా వేదికపైకి ఆహ్వానిస్తారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా సభలో పాల్గొనే అవకాశం ఉంది. సభలో పాల్గొనేందుకు లక్ష మందికి పైగా తరలివస్తారని జేఏసీ నేతలు అంచనా వేస్తున్నారు.
భారీగా తరలివస్తారు..: హరీష్‌రావు
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మాట్లాడిన మాటలు చూశాక తెలంగాణవాదులు భారీ సంఖ్యలో సకల జనభేరికి తరలిరానున్నారని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్‌రావు అన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రి మాటలన్నీ అసత్యాలని నిరూపించాలని ఆయన పిలుపునిచ్చారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో సభా వేదిక ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీ ప్రసాద్, విద్యుత్ జేఏసీ నేత రఘు, జేఏసీ కోకన్వీనర్ విఠల్, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరులు సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు.
బుక్కెడు బువ్వ గుక్కెడు నీళ్లతో తరలిరండి: దేవీప్రసాద్
సకల జనభేరిలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రజలు బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్లతో లక్షలాదిగా తరలిరావాలని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ దేవాలయాల అర్చక ఉద్యోగుల మహా సభలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పక్షాల సమ్మతితోనే తెలంగాణను కేంద్రం ప్రకటించిందని, ఇప్పుడు సీఎం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని టీజేఏసీ కోచైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం శేరిలింగంపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాగా.. సకల జనభేరికి తరలిరావాలని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రవణ్‌కుమార్, కన్వీనర్ రాజ్‌కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌తో కోదండరాం తదితర తెలంగాణ జేఏసీ నేతలు నోవాటెల్ హోటల్‌లో ఆదివారం ఉదయం భేటీ కానున్నారు.