ఇబ్బంది పెట్టేలా మోడీ వ్యవహరిస్తున్నారు
హైదరాబాద్ : గవర్నర్ అధికారాలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం అయితే న్యాయపోరాటానికి సిద్ధమని ఆయన తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని కేటీఆర్ శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. కేంద్రం వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని ఆయన అన్నారు. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అగాధం పెంచే విధంగా నిర్ణయం ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఎవరి రాజకీయ ఒత్తిడిలకు లొంగి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తనకు దూరంగా ఉన్న రాష్ట్రాలను ఇబ్బంది పెట్టేవిధంగా మోడీ వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడం రాజకీయ కుట్రగా అభివర్ణించారు. కేంద్రం లేఖపై మిగితా రాష్ట్రాల సీఎంలను కలిసి చర్చిస్తామన్నారు.