ఒంగోలు, న్యూస్‌లైన్: పల్లె పాలకులు ఎవరో నేడు తేలనుంది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు ముగిసి మూడేళ్లు గడిచిన తరువాత జరిగిన ఎన్నికలు కావడంతో పల్లె తీర్పుపై ప్రజలతో పాటు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం 769 ఎంపీటీసీ స్థానాలకు 2025 మంది అభ్యర్థులు,
56 జెడ్పీటీసీ స్థానాలకు 211 మంది బరిలో ఉన్నారు.
బ్యాలెట్ ప్రక్రియ కావడంతో లెక్కింపులో జాప్యం జరిగే అవకాశాలున్నాయి. బ్యాలెట్లు సరిచూసుకోవడం, వాటిని కట్టలుగా కట్టడంతో పాటు ఏజెంట్లకు బ్యాలెట్లు అందకుండా చూసుకోవడంలోనూ అధికారులు పూర్తిస్థాయిలో శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఓటు అదృశ్యమైనా..అది పోలింగ్‌బూత్ మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తరువాత ఎంపీటీసీ స్థానాల కౌంటింగ్ జరుగుతుంది. ఇవి రెండూ పూర్తయ్యాక జెడ్పీటీసీ స్థానాల కౌంటింగ్ ప్రారంభిస్తారు. గతంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అర్ధరాత్రి వరకు కౌంటింగ్ జరిగిన దృష్ట్యా ఈ దఫా కూడా దాదాపు రాత్రి పదిగంటల వరకు కౌంటింగ్ జరగొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఒంగోలు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి 25 మండలాల ఎన్నికల ఓట్ల లెక్కింపును రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. సంతనూతలపాడు మండలం ఎండ్లూరు డొంక సమీపంలోని ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలోని సౌత్‌కార్నర్ బిల్డింగ్‌లో 11 మండలాలు, పీజీ బ్లాక్‌లో ఒకటి, ‘ఒ’ బ్లాక్‌లో 8 మండలాలు, రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో 5 మండలాల కౌంటింగ్ జరుగుతుంది.
కందుకూరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి కందుకూరు టీఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ఒకటి, ప్రకాాశం ఇంజినీరింగ్ కాలేజీలోని మెయిన్‌బ్లాక్‌లో 5 మండలాలు, పీజీ బ్లాక్‌లో 5 మండలాలు, పాలిటెక్నిక్ బ్లాక్‌లో 5 మండలాలకు కౌంటింగ్ జరుగుతుంది.
మార్కాపురం సమీపంలోని దరిమడుగు వద్ద ఉన్న ఇందిరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఏడు మండలాలు, అదే ప్రాంతంలోని శామ్యూల్‌జార్జి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మరో 8 మండలాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ విజయకుమార్ తెలిపారు.
భారీ బందోబస్తు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును డీఎస్పీలు పర్యవేక్షిస్తారని ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల కౌంటింగ్ స్థానిక రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాలలో, ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో 23 మండలాల కౌంటింగ్ జరుగుతుందన్నారు. రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాల వద్ద చీరాల డీఎస్పీ నరహర బందోబస్తు పర్యవేక్షిస్తారు.
ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒంగోలు డీఎస్పీ పి.జాషువా బందోబస్తు పర్యవేక్షిస్తారు. కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల కౌంటింగ్‌ను కందుకూరులో నిర్వహిస్తున్నారు. అక్కడ కందుకూరు డీఎస్పీ శంకర్ బందోబస్తు పర్యవేక్షిస్తారు. మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కౌంటింగ్‌ను మార్కాపురం డీఎస్పీ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తారు. వీరితో పాటు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 35 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధులు నిర్వహిస్తారు.
సోమవారం సాయంత్రమే ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వహించాలో చార్టు తయారు చేసి బాధ్యతలు ఆయా డీఎస్పీలకు అప్పగించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో వీరితో పాటు ఏఆర్ పోలీసు బలగాలు ఉంటాయి. వీరంతా మంగళవారం ఉదయం 6 గంటల నుంచే కౌంటింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉంటారు. జిల్లాలోని తీవ్ర సమస్యాత్మక గ్రామాలను గుర్తించి కౌంటింగ్ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు
Published Tue, May 13 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
Advertisement
Advertisement