నిరీక్షణ ఉండదిక.. | Toll Gate Fee Pay In Online At Prakasam | Sakshi
Sakshi News home page

నిరీక్షణ ఉండదిక..

Published Tue, Nov 19 2019 11:22 AM | Last Updated on Tue, Nov 19 2019 11:22 AM

Toll Gate Fee Pay In Online At Prakasam - Sakshi

టోల్‌ రుసుము చెల్లించడానికి ఇకపై వాహనం నిలిపి వరసలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. రుసుము చెల్లించే సమయంలో ఇకపై చిల్లర సమస్య కూడా ఎదురు కాదు. చేతికి వచ్చిన నలిగిన, చిరిగిన నోట్ల గురించి టోల్‌ ఆపరేటర్లతో గొడవ పడాల్సిన పనీ ఉండదు. రాకపోకలకు తీసుకున్న రశీదు తిరుగు ప్రయాణంలో కన్పించకపోతే ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. టోల్‌ గేటు వద్దకు వాహనం వచ్చిందా.. సెకన్ల వ్యవధిలో స్కానింగ్‌ పూర్తయిందా.. క్షణాల్లోనే మీ బ్యాంకు ఖాతా నుంచి రుసుము టోల్‌ ఖాతాకు బదిలీ అయిందా. టోల్‌ గేటు తొలగిందా.. వెళ్లామా.. ఇంతే... ఇక టోల్‌ గేట్ల వద్ద అమలు కానున్న ఫాస్టాగ్‌ పద్దతి ఇదే.

సాక్షి, ఒంగోలు: జిల్లాలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్ల వద్ద డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఫాస్టాగ్‌ సేవలు అమలుకానున్నాయి. మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద, టంగుటూరు వద్ద గల టోల్‌గేట్ల వద్ద గరిష్ట సమయాల్లో పదుల సంఖ్యలో వాహనాలు టోల్‌ రుసుం చెల్లించడానికి బారులు తీరుతున్నాయి. ఇలాంటి సమస్య ప్రకాశంలోనే కాదు. జాతీయ రహదారులపై మొత్తంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు, ప్రయాణంలో కాలహరణం టోల్‌ వద్ద రుసుం చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యమే. ఈ విషయంపై జాతీయ రహదారుల విభాగం అధికారులు అధ్యయనం చేస్తే సగటున ఒక్కొక్క వాహనానికి కనీసం 15 సెకనులకు తగ్గకుండా రుసుం చెల్లింపునకు సమయం పడ్తుంది. గరిష్టంగా అర్థనిముషం సమయం పడ్తున్నట్లుగా గుర్తించారు.

జాతీయ రహదారులపై నిత్యం ట్రాఫిక్‌ రద్దీ నెలకొంటోంది. టోల్‌ రుసుం చెల్లింపుల్లో జరుగుతున్న అధిక సమయం వల్ల ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావమే చూపుతోంది. దీనిని నివారించడానికి టోల్‌గేట్ల వద్ద నిరీక్షణ సమయాన్ని కుదించడానికి ‘ఫాస్టాగ్‌’ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నారు. జాతీయ రహదారుల అధీకృత సంస్థ ఉన్నతాధికారుల బృందం మంగళవారం మంగళగిరి వద్ద గల కాజా టోల్‌గేటు వద్ద నుంచి జిల్లాలో బొల్లాపల్లి, టంగుటూరు, కావలి వద్ద గల  ముసునూరు టోల్‌గేట్ల వద్ద జరుగుతున్న లావాదేవీలు పరిశీలించనుంది. అక్కడ వాహనదారులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం నెల్లూరులోని నాయ్‌ కార్యాలయంలో ఫాస్టాగ్‌ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్న అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు.

నగదు రహిత లావాదేవీలే ప్రాధాన్యం
నగదు రహిత లావాదేవీలు బాగా పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోనూ ఈ లావాదేవీలు బాగా పెరిగాయి. ఆటోమొబైల్, మాల్‌ సెంటర్లు, షాపింగ్, వస్త్ర దుకాణాలతో పాటు ఆన్‌లైన్‌ బుకింగ్‌ల లావాదేవీలు బాగా పెరిగాయి. గత ఏడాది కేవలం 18 శాతంగానే నగదు రహిత లావాదేవీలు ఉంటే, ఇప్పుడు 42 శాతంగా లావాదేవీలు పెరిగాయి. చిల్లర వర్తకుల వద్ద ఇప్పుడిప్పుడే నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయి. రానున్న కొద్ది నెలల వ్యవధిలోనే డిజిటల్‌ లావాదేవీలు, నగదు రహిత లావాదేవీల శాతం మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే టోల్‌గేట్ల వద్ద రోజులో భారీగానే నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేలకు పైగా వాహనాలు టోల్‌గేట్ల వద్ద నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం వసూలవుతున్న నగదు బ్యాంకుల్లో తిరిగి కట్టడం, తిరిగి ఇతర లావాదేవీలకు డ్రా చేయడం వంటివి ఇక క్రమంగా తగ్గించనున్నారు. దీనికి గాను నవంబర్‌ నెలాఖరు డెడ్‌లైన్‌. డిసెంబర్‌ ఒకటి నుంచి నగదు రహిత లావాదేవీలు టోల్‌గేట్ల వద్ద అమలు కానున్నాయి. ఫాస్టాగ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

డిసెంబర్‌ ఒకటి నుంచి ఒక్కలైనులోనే అనుమతి..
డిసెంబర్‌ ఒకటో తేది నుంచి బొల్లాపల్లి, టంగుటూరు టోల్‌ గేట్ల వద్ద ఒక్క లైనులోనే మాన్యువల్‌ చెల్లింపులకు అనుమతిస్తారు. ఇక 12 లైన్లలోనూ ఫాస్టాగ్‌ సేవలే అందుబాటులో ఉంటాయి. విజయవాడకు వెళ్లే మార్గంలో ఒకటో లైను, నెల్లూరు మార్గంలో 14వ లైనులోనే మాన్యువల్‌గా రుసుం తీసుకుంటారు. కొద్ది నెలల తర్వాత ఈ ఒక్క లైనును తొలగించి ఫాస్టాగ్‌ ద్వారానే చెల్లింపులను అనుమతిస్తారు. 

  • అన్ని టోల్‌గేట్ల వద్ద ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఃమై ఫాస్టాగ్‌ యాప్‌’ డౌన్‌లోడు చేసుకోవాలి. టోల్‌గేట్ల వద్ద, బ్యాంకుల్లో వారి ఖాతాలకు అనుసంధానించి ట్యాగ్‌లను జారీ చేస్తున్నారు. ముందుగా ట్యాగ్‌ తీసుకొనే వారు రూ.2 వేల డిపాజిట్‌ చెల్లించాలి. వాహనంపై ట్యాగ్‌ అతికించుకోవాలి. వాహనం టోల్‌గేటు వద్దకు రాగానే స్కానర్లు వాహనం అద్దంపై ఉన్న ట్యాగ్‌ను స్కాన్‌ చేసి బ్యాంకు ఖాతా నుంచి రుసుం డ్రా చేసి టోల్‌ ఖాతాకు జమచేస్తుంది. సంక్షిప్త సమాచారం ద్వారా ఎంత మొత్తంలో కట్‌ అయిందో వివరాలు సెల్‌ఫోన్‌కు వివరాలు వస్తాయి.
  • ఇప్పటి వరకు ఒంగోలు–విజయవాడ వెళ్లేవారు బొల్లాపల్లి టోల్‌గేటు వద్ద ఒక వైపునకు రూ.140, రాకపోకలకైతే 24 గంటల వ్యవధిలో రూ.210 చెల్లిస్తున్నారు.అంటే రూ70 వరకు రాయితీ వస్తుంది. ఇప్పుడు ఫాస్టాగ్‌లో ఒక వైపు రూ.140 కట్‌ అవుతుంది. తిరుగు ప్రయాణం అదే వాహనం 24 గంటల వ్యవధిలోపు వస్తే రూ.210కి సరిపడా అంటే రూ.70 మాత్రమే కట్‌ అవుతుంది. కొన్ని టోల్‌గేట్ల వద్ద రాకపోకలకు ఇలాంటి సౌకర్యం అందుబాటులో ఉంది. కొన్నింటికి ఒక వైపే తీసుకుంటున్నారు.అలాంటి టోల్‌గేట్ల వద్ద ఈ సౌకర్యం వర్తించదు.
  • దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్లపై డిసెంబర్‌ ఒకటి నుంచి ఈ ఫాస్టాగ్‌ వ్యవస్ధ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే శంషాబాద్‌ విమానాశ్రయంలో ఫాస్టాగ్‌ సేవలు ప్రారంభించారు. జిల్లాలోనూ ఫాస్టాగ్‌ ట్రయల్‌ రన్‌ జరుగుతోంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా పర్యవేక్షణలో ఫాస్టాగ్‌ ఏర్పాటు చేశారు. వాహన చోదకులు ఒక సారి నమోదు చేసుకుంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ కార్డును జారీ చేస్తారు. ఈ కార్డును వాహనం అద్దంపై అతికించుకొని సంభందిత లైన్‌లో వెళ్లినప్పుడు రుసుం ఆటోమ్యాటిక్‌గా కట్‌ అవుతుంది. వాహనదారులకు సంక్షిప్త సమాచారం ద్వారా కట్‌ అయిన మొత్తం వివరాలు వస్తాయి. 

సులభతరం కానున్న రుసుం చెల్లింపు..
దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ రుసుం వసూలు చేసే విధానం రానున్న రోజుల్లో ట్రాఫిక్‌ నియంత్రణ, కాలహరణం నివారించడం వంటి సౌకర్యాలు కలగనున్నాయి. రాత్రి వేళల్లో టోల్‌ గేట్ల వద్ద వాహనాన్ని నిలిపి రుసుం చెల్లించాలి్సన అవసరం ఉండదు. జాతీయ రహదారుల అనంతరం రాష్ట్ర రహదారుల్లోని టోల్‌ గేట్ల వద్ద ఈ విధానమే అమలు చేయనున్నారని అధికారులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement