యోగం ట్రేడర్స్ లెసైన్స్‌ల్లో గందరగోళం? | Traders Yogam license Confused? | Sakshi
Sakshi News home page

యోగం ట్రేడర్స్ లెసైన్స్‌ల్లో గందరగోళం?

Published Thu, Dec 11 2014 3:00 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM

యోగం ట్రేడర్స్ లెసైన్స్‌ల్లో గందరగోళం? - Sakshi

యోగం ట్రేడర్స్ లెసైన్స్‌ల్లో గందరగోళం?

ఉయ్యూరు : పట్టణంలో యోగం ట్రేడర్స్ మాయాజాలం ఘటనతో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వామినాథన్ ట్రేడర్స్ ఏర్పాటుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అంతా మాయ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపల్, వాణిజ్య పన్నుల అధికారుల నుంచి తీసుకున్న లెసైన్సులపైనా విచారణ కొనసాగుతోంది. వ్యాపార లెసైన్సులపై ఆరా తీస్తే మరో కొత్త కోణం బయటపడింది. పట్టణంలో సగానికి పైగా దుకాణాలకు చట్టప్రకారం లెసైన్సులు లేనట్లు తెలిసింది.
 
జనం డబ్బుతోనే !
తమిళనాడుకు చెందిన స్వామినాథన్ జనం డబ్బుతోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాడు. ముందుగా తన వ్యాపారానికి జిల్లాలో అనువైన ప్రాంతాలను ఎంచుకున్నాడు. హనుమాన్‌జంక్షన్, కంకిపాడు, ఉయ్యూరు ప్రాంతాలను ముందుగా ఎంచుకున్నాడు. ఎక్కడ వ్యాపారం ప్రారంభిస్తే ప్రయోజనం ఉంటుందో పరిశీలించాడు. ముందుగా ఉయ్యూరు పట్టణాన్ని ఎంచుకుని కాకాని గిరిజన కాలనీలో యోగం ట్రేడర్స్‌కు శ్రీకారం చుట్టాడు.

ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్థాపించాలంటే ట్రేడ్ లెసైన్స్, వృత్తి లెసైన్సును వాణిజ్య పన్నుల శాఖ, వ్యాపారం నిర్వహించే చోట సంబంధిత గ్రామ అధికారి నుంచి తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం దుకాణం ఏర్పాటు చేసే భవనం యజమాని ఆమోదంతో లీజ్ అగ్రిమెంట్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ సమర్పించాలి. నిబంధనల ప్రకారం ఇవేమీ సమర్పించకుండానే యోగం ట్రేడర్స్ వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు తెలిసింది.

మునిసిపల్ అధికారులకు స్వామినాథన్ వృత్తి పన్ను చలానా కట్టినట్లు సమాచారం. ఈ అంశంపై కమిషనర్ శ్రీనివాసరావును ‘సాక్షి’ వివరణ కోరగా, వ్యాపారానికి సంబంధించి స్వామినాథన్ అనే వ్యక్తి తమకు దరఖాస్తు చేసుకోలేదని, ఎలాంటి లెసైన్సు ఇవ్వలేదని చెప్పారు. వృత్తి పన్ను కోసం చలానా కట్టారని వివరణ ఇచ్చారు.

వాణిజ్య పన్నుల శాఖ నుంచి పొందిన లెసైన్సుపై పోలీసులకే స్పష్టత దొరకలేదు. చట్టంలో ఉన్న లొసుగులను, అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకునే యోగం ట్రేడర్స్ లాంటి మాయగాళ్లు అక్రమమార్గంలో వ్యాపార సంస్థలను స్థాపించి జనం నెత్తిన కుచ్చు టోపీ పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
అక్కడ.. కాదు ఇక్కడంటూ..
యోగం ట్రేడర్స్ నిర్వాహకుడు పోలీసులనే ముప్పు తిప్పలు పెడుతున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాలు, ప్రజాప్రతినిధుల సూచన మేరకు స్వామినాథన్ నుంచి సొమ్ము రికవరీ చేసి వచ్చిన మొత్తాన్ని బాధితులందరికీ సర్దే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే రూ.4 లక్షలకుపైగా విలువ చేసే సరుకు ఉన్నట్లు నిర్ధారించారు. మరో రూ.7 లక్షలు ఎక్కడుందో తేలాల్సి ఉంది.

ఈ సొమ్ము రాబట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించడంలేదు. ఒంగోలు, నెల్లూరు, తెనాలి, విజయవాడ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చానని స్వామినాథన్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో వారు ఆ ప్రాంతాలకు అతడిని తీసుకువెళితే అక్కడ చుక్కెదురైనట్లు సమాచారం. ఇదేమిటని ప్రశ్నిస్తే.. అక్కడ కాదు ఇక్కడ అంటూ పోలీసులనే తికమకపెడుతున్నాడని తెలిసింది.
 
కొందరు బాధితుల తీరు ఇలా..
బాధితుల్లో కొందరు టౌన్ స్టేషన్‌కు వెళ్లి స్వామినాథన్‌ను వదిలేయాలని పోలీసులతో వాదనకు దిగడం కొసమెరుపు. అతడిని వదిలేస్తే ఉన్న వస్తువులు తమకు ఇచ్చేస్తాడని వారు వాదిస్తున్నారు. ఈ పరిణామాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. స్వామినాథన్‌ను వదిలేస్తే బాధితులందరికీ న్యాయం జరగదనేది పోలీసుల వాదన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement