నేర నియంత్రణకు జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా వాహన తనిఖీలు, మహిళారక్షక్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వీటితో ఎంతో ఉపయోగం ఉన్నా కిందిస్థాయి అధికారులు, సిబ్బంది చర్యలతో అవి నీరుగారుతున్నాయి. ఉన్నతాధికారుల వద్ద మార్కులు పొందేందుకు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీసులను చూస్తేనే నగరవాసులు హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
నెల్లూరు(క్రైమ్): ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించే వారికి గతంలో పోలీసులు జరిమానా విధించేవారు. ఈప్రక్రియలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని గుర్తించిన జిల్లా ఎస్పీ నవంబర్ 8వ తేదీ నుంచి ఈ–చలానా విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ–చలానా విధించే సమయంలో వాహనదారుడు ఎక్కడ నిబంధన ఉల్లంఘించాడో స్పష్టంగా ఫొటో తీయాలనే నిబంధన ఉంది. వీటిని కొందరు సిబ్బంది పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులకు రోజూ ఎన్ని కేసులు నమోదు చేశామో చూపించుకునేందుకు ఇష్టానుసారంగా ఈ–చలానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. కొందరు అధికారులు వాహనాల్లో కూర్చొని కిందిస్థాయి సిబ్బందికి ఈ–చలానా పరికరాన్ని ఇచ్చేస్తున్నారని ఆరోపణలున్నాయి. నగరంలోని అనేక షాపింగ్‌మాల్స్, హోటల్స్, వాణిజ్య సముదాయాలకు పార్కింగ్ స్థలాల్లేవు. సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు అందుకు భిన్నంగా వాహనదారులపై నో పార్కింగ్ పేరిట కేసులు నమోదు చేస్తున్నారు.
భిన్నంగా వ్యవహరిస్తున్నారు
మహిళలు, విద్యార్థినులపై వే«ధింపులు నిరోధించి వారికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఇటీవల మహిళారక్షక్ టీమ్‌లను ఎస్పీ ఏర్పాటు చేశారు. నగరంలోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో ఆరు బృందాలు, మహిళా పోలీసు స్టేషన్ ఆధ్వర్యంలో మూడు బృందాలను నియమించారు. టీమ్‌లు మఫ్టీలో తిరుగుతూ పోకిరీలను గుర్తించి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయాల్సి ఉంది. నేరచర్రిత ఉన్నవారు పట్టుబడితే వారిపై వెంటనే కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే పలు మహిళారక్షక్ బృందాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులకు రోజువారి నివేదికను పంపేందుకు అమాయకులను స్టేషన్‌కు తరలించి మందలిస్తున్నారు. పోలీసులను ప్రశ్నిస్తే కేసు పెడతారని, కెరీర్ దెబ్బతింటుందని అనేకమంది బాధను లోలోపలే దిగమింగుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవా
ల్సిన అవసరం ఉంది.
కొన్ని ఉదాహరణలు
⇒ నెల్లూరు అల్లీపురానికి చెందిన సుమన్ వద్ద వాహనానికి సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయి. తనిఖీలు చేస్తున్న పోలీసులకు వాటిని చూపించాడు. అయినా ఫైన్ ఎందుకు సార్ అని అడిగినందుకు అతడికి రూ.500 జరిమానా విధించారు.
⇒ బట్వాడిపాళెంకు చెందిన ఓ వ్యక్తి ఆచారివీధికి వెళ్లి అక్కడ పనిముగించుకుని ఇంటికి వచ్చిచూడగా సెల్‌ఫోన్‌కు రూ.235 కట్టాలని మెసేజ్ వచ్చింది. మెసేజ్‌లో ఉన్న లింక్‌ను తెరచిచూడగా బైక్ నంబర్ ప్లేట్ మాత్రమే తీసి రాంగ్‌పార్కింగ్ అంటూ రాసి ఉంది. దీంతో అతను నిర్ఘాంతపోయాడు.
⇒ బీటెక్ చదువుతున్న విద్యార్థులు రోడ్డుపై నిలబడి ఉండగా మహిళారక్షక్ టీమ్ సభ్యులు వచ్చి ఏ విషయం చెప్పకుండా పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎందుకు తీసుకువచ్చారని విద్యార్థులు ప్రశ్నించగా ఈవ్‌టీజింగ్ చేస్తారా అంటూ తమదైన శైలిలో మందలించారు. దీంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు.
⇒ బస్సుకోసం వేచి ఉన్న డిగ్రీ విద్యార్థులను పోలీసు స్టేషన్‌కు తరలించి మందలించడంతో వారు తీవ్రమనోవేదనకు గురయ్యారు. తమను అకారణంగా స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు నెల్లూరు నగరంలో నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అమాయకులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
ఉల్లంఘనులకే ఈ–చలానాలు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికే ఈ–చలానాలు ఇస్తున్నాం. మెసేజ్ నేరుగా వాహనదారుడికి చేరుతుంది. అందులో ఎక్కడ ఉల్లంఘన జరిగిందో అందుకు సంబంధించిన ఫొటో ఉంటుంది. అవకతవకలు జరిగే అవకాశం లేదు.– మల్లికార్జునరావు, ట్రాఫిక్ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment