వీఆర్ సిద్ధార్థలో విషాదం
కానూరు (పెనమలూరు) : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి ఘటన కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో తీవ్ర విషాదం నింపింది.కాలేజీలో సరదాగా ఉండే ఇంజనీరింగ్ మొదటి ఏడాది ఐటీ చదువుతున్న చింతలపూడి మనోజ్‌దార్గాసాయిశ్రీకాంత్, దేవినేని జయనాగసాయికృష్ణ,పోతన సుభాష్‌లు నదిలో మునిగి చనిపోయారనే వార్తను సహ విద్యార్థులు, అధ్యాపకులు జీర్ణించుకోలేకపోతున్నారు. హోలీ అయినప్పటికీ కళాశాల బుధవారం యథావిధిగా పనిచేసింది. ఆ ముగ్గురూ తరగతులకు హాజరైనా బతికేవారేమోనని మిత్రులు కంటతడి పెట్టారు.
గత ఏడాది ఘటన మరవక మందే...
గత ఏడాది ఇదే కాలేజీకి చెందిన ముగ్గురు సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఫైనల్ విద్యార్థులు కృష్ణానదిలో మునిగి చనిపోయారు.వారు కంకిపాడు మండలం మద్దూరు వద్ద నదిలో చెక్ డ్యామ్ నిర్మాణంపై పరిశోధనకు వెళ్లి ఇసుక తవ్విన గుంతలో పడి నీట మునిగి చనిపోయారు. అది మరవక మందే ఇప్పుడు ఈ ఘటన జరగడంతో అందరు దిగ్భ్రాంతికి గురయ్యారు.
శ్రద్ధాంజలి ఘటించిన విద్యార్థులు
ముగ్గురు విద్యార్థులు చనిపోవటంతో కాలేజీలో డీన్ పాండురంగారావు ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు.విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై రెండు నిమిషాలు మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని మౌనం పాటించారు. కాలేజీకి సెలవు ప్రకటించారు.
బాధ్యతతో ఉండాలి: డీన్ పాండురంగారావు
ఇంజినీరింగ్ విద్యార్థులపై చాలా బాధ్యత ఉందని, వారు జీవితాన్ని తేలికగా తీసుకోరాదని డీన్ బావినేని పాండురంగారావు అన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారని, దీన్ని విద్యార్థులు గుర్తించాలని కోరారు.