సెలవులకు అని వెళ్లి కానరాని లోకాలకు.. | The tragedy! | Sakshi
Sakshi News home page

సెలవులకు అని వెళ్లి కానరాని లోకాలకు..

Published Wed, Jan 21 2015 3:49 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

సెలవులకు అని వెళ్లి కానరాని లోకాలకు.. - Sakshi

సెలవులకు అని వెళ్లి కానరాని లోకాలకు..

సంక్రాంతి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లి సరదాగా గడిపిన చిన్నారులు, వారిని తీసుకురావడానికి వెళ్లిన తండ్రి, చిన్నానలను రోడ్డు ప్రమాదం కబలించింది. సోమవారం హైదరాబాద్‌లో ఉల్లాసంగా గడిపి అర్ధరాత్రి గోదావరిఖని వస్తున్న వారికి అదే ఆఖరి ప్రయాణమైంది. మెదక్ జిల్లా కొండపాక  మండలం వెలికట్ట వద్ద మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడడం గోదావరిఖనిలో విషాదాన్ని నింపింది.  - గోదావరిఖని
 
గోదావరిఖని: గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాంతానికి చెందిన ముజీబుద్దీన్(48), ఆయన సోదరుడు రజీయోద్దీన్(45) స్థానిక మేదరిబస్తీ రోడ్డులో రాయల్ స్వీట్‌హౌస్‌ను నిర్వహిస్తున్నారు. ముజీబుద్దీన్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా, రజీయోద్దీన్‌కు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ముజీబుద్దీన్ భార్య షహనాజ్ హైదరాబాద్‌లోని పుట్టినింటికి తన నలుగురు పిల్లలతో పాటు రజీయోద్దీన్ ఇద్దరు పిల్లలను తీసుకెళ్లింది.

సెలవులు ముగియడంతో వారిని తీసుకువచ్చేందుకు మరో సోదరుడు ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఉంటున్న మోహిజోద్దీన్‌తో కలిసి ముగ్గురు అన్నదమ్ములు సోమవారం తమ సొంత వాహనంలో హైదరాబాద్ వెళ్లారు. సాయంత్రం 4గంటలకు అత్తగారింటి నుంచి పిల్లలను తీసుకుని మొత్తం తొమ్మిది మంది వ్యాన్‌లో బయల్దేరారు. రాత్రి 11గంటల వరకు హైదరాబాద్‌లోనే ఎగ్జిబిషన్‌ను తిలకించి ఉల్లాసంగా గడిపారు. అనంతరం ముజీబోద్దీన్ తన బావమరిది అనీస్‌కు ఫోన్ చేసి తాము గోదావరిఖనికి వెళ్తున్నట్టు చెప్పాడు.

ఇంత రాత్రి సమయంలో వద్దని అతడు వారించినా వినకుండా అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. వాహనాన్ని రజీయోద్దీన్ నడుపుతున్నాడు. మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని కొండపాక మండలం వెలికట్ట గ్రామం వద్దకు వచ్చేసరికి వ్యాన్ అదుపుతప్పి రాజీవ్ రహదారిపైనున్న కల్వర్టును ఢీకొట్టింది. వాహనం ఎనిమిదిసార్లు పల్టీలు కొట్టి రోడ్డుపక్కనున్న గుంతలో బోల్తాపడింది.

మంగళవారం వేకువజామున 2.30-3గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న ముజీబుద్దీన్, అతడి తమ్ముడు రజీయోద్దీన్, ముజీబుద్దీన్ కుమారుడు తాలీబ్(18), కూతురు ముస్కాన్(13) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ముజీబుద్దీన్ మరో ఇద్దరు కుమార్తెలు రంషా, సుమయ, రజీయోద్దీన్ కుమార్తెలు సనా, సుమన్, ముజీబోద్దీన్ అన్న

మోహిజోద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుకునూరుపల్లి ఎస్సై కృష్ణ నేతృత్వంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమయ, మోహిజోద్దీన్ పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రులందరినీ హైదరాబాద్‌కు తరలించారు. గోదావరిఖనిలోని కుటుంబసభ్యులు, బంధువులు ఉదయం 6గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

సిద్దిపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను సాయంత్రం గోదావరిఖని తీసుకొచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడడం, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో వారి బంధువులు, సన్నిహితులు విషాదానికి లోనయ్యారు. సంఘటన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అడ్డగుంటపల్లిలోని మృతుల నివాసానికి తండోపతండాలుగా తరలివచ్చి విలపించారు.
 
రంజాన్‌కు ప్రత్యేక రుచులు..
కాగజ్‌నగర్‌కు చెందిన ముజీబుద్దీన్ కుటుంబం ముప్పై ఏళ్ల క్రితం గోదావరిఖనికి వలస వచ్చింది. ముజీబోద్దీన్ తన సోదరులతో కలిసి కలిసి స్థానిక శివాజీనగర్‌లో పోచమ్మగుడి వద్ద స్వీట్‌హౌస్ నిర్వహిస్తూ జిలేబీ తయారు చేసేవారు. తర్వాత దుకాణాన్ని మేదరిబస్తీ రోడ్డుకు మార్చారు. గోదావరిఖనిలో ప్రత్యేకంగా జిలేబీ, మిర్చి తయారు చేస్తూ ప్రతీ రంజాన్ పండుగకు హరీస్, హలీమ్ రుచులను ఖనివాసులకు అందించేవారు. సోదరుడు మసీయోద్దీన్ ఆరు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించగా... ఆయన ముగ్గురు కూతుళ్లకు మంగళవారం మరణించిన ముజీబుద్దీన్, రజీయోద్దీన్‌లే వివాహాలు జరిపించి అక్కున చేర్చుకున్నారు.
 
విద్యాసంస్థలు, దుకాణాలు బంద్
ముజీబుద్దీన్, రజీయోద్దీన్ మరణించడంతో సంతాప సూచకంగా స్వీట్‌షాపులతో పాటు పలు దుకాణాలను వ్యాపారస్తులు మూసివేశారు. గాంధీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న తాలీబ్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న ముస్కాన్ మృతికి సంతాపంగా విద్యాసంస్థలను మూసివేశారు. వివిధ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వ్యాపారస్తులు మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement