ఒంగోలు: ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాలెం- టంగుటూరు స్టేషన్ల మధ్య గురువారం రైళ్లలో దోపిడీ గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తపంథాలో జరిగిందని గుంతకల్లు రైల్వే ఎస్పీ ఎం.సుబ్బారావు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.దోపిడీకి పాల్పడిన వారు బీహార్ గ్యాంగ్ సభ్యులు అయి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా సిగ్నల్ బ్లాక్ చేసి ఈ దోపిడీకి పాల్పడ్డారని సుబ్బారావు వివరించారు. ఈ దోపిడిపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. సిగ్నల్ వ్యవస్థను బ్రేక్ చేయటంతో సెన్సార్లు ఫెయిలయ్యాయని...దీంతో ఆకుపచ్చ లైట్లు వెలగకుండా ఎర్రలైట్లు వెలిగాయి. దాంతో రైలు ఆగింది. రైలులోకి దుండగులు ప్రవేశించి దోపిడికి పాల్పడ్డారని వివరించారు.