దయచేసి వినండి.. రైళ్లన్నీ లేటండి!
గోదావరి పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. గంటల తరబడి ఆలస్యం, రెట్టింపు సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఒక్కసారిగా ప్రత్యేక రైళ్లను రద్దు చేయడం, కనీస వసతులు కల్పించకపోవడం.. వంటి కారణాలతో ప్రయాణికులు నరకాన్ని చవిచూస్తున్నారు. దీంతో సహనం కోల్పోతున్న కొందరు ప్రయాణికులు.. రైల్వే అధికారులపై తిరగబడుతున్నారు.
- పుష్కర ప్రయాణం ప్రహసనమే..
- సహనాన్ని పరీక్షిస్తున్న రత్నాచల్
- రాకపోకల్లో తీవ్ర జాప్యం
- ఆలస్యంగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లు
- రద్దయిన రైళ్లతో అవస్థలు
- తిరగబడుతున్న ప్రయాణికులు
సాక్షి, విజయవాడ : ‘గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.. ప్రత్యేక రైళ్లను నడపడం వల్ల రద్దీని ఎదుర్కొంటాం.’ అని ఆర్భాటంగా చెప్పిన రైల్వే అధికారులు అమలులో మాత్రం పూర్తిగా విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. తొలుత పుష్కరాలకు 32లక్షల మంది వస్తారని భావించి అందుకు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లు నడుపుతామని ప్రకటించారు. అయినా.. విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు అన్ని రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరూ ప్రమాదకరంగా ప్రయాణిస్తుంటే.. సమయానికి రాని, ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుతున్న కొన్ని రైళ్లు సహనానికి పరీక్ష పెడుతున్నాయి.
ప్రత్యేక రైళ్లతో పాట్లు
పుష్కరాల కోసం వేసిన ప్రత్యేక రైళ్లు కూడా ఐదారు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో రైల్వే అధికారులు కొన్నింటిని ఉన్న పళంగా రద్దు చేస్తున్నారు. విజయవాడ మీదుగా వెళ్లే ధర్మవరం-విశాఖపట్నం, విశాఖపట్నం-ధర్మవరం స్పెషల్ రైలును ఈ నెల 26, 27 తేదీల్లో, గుంతకల్-నర్సాపూర్-గుంతకల్ వెళ్లే ప్రత్యేక రైలును ఈనెల 25, 26 తేదీల్లో రద్దు చేశారు. పుష్కరాల ప్రారంభ తొలి రెండు రోజుల్లో రెండు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రత్యేక రైళ్లు వేశారని వాటికి టికెట్లు బుక్ చేసుకుంటే ఒక్కసారిగా రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రైళ్ల జాప్యాన్ని తొలగించేందుకే కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
గంటలకొద్దీ నిరీక్షణ
విజయవాడ నుంచి రాజమండ్రికి సాధారణంగా మూడు గంటల్లో వెళ్లొచ్చు. అయితే, రాజమండ్రి స్టేషన్‌లో ప్రయాణికులు దిగడానికి కనీసం 15 నిమిషాలు పడుతోంది. దీంతో విజయవాడ నుంచి బయల్దేరిన రైళ్లను తాడేపల్లిగూడెం దాటిన తరువాత నవాబుపాలెం, నిడదవోలు, చాగల్లు, కొవ్వూరు స్టేషన్లలో గంటల తరబడి నిలిపేస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి చేరుకోవడానికి సుమారు నాలుగైదు గంటలు పడుతోందని సమాచారం.
ప్రయాణికుల తిరుగుబాటు
ఎంతో ఉత్సాహంతో పుష్కర సాన్నానికి బయల్దేరుతున్న ప్రయాణికులు రైళ్ల ఆలస్యంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దీనికితోడు రైళ్లలో రెట్టింపు జనం, కనీసం కాలు మోపేందుకు చోటు లేకపోవడం, స్టేషన్లలో గంటల తరబడి నిలిచిపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారి కోపం కట్టలు తెంచుకుంటోంది. దీంతో రైల్వే సిబ్బంది, రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్లపై తిరగబడుతున్నారు. ఇదిలావుంటే.. రెండు గంటలు వేచి ఉన్న తరువాత కూడా రైలు రాకపోవడంతో కొంతమంది ప్రయాణం రద్దు చేసుకుని తిరుగుముఖం పడుతుండగా, మరికొంతమంది ఉసూరుమంటూ బస్టాండ్‌వైపు అడుగులు వేస్తున్నారు. గత శుక్రవారం రైలు రద్దు కావడంతో ఒక్కసారిగా బస్టాండ్‌లో రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ అధికారులు అప్పటికప్పుడు వందకుపైగా ప్రత్యేక బస్సులు వేశారు.
‘రత్నాచల్’తో చుక్కలే..
విజయవాడ నుంచి రాజమండ్రి, విశాఖపట్నంవైపు వెళ్లే వారికి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎంతో అనుకూలం. ఉదయం 6 గంటలకు ఈ రైలు ఎక్కితే కేవలం మూడు గంటల్లో రాజమండ్రి చేరుకోవచ్చు. అందుకే రెండు నెలల ముందుగానే పుష్కర ప్రయాణికులు టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. అయితే, ఈ రైలు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు వెళ్తుందో.. రైల్వే అధికారులే చెప్పలేకపోతున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరాల్సిన రత్నాచల్ మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లింది. గత శనివారం మూడున్నర గంటలు ఆలస్యంగా 9.30 గంటలకు వెళ్లింది. ఈ రైలు రాజమండ్రి వెళ్లేసరికి ఆరు గంటలు, విశాఖపట్నం వెళ్లే సరికి 12 గంటలు పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక గుంటూరు నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 6 గంటలకు నగరానికి రావాల్సి ఉండగా, మధ్యాహ్నం 4.30 గంటలకు వచ్చి ప్రయాణికుల ఓర్పును పరీక్షించింది.