Pushkarni Godavari
-
రామాలయంలో టిక్కెట్ల మాయాజాలం!
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన అవకతవకలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల బాగోతం బట్టబయలౌతుంది. రాములోరి సొమ్మును సొంతానికి వాడుకుంటున్న ఇంటిదొంగల ఆటకట్టించేందుకు ప్రస్తుత ఈవో కూరాకుల జ్యోతి ఒకింత కఠినంగానే వ్యవహరించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. భద్రాచలం స్టోర్ నిర్వహణలో తలెత్తిన లోపాలు, పర్ణశాలలో మాయమైన సరుకులు, తాజాగా పర్ణశాలలో వెలుగులోకి వచ్చిన టిక్కెట్ల మాయాజాలం ఇలా వరుస ఘటనలు ఆలయానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నాయి. ఆయా విభాగాల అధికారులు సరిగా పర్యవేక్షణ చేయకపోవటంతోనే ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో జ్యోతి సెలువులో ఉన్న సమయంలో ఇంచార్జి ఈవోగా వ్యవహరించిన రమేష్‌బాబు భద్రాచలం స్టోర్ ఇంచార్జి, పర్ణశాలకు గుమస్తాలను సస్పెండ్ చేసిన సంగతి విధితమే. రెండు నెలల స్టాక్ నిల్వలను పుస్తకంలో నమోదు చేయలేదనే కారణంతో సెలవులో ఉనా, స్టోర్ ఇంచార్జిపై వేటు వేసిన అధికారులు, వరుస తప్పిదాలు బయటకు వస్తున్నా, పర్యవేక్షకులపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంలో ఏదో మతలబు దాగిఉందనే ప్రచారం జరుగుతుంది. రెండు నెలల పాటు స్టాక్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయలేదనే విషయం ఈవోను గమనిస్తే కానీ వెలుగులోకి రాలేదు. ప్రతీ వారం దీనిపై పర్యవేక్షణ ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. అదేవిధంగా పర్ణశాలలో పుష్కరాలకు సంబంధించిన టిక్కెట్లును ఉద్యోగులకు పంపిణీ చేసిన సమయంలోనే ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకూ ఇచ్చామనేది నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ పుష్కరాలు గడిచి, నెల రోజుల తరువాత డబ్బులు జమ చేసే సమయంలో ఇవి బయటం పడటం పర్యవేక్షణ లేమిని వెల్లడి చేస్తుంది. ఈ మొత్తం పరిణామాలకు ఒక్కరే పర్యవేక్షకులు కాగా, జరిగిన లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆలయలోని మరికొంతమంది అధికారులు అతనికి వత్తాసు పలుకుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈవో జ్యోతి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. కాగా ఇదే విషయమై ఈవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు. -
ఆఖరి రోజూ అదే రద్దీ
- బోగీ పట్టాలు తప్పడంతో రైళ్లు ఆలస్యం - కిటకిటలాడిన రైల్వేస్టేషన్ - 100 ప్రత్యేక బస్సుల ఏర్పాటు సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాల ఆఖరిరోజు శనివారం కూడా నగరం నుంచి వేలాది మంది పుష్కర స్నానాలకు వెళ్లారు. అయితే, గత శని, ఆదివారాలతో పోలిస్తే ఆఖరి రోజు పుష్కరాలకు వెళ్లిన వారి సంఖ్య తక్కువగానే ఉందని రైల్వే, ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకే పుష్కరాలు ముగుస్తాయని ప్రకటించడంతో ఉదయం పూటే ఎక్కువ మంది స్నానాలకు తరలివెళ్లారని అధికారులు తెలిపారు. ఆలస్యంగా నడిచిన రైళ్లు చేబ్రోలు- బాదంపూడి మధ్య రాయగడ పాసింజర్‌లోని ఒక బోగీ కొద్దిగా పట్టాలు తప్పింది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమై దాన్ని సరిచేయించి పంపారు. ఒకవైపు పుష్కరాల రద్దీ, మరోవైపు బోగీ పట్టాలు తప్పడంతో రాజమండ్రి వైపు నుంచి వచ్చే రైళ్లు రెండు, మూడు గంటలు ఆలస్యంగా వచ్చాయి. శనివారం ఉదయం 8 ప్రత్యేక రైళ్లు యధావిధిగా నడిచాయి. మూడేసి గంటలు ఆలస్యంగా వెళ్లాయి. పుష్కర స్నానానికి వెళ్లేవారు, యాత్రను ముగించి వచ్చేవారితో ఉదయం స్టేషన్ కిటకిటలాడినా.. మధ్యాహ్నం తరువాత కొంత ఖాళీగా కనిపించింది. 100 ప్రత్యేక బస్సులు శుక్రవారం రాత్రి పుష్కరాల కోసం 150 బస్సులు ఏర్పాటుచేసిన ఆర్టీసీ శనివారం మరో వంద నడిపింది. ఉదయం బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ప్రైవేటు ట్రావెల్స్ ఆధ్వర్యంలో కేశినేని భవన్ నుంచి 50 బస్సులు నడిపారు. -
హిమగిరి ఎత్తు గురితో..
వరద నీరు బిరబిరా ప్రవహించిపోరుునట్టు.. చూస్తుండగానే.. ‘చూసువారలకు మాటలకందని ముచ్చట’గా, ‘స్నానం చేసువారలకు ఏ కాటా చాలని పున్నెపుమూట’గా సాగుతున్న గోదారమ్మ పుష్కరపర్వంలో పదిరోజులు గడిచిపోయూరుు. ‘తనపై గురి హిమగిరి ఎత్తున ఉందా? తన ఒడిలో ఓలలాడాలనే బిడ్డలు ఇన్నికోట్లున్నారా?’ అని ఆ నదీమతల్లే విస్తుబోరుు, కెరటాల కనురెప్పలు విప్పార్చి చూసేస్థారుులో.. తెలుగు రాష్ట్రాల్లోని నలుచెరగుల నుంచీ; దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచీ; విదేశాల నుంచీ భక్తులు పోటెత్తారు. వరదవేళ బ్యారేజి లాకులెత్తితే కడలి దిక్కుకు దుమికే జలరాశిలా జనరాశి తీరాలకు పరవళ్లు తొక్కారు. పదోరోజైన గురువారం ప్రతి రేవూ భక్తజన సింధువే అరుుంది. - గోదారమ్మను చేరుతున్న భక్తజనఝరి - పదోరోజూ ఉరవడి తగ్గని పుష్కర సంరంభం - గురువారం 33 లక్షల మంది పుణ్యస్నానాలు - సెలవు రోజులను తలపించిన వైనం - మరో రెండు రోజూలూ ఇంతే ! - బ్యారేజి గేట్లు ఎత్తడంతో తేటపడనున్న ఘాట్ల నీరు రాజమండ్రి : పన్నెండేళ్లకోసారి పన్నెండురోజులు జరిగే గోదావరి పుష్కరాల్లో పదిరోజులు గడిచిపోయూయి. గురువారం కూడా రాజమండ్రి సహా జిల్లాలోని ఘాట్లు భక్తులతో కిక్కిరిశారు. సెలవు రోజుల్లో మాదిరిగా యాత్రికులు పోటెత్తారు. ఈ నదీపర్వంలో చివరి రెండురోజులైన శుక్ర, శనివారాలు ఈ సంఖ్య మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. గురువారం రాజమండ్రి నగరంలో పలుమార్లు, పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించి భక్తులు అష్టకష్టాలు పడ్డారు. పుష్కరాలు ఆరంభమైన తరువాత గత శని, ఆదివారం సెలవు రోజుల్లో యాత్రికులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. గురువారం మరోసారి అదే తాకిడి కనిపించింది. రాత్రి ఎనిమిది గంటల సమయానికి జిల్లాలో పుష్కరస్నానాలు చేసినవారి సంఖ్య 33 లక్షల మందికి చేరింది. పుష్కరాలు ఆరంభమయ్యూక ఒకేరోజు 30 లక్షల మంది దాటి భక్తులు రావడం ఇది నాల్గవసారి. రాజమండ్రిలో కోటిలింగాలు, పుష్కరఘాట్లు జనసంద్రంగా మారాయి. కోటిలింగాల ఘాట్‌కు తాకిడి మరీ ఎక్కువగా ఉంది. కోటిపల్లి ఘాట్‌లో 2.30 లక్షల మందికి పైగా స్నానాలు చేశారు. అంతర్వేదిలో 50 వేల మంది, కుండలేశ్వరంలో 40 వేలు, అప్పనపల్లిలో 55 వేలు, సోంపల్లిలో 75 వేల మంది పుష్కర స్నానాలు చేశారు. మిగిలిన గ్రామీణ ఘాట్లలో సైతం స్నానాలు చేసిన వారి సంఖ్య గణనీయంగానే ఉంది. పదే పదే అవే ఇక్కట్లు.. యాత్రికుల రద్దీతోపాటు వారి ఇక్కట్లు కూడా భారీగా పెరిగాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో నిలబడేందుకు సైతం జాగాలేక ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ వద్ద పరిస్థితి మరీదారుణంగా ఉంది. బస్సులు బయటకు వచ్చేందుకు, లోనికి వెళ్లేందుకు సైతం స్థలం లేక పోవడం, బస్టాండ్ బయటే బస్సులు నిలిచిపోవడంతో తాడితోట- మోరంపూడి రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించింది. హైవేలో కూడా స్వల్పంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మూడు కోట్లకు చేరువలో.. జిల్లాలో పుష్కరస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం మూడు కోట్లకు చేరుకునే అవకాశముంది. పుష్కరాలు ఆరంభమైన ఈ పది రోజుల్లో సుమారు 2.72 కోట్ల మంది స్నానాలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో పుష్కరాలు ముగుస్తున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంది. శుక్రవారం కూడా ఇదే స్థాయిలో భక్తుల తాకిడి ఉంటే స్నానాలు చేసిన వారి సంఖ్య మూడు కోట్లుదాట నుంది. పుష్కరస్నానం చేసిన ప్రముఖులు ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి సరస్వతిఘాట్‌లో పుష్కరస్నానం చేశారు. ఆయనతోపాటు సినీరంగానికి చెందిన ప్రముఖ నటుడు, వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు విజయచందర్, అడిషనల్ డీజీపీ ఆర్.పి.ఠాకూర్, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.సి.శర్మ, డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కన్నబాబు పుణ్యస్నానాలు చేశారు. గోదావరికి పెరిగిన ఇన్‌ఫ్లో గోదావరి పరీవాహక ప్రాంతంలో బుధవారం కురిసిన వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో పెరిగింది. సీలేరు నుంచి రోజూ విడుదలవుతున్న పది వేల క్యూసెక్కుల నీటికి తోడు ఇన్‌ఫ్లో పెరగడంతో బ్యారేజ్ నుంచి గురువారం 56,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇదే సమయంలో డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి నీరు సముద్రంలోకి విడుదల చేయడంతో.. ఇప్పటి వరకూ ఘాట్లలో కలుషితమైన నీరు పోయి.. కొత్తనీరు రానుంది. ఈ రెండు రోజులూ భక్తులు కొంచెం స్వచ్ఛమైన నీటిలో స్నానం చేసే అవకాశం లభించింది. -
తిండి లేదు...వసతి దొరకదు !
- పుష్కరాల్లో సిబ్బంది ఇబ్బందులు చిత్తూరు (అర్బన్) : ప్రపంచమే తలెత్తి చూసేలా గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇక్కడ పనిచేసే సిబ్బంది గోడును ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. పుష్కరాల విధులకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. పుష్కరాల విధుల్లో ఉన్న వారికి కనీసం భోజనం, వసతులు ఏర్పాటు చేయకపోవడంతో జిల్లా నుంచి వెళ్లిన సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. పుష్కరాల కోసం జిల్లా నుంచి దాదాపు 1600 మంది పోలీసులు, 200 మంది మునిసిపల్ ఉద్యోగులు, సిబ్బంది వెళ్లారు. ఇతర శాఖల నుంచి 500 మంది వరకు పుష్కరాల విధులకు వెళ్లారు. వీరిలో గెజిటెడ్ ర్యాంకు ఉన్న అధికారులకు కొద్దో గొప్పో కాస్త తినడానికి తిండి, ఉండటానికి చోటు కల్పించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందిని పూర్తిగా విస్మరించారు. ప్రధానంగా పారిశుద్ధ్య పనుల నిర్వహించడానికి జిల్లా నుంచి వెళ్లిన మునిసిపల్ కార్మికులు తిండి లేకుండా అలమటిస్తున్నారు. వీరికి టీఏ, డీఏలు ఇస్తామని తీసుకెళ్లిన అధికారులు పనులు చేయమని రాజమండ్రి ఇతర ప్రాంతాల్లో విధులు కేటాయించారు. అయితే సమయానికి భోజనాలు పంపించడం లేదని విధుల్లో ఉన్న కొందరు సిబ్బంది ఫోన్ ద్వారా వారి ఆవేదన వ్యక్తంచేశారు. ఆలయాల వద్ద పెట్టే ప్రసాదాలు తిని కడుపు నింపుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ఎప్పుడో పొట్లాల్లో ప్యాక్ చేసి ఉంచిన భోజనాలు పంపిస్తుండటంతో అవి పాచిపోయి కంపుకొడుతున్నాయని తెలిపారు. విధులు పూర్తిచేసిన తరువాత ఉండటానికి గదులు ఇవ్వకపోవడంతో గుడుల వద్ద, రోడ్డు పక్కన పడుకోవాల్సి వస్తోందని చె ప్పారు. పట్టించుకునే దిక్కులేదు... తిండీ తిప్పలు, బస సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పుష్కరాల విధు ల్లో ఉన్న పర్యవేక్షకులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అదిగో.. మీ సమస్య తీర్చేస్తాం, ఇప్పుడే భోజనాలు పంపిస్తాం.. అంటూ జిల్లాకు చెందిన సిబ్బందిని కొందరు అధికారులు మభ్యపెడుతున్న ట్లు బాధితులు వాపోతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దితే తప్ప తమ సమస్యలు తీరవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దయచేసి వినండి.. రైళ్లన్నీ లేటండి!
గోదావరి పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. గంటల తరబడి ఆలస్యం, రెట్టింపు సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఒక్కసారిగా ప్రత్యేక రైళ్లను రద్దు చేయడం, కనీస వసతులు కల్పించకపోవడం.. వంటి కారణాలతో ప్రయాణికులు నరకాన్ని చవిచూస్తున్నారు. దీంతో సహనం కోల్పోతున్న కొందరు ప్రయాణికులు.. రైల్వే అధికారులపై తిరగబడుతున్నారు. - పుష్కర ప్రయాణం ప్రహసనమే.. - సహనాన్ని పరీక్షిస్తున్న రత్నాచల్ - రాకపోకల్లో తీవ్ర జాప్యం - ఆలస్యంగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లు - రద్దయిన రైళ్లతో అవస్థలు - తిరగబడుతున్న ప్రయాణికులు సాక్షి, విజయవాడ : ‘గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.. ప్రత్యేక రైళ్లను నడపడం వల్ల రద్దీని ఎదుర్కొంటాం.’ అని ఆర్భాటంగా చెప్పిన రైల్వే అధికారులు అమలులో మాత్రం పూర్తిగా విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. తొలుత పుష్కరాలకు 32లక్షల మంది వస్తారని భావించి అందుకు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లు నడుపుతామని ప్రకటించారు. అయినా.. విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు అన్ని రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరూ ప్రమాదకరంగా ప్రయాణిస్తుంటే.. సమయానికి రాని, ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుతున్న కొన్ని రైళ్లు సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ప్రత్యేక రైళ్లతో పాట్లు పుష్కరాల కోసం వేసిన ప్రత్యేక రైళ్లు కూడా ఐదారు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో రైల్వే అధికారులు కొన్నింటిని ఉన్న పళంగా రద్దు చేస్తున్నారు. విజయవాడ మీదుగా వెళ్లే ధర్మవరం-విశాఖపట్నం, విశాఖపట్నం-ధర్మవరం స్పెషల్ రైలును ఈ నెల 26, 27 తేదీల్లో, గుంతకల్-నర్సాపూర్-గుంతకల్ వెళ్లే ప్రత్యేక రైలును ఈనెల 25, 26 తేదీల్లో రద్దు చేశారు. పుష్కరాల ప్రారంభ తొలి రెండు రోజుల్లో రెండు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రత్యేక రైళ్లు వేశారని వాటికి టికెట్లు బుక్ చేసుకుంటే ఒక్కసారిగా రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రైళ్ల జాప్యాన్ని తొలగించేందుకే కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. గంటలకొద్దీ నిరీక్షణ విజయవాడ నుంచి రాజమండ్రికి సాధారణంగా మూడు గంటల్లో వెళ్లొచ్చు. అయితే, రాజమండ్రి స్టేషన్లో ప్రయాణికులు దిగడానికి కనీసం 15 నిమిషాలు పడుతోంది. దీంతో విజయవాడ నుంచి బయల్దేరిన రైళ్లను తాడేపల్లిగూడెం దాటిన తరువాత నవాబుపాలెం, నిడదవోలు, చాగల్లు, కొవ్వూరు స్టేషన్లలో గంటల తరబడి నిలిపేస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి చేరుకోవడానికి సుమారు నాలుగైదు గంటలు పడుతోందని సమాచారం. ప్రయాణికుల తిరుగుబాటు ఎంతో ఉత్సాహంతో పుష్కర సాన్నానికి బయల్దేరుతున్న ప్రయాణికులు రైళ్ల ఆలస్యంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దీనికితోడు రైళ్లలో రెట్టింపు జనం, కనీసం కాలు మోపేందుకు చోటు లేకపోవడం, స్టేషన్లలో గంటల తరబడి నిలిచిపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారి కోపం కట్టలు తెంచుకుంటోంది. దీంతో రైల్వే సిబ్బంది, రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్లపై తిరగబడుతున్నారు. ఇదిలావుంటే.. రెండు గంటలు వేచి ఉన్న తరువాత కూడా రైలు రాకపోవడంతో కొంతమంది ప్రయాణం రద్దు చేసుకుని తిరుగుముఖం పడుతుండగా, మరికొంతమంది ఉసూరుమంటూ బస్టాండ్‌వైపు అడుగులు వేస్తున్నారు. గత శుక్రవారం రైలు రద్దు కావడంతో ఒక్కసారిగా బస్టాండ్‌లో రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ అధికారులు అప్పటికప్పుడు వందకుపైగా ప్రత్యేక బస్సులు వేశారు. ‘రత్నాచల్’తో చుక్కలే.. విజయవాడ నుంచి రాజమండ్రి, విశాఖపట్నంవైపు వెళ్లే వారికి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఎంతో అనుకూలం. ఉదయం 6 గంటలకు ఈ రైలు ఎక్కితే కేవలం మూడు గంటల్లో రాజమండ్రి చేరుకోవచ్చు. అందుకే రెండు నెలల ముందుగానే పుష్కర ప్రయాణికులు టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. అయితే, ఈ రైలు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు వెళ్తుందో.. రైల్వే అధికారులే చెప్పలేకపోతున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరాల్సిన రత్నాచల్ మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లింది. గత శనివారం మూడున్నర గంటలు ఆలస్యంగా 9.30 గంటలకు వెళ్లింది. ఈ రైలు రాజమండ్రి వెళ్లేసరికి ఆరు గంటలు, విశాఖపట్నం వెళ్లే సరికి 12 గంటలు పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక గుంటూరు నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 6 గంటలకు నగరానికి రావాల్సి ఉండగా, మధ్యాహ్నం 4.30 గంటలకు వచ్చి ప్రయాణికుల ఓర్పును పరీక్షించింది. -
మహాజనపాతం
గోదావరికి వెల్లువొచ్చినట్టు.. పుష్కర రాజధాని రాజమహేంద్రిని ముంచెత్తిన జనప్రవాహం.. జలపాతాన్ని తలపించింది. పావన గోదావరిలో పుణ్యస్నానం చేయాలన్న ఆతృతతో అన్నివైపుల నుంచీ భక్తజనవాహిని ఈ నగరిని చుట్టేసింది. ఏ రోడ్డు చూసినా.. ఏ సందు చూసినా.. గుంపులుగుంపులుగా సాగుతున్న జనమే.. వారు నడిచే ప్రతి దారీ గోదారి దరికే దారి తీశాయి. వారు చేరిన ప్రతి కూడలీ అడుగుతీసి అడుగు వేయలేనంతగా కిక్కిరిసిపోయాయి. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి నగరం.. సోమవారం జనసాగరమే అయింది. జిల్లాలోని ఇతర స్నానఘట్టాల్లోనూ ఇటువంటి దృశ్యాలే ఆవిష్కృతమయ్యాయి. - ఘాట్ల వద్ద జనజాతర - సోమవారం ఒక్క రోజే 35 లక్షల మంది పుష్కర స్నానం - నేటితో రెండు కోట్లు దాటనున్న యాత్రికుల సంఖ్య రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు పోటెత్తిన భక్తజన వరద కాస్త తగ్గినా.. పుష్కరాల ప్రధాన వేదికగా ఉన్న రాజమండ్రి నగరం, జిల్లాలోని గోదావరి తీర గ్రామాలు ఇంకా జనవాహిని ముంపులోనే ఉన్నాయి. శని, ఆదివారాలతో పోల్చుకుంటే జనం కొంతవరకూ తగ్గినా కానీ అంచనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో యాత్రికులు సోమవారం కూడా పుష్కర స్నానాలకు తరలివచ్చారు. వారి రాకతో రాజమండ్రి నగరం, గ్రామీణ ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లు, ఆయా ప్రాంతాలు కిటకిటలాడాయి. రాజమండ్రి నగరంలోని కొన్ని ప్రాంతాలు ఇసుక వేస్తే రాలనంతగా వచ్చిన జనంతో కిక్కిరిసిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం సోమవారం రాత్రి 8 గంటల సమయానికి జిల్లావ్యాప్తంగా 35,11,746 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. రాత్రికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా. పుష్కరాలు ఆరంభమైన తరువాత ఇప్పటి వరకు 1.91 కోట్ల మందికిపైగా భక్తులు స్నానాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తొలి రోజైన 14న 18.01 లక్షలు, 15న 16.32 లక్షలు, 16న 22.42 లక్షలు, 17న 22.11 లక్షలు, 18న 38.95 లక్షలు, 19న 37.86 లక్షలు, సోమవారం 35.11 లక్షల (రాత్రి తొమ్మిది గంటలకు) మంది స్నానాలు చేశారు. 1.40 లక్షల పిండప్రదానాలు జరిగాయి. సోమవారం గ్రామీణ ఘాట్లలో సైతం భక్తుల తాకిడి స్వల్పంగా తగ్గింది. కోటిపల్లిలో 2 లక్షల మంది స్నానాలు చేయడం గమనార్హం. అప్పనపల్లి ఘాట్‌లో 1.50 లక్షలు, సోంపల్లిలో 90 వేలు, మురమళ్లలో 50 వేలు, గేదెల్లంకలో 35 వేలు, కుండలేశ్వరంలో 65 వేల మంది చొప్పున భక్తులు స్నానాలు చేశారు. నేటితో రెండు కోట్లు జిల్లావ్యాప్తంగా పుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య మంగళవారంతో రెండు కోట్లకు చేరనుంది. గడచిన ఏడు రోజుల్లో ఇప్పటివరకూ 1.91 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు. మరో 9 కోట్ల మంది భక్తులు స్నానం చేస్తే భక్తుల సంఖ్య రెండు కోట్లకు చేరనుంది. నిరంతరాయంగా 24 గంటలూ స్నానాలకు అనుమతి ఇవ్వడంతో మంగళవారం ఉదయానికే స్నానాలు చేసినవారి సంఖ్య రెండు కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 24 గంటల స్నానంతో తగ్గిన ఒత్తిడి పుష్కర స్నానాలకు వచ్చే యాత్రికుల సంఖ్య స్వల్పంగా తగ్గడంతోపాటు, 24 గంటలూ స్నానాలు చేసే అవకాశం కల్పించడంతో ఘాట్ల వద్ద భక్తుల సందడి చాలావరకూ తగ్గినట్టు కనిపించింది. ప్రముఖుల పుష్కర స్నానాలు సోమవారం పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటి జయప్రద పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కర స్నానానికి వచ్చిన జయప్రద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ సినీ హాస్య నటులు గౌతంరాజు, చిట్టిబాబు కూడా పుష్కర స్నానాలు చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య కమిషనర్ పూనం మాలకొండయ్య, వైఎస్సార్సీపీకి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పుష్కర స్నానాలు చేసినవారిలో ఉన్నారు. -
మాతా... నమస్తుతే
పుష్కర సంరంభం వైభవంగా కొనసాగుతోంది. గోదారమ్మ తీరం భక్తజన సందడితో పులకించి పోతోంది. వివిధ పుష్కర క్షేత్రాలలో బుధవారం వేలాది మంది పవిత్ర స్నానాలను ఆచరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండవ రోజు 92,448 - గోదారమ్మ చెంత భక్తుల పరవశం - రెండో రోజూ పుష్కర స్నానాలు - పోచంపాడ్‌లో మంత్రి ఐకేరెడ్డి పూజలు - మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న కూడా - పిండ ప్రదానం చేసిన ఎంపీ కేశవరావు - తుంగినిలో ఇన్చార్జి డీఐజీ గంగాధర్ దంపతుల పవిత్రస్నానం - సౌకర్యాలను పర్యవేక్షించిన కలెక్టర్ - కందకుర్తిలో నీరులేక ఇబ్బందులు - పోచంపాడ్‌లో పెరుగుతున్న రద్దీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రెం డోరోజు బుధవారం కూడా పవిత్రస్నానాల కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతిని ధులు, అధికారులు ఘాట్లను సందర్శించారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పో చంపాడ్లో పుష్కరస్నానాలు చేశారు. ఎంపీ కె. కేశవరావు పుష్కరస్నానంతో పాటు పిండప్రధానం చేశారు. నిజామాబాద్ రేంజ్ ఇన్చార్జ్ డీఐజీ ఎడ్ల గంగాధర్ తుంగినిలో కుటుంబసభ్యులతో పుష్కరస్నానం చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, భక్తుల తాకిడి నేపథ్యంలో కలెక్టర్ రొ నాల్డ్‌రోస్ పోచంపాడ్, కందకుర్తి, తడపాకల్, గుమ్మిర్యాల్ తదితర పుష్కరఘాట్లలో సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సుడిగాలి పర్యటన చేశారు. పోచంపాడ్, తడపాకల్‌లో కలెక్టర్, కందకుర్తిలో జేసీ ఎ.రవీందర్‌రెడ్డిలు పుష్కరస్నానం, పూజలు చేశారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పుష్కరఘాట్లను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించా రు. రెండోరోజూ కూడ హైదరాబా ద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్,మహారాష్ట్ర,కర్ణాటకల నుం చి భక్తులు పెద్ద సంఖ్యలో జిల్లాకు చేరుకుని పుష్కరస్నానాలు చేశారు. కందకుర్తిలో తప్పని నీటి ఇబ్బందులు త్రివేణి సంగమ వేదిక కందకుర్తిలో భక్తులు నీటి సమస్యను ఎదుర్కున్నారు. భక్తుల సందడితో కందకుర్తి పులకరించింది కానీ, కరుణించని వరుణుడు, ప్రవహించని గోదారమ్మ చెంత జల్లుల స్నానాలు తప్పలేదు. మంగళవారం ‘తలపై చల్లుకునే మాత్రం నీళ్లున్నా ఫరవాలేదు’ అంటూ భక్తులు సెంటిమెంట్ కోసం కందకుర్తికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ ఒక్కరోజే 65 వేల మందికి భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. అయితే,బుధవారం భక్తులు వచ్చినా కందకుర్తి వద్ద గోదావరి లో పూర్తిగా నీరు లేకపోవడం, మురికిగా మారిన నీటిలో స్నానం చేయలేక ఇబ్బంది పడ్డారు. చేసేది లేక జల్లు స్నానం (షవర్‌బాత్) కేంద్రాల వద్దనే పుష్కరస్నానాలు చేశారు. భక్తుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న చాలామంది కందకుర్తికి ప్రత్యామ్నాయంగా పోచంపాడ్, తడపాకల్, ఉమ్మెడ, తుంగిని తదితర పుష్కరఘాట్లను ఎంచుకున్నారు. దీంతో కందకుర్తికి భక్తుల రద్దీ తగ్గగా.. పోచంపాడ్‌కు తాకిడి పెరిగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, దేవాదాయశాఖ కమీషనర్ కేశవ్ తదితరులు పోచంపాడ్లోనే పుష్కరస్నానాలు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన చా లా మంది భక్తులు కూడ పోచంపాడ్ దారి పట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది. శుక్రవారం, శనివారం, ఆదివారాలలో మరింత భక్తులు పెరిగే అవకాశం ఉందని, ఈ దిశ లో ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పుష్కరఘాట్లలో సమస్యల నివేదన సుమారు 50 లక్షల మంది భక్తుల కోసం జిల్లాలోని 11 ప్రాంతాలలోని 18 ఘాట్లలో ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు భక్తులు లేకపోగా, శుక్రవారం నుంచి భక్తుల రద్దీ పె రుగుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా అధికార యంత్రాంగం కందకుర్తిపై దృష్టి సారించి అక్కడ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే మహారాష్ర్టలోని గైక్వాడ్, విష్ణుపు రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు అక్కడి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. దీనికి తోడు వర్షాలు, వరదలు లేక గోదారి బోయిబోయింది.దీంతో కందకుర్తికి చేరు కున్న భక్తులు నీటి వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. పొక్లయినర్లతో గోదావరిలో ఉన్న నీరంతా ఒకేచోటకు చేర్చే ప్రయత్నం చేసినా భక్తుల రద్దీకి అది సరిపోలేదు. పోచంపాడ్, దాని కింది భాగంలోని ఘాట్లకు ప్రాజెక్టు నీటిని వదులుతున్నందున ప్రజలు అక్కడికి వెళ్లాలని కలెక్టర్ రోస్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఐదు పుష్కర ప్రాంతా లను పర్యటించి వివరాలను, ఏర్పాట్లను పరిశీలించి, ఘాట్ల వద్ద నీటి ప్రవాహం వచ్చేలా, మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలని,తద్వారా భక్తులు శుభ్రమైన నీటి స్నానాలు ఆచరించడానికి వీలు కలుగుతుందని సూచించారు. ఘాట్ల ప్రక్కన గల మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. పోచంపాడ్ ఘాట్ల వద్ద నిలిచి ఉన్న వాహనాలను చూసి వెంటనే వాటిని పార్కింగ్ స్థలానికి తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఘాట్ల వద్ద వాహనాలు నిలుపడానికి వీలు లేదని అధికారులను ఆదేశించారు. విఐపీలు, ఎస్కారు వాహనాలు మినహా ఏవీ ఉండడానికి వీలు లేదని, వికలాంగులు, వద్దులను ఘాట్ల వద్ద వదిలి వాహనాలు వెనకకు వెళ్లాల్సిందేనన్నారు. -
పుష్కర విలాపం
అవధుల్లేని భక్తితో బయల్దేరిన వారి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. అచంచల విశ్వాసంతో పయనమైన వారిని అనుకోని ఆపద కబళించింది. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల కోసం ప్రయాస పడి వెళ్లిన వారి జీవితం అత్యంత విషాదకర పరిస్థితుల్లో కడతేరిపోయింది. గోదావరి నదిలో, పుణ్య ఘడియల్లో స్నానం చేసి తరిద్దామనుకుని విశాఖనగర పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా బయల్దేరిన వారిని చివరికి మృత్యువు క్రూరంగా నులిమేసింది. దారుణ నిర్లక్ష్యమో, ఘోరమైన బాధ్యతా రాహిత్యమో.. ఏదైతేనేం.. వేరొకరి పొరపాటు కారణంగా ఈ అమాయకుల బతుకు అనూహ్యంగా ముగిసిపోయింది. పుష్కరం వీరి సన్నిహితులకు చివరికి మహా విషాదాన్ని మిగిల్చింది. అది పన్నెండేళ్లకే కాదు.. బతుకు చివరి వరకు పీడకలలా వెంటాడుతూనే ఉంటుంది. - పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట - జిల్లావాసులు ఐదుగురి దుర్మరణం - మృతులందరూ మహిళలే - మరో ముగ్గురికి గాయాలు - విషాదాన్ని మిగిల్చిన ప్రభుత్వ వైఫ్యల్యం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పుష్కర గోదావరి కోలాహలాన్ని విషాద కెరటం ముంచెత్తింది. శోభాయమానం వేడుకగా సాగాల్సిన గోదావరి పుష్కరాల ఏర్పాట్లల్లో ప్రభుత్వ వైఫల్యం జిల్లాకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందంగా పుష్కర యాత్రకు తీరని శోకాన్ని మిగిల్చింది. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో జిల్లకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యకు అంతకుమించే ఉంటుందని తెలుస్తోంది. పుష్కరాలకు వెళ్లిన తమ వారి ఆచూకీ కోసం జిల్లావాసులు తీవ్ర ఆందోళన చెందారు. అందరూ మహిళలే : తొక్కిసలాటలో జిల్లాకు చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. అందరూ మహిళలే కావడం గమనార్హం. సాధారణంగా పుష్కరాలంటే మహిళలే అత్యధికంగాభక్తిశ్రద్ధలు కనబరుస్తారు. ప్రభుత్వ వైఫల్యం వారి పాలిటశాపంగా పరిణమించింది. ఈ దుర్ఘటనలో నగర శివారులోని మారికవలసకు చెందని అవ్వ బంగారమ్మ(34), ఆమెకుమార్తె (16), సీతమ్మధారకు చెందిన కోటిన మహాలక్ష్మి(68), పెందుర్తికి చెందిన గొర్లె మంగమ్మ(61), గాజువాకకు చెందిన పాండవుల మహాలక్ష్మి( 61) ప్రాణాలు కోల్పోయారు. పెందుర్తికి చెందిన గొర్లె అచ్చియమ్మ, చీపురుపల్లి సాదమ్మ, నరవ అచ్చియమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం : మధురవాడలోని మారికవలసకు చెందిన పేద ఆటోడ్రైవర్ అవ్వ కృష్ణ కుటుంబాన్ని విషాదం ఆవహించింది. భోగాపురానికి చెందిన అవ్వ కృష్ణ ఏడాదిన్నరగా మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో నివాసిస్తున్నారు. ఆయన భార్య బంగారమ్మ ఆ కాలనీలో కొబ్బరి బొండాలు విక్రయిస్తారు. ఆయన కుమార్తె గౌరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు రాంబాబు పాలిటెక్నిక్ విద్యార్థి. పుష్కరాల కోసం కృష్ణ తన కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. పుష్కరఘాట్‌కు చేరుకుని ఎప్పుడు గేటు తీస్తారా అని నిరీక్షిసున్నారు. అధికారులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో అవ్వ కృష్ణ భార్య బంగారమ్మ(35), ఆమె కుమార్తె గౌరి(16) దుర్మరణం చెందారు. వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అవ్వ కృష్ణ, ఆయన కుమారుడు రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. కనిపించకుండా పోయిన తన భార్య, కుమార్తె కోసం అవ్వ కృష్ణ చాలాసేపు వెతుకసాగారు. ఇంతలోనే విశాఖపట్నంలోని ఆయన సమీప బంధువులు బంగారమ్మ, గౌరీల మృతదేహాలను టీవీలో చూసి కృష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దాంతో కృష్ణ హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశారు. విగతజీవులై పడి ఉన్న తన భార్య, కుమార్తెలను చూసి హతాశుడయ్యారు. ఒక్క ఆధారం తెగిపోయింది: సీతమ్మధారకు చెందిన కోటిన మహాలక్ష్మి( 68) రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త పింఛనే ఆమె కుటుంబానికి ఆధారం. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహాలక్ష్మి తమ బంధువులతో కలసి సోమవారం రాత్రి విశాఖపట్నంలో బయలుదేరి వెళ్లారు. తొక్కిసలాటలో ఆమె కిందపడిపోయి ప్రాణాలు విడిచారు. దాంతో ఆ కుటుంబానికి ఉన్న ఒక్క ఆదరవూ లేకుండాపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ కుటుంబాని నిండాముంచేసింది. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు : కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వారిని రాజ మండ్రి దుర్ఘటన కబళించేసింది. పెందుర్తికి చెందిన గొర్లె మంగమ్మ (61) అసువులు బాశారు.ఆమె తమ బంధువులతో కలసి మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. పుష్కరస్నానం కోసం నీరిక్షిస్తున్న ఆమె తొక్కిసలాటలో కిందపడిపోయి ప్రాణాలు విడిచారు. మంగమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమెతోపాటు పుష్కరాలకు వెళ్లిన పెందుర్తికి చెందిన గొర్లె అచ్చియమ్మ, చీపురుపల్లి సాదమ్మ, నరవ అచ్చియమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాకకు చెందిన అగనంపూడికి చెందిన పాండవుల విజయలక్ష్మి( 61) రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో దుర్మరణం చెందారు. అగనంపూడికి చెందిన ఆమె కొంతకాలంగా గాజువాకలో తన కుమారుల వద్ద ఉంటున్నారు. విజయలక్ష్మి తమ బంధువలతో కలసి మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. సాయంత్రానికి వచ్చేస్తానని తన కుమారులకు ఫోన్ చేసి చెప్పారు కూడా. కానీ అంతలోనే పుష్కరఘాట్‌లో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడిచారు. జిల్లా నుంచి వెళ్లిన వేలాదిమందిలో పలువురి ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
ఐదు టీఎంసీల నీరు విడుదల చేయండి
అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం ప్రగతినగర్ : గోదావరి పుష్కరాలకు శ్రీరాంసాగర్ నుంచి 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోదావరి పుష్కరాలు జరిగే జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింది భాగంలోని శ్రీరాంసాగర్, గుమ్మిర్యాల్, దోంచంద, సావె ల్, తడ్‌పాకల పుష్కర ఘాట్లకు శుక్రవారం రాత్రి నుంచే నీటిని వదలాలని ఆదేశించారు. ఎస్సారెస్పీలోని 10 టీఎంసీల నీటి నిలువలో నుంచి 5 టీఎంసీల నీరు పుష్కరాల కోసం విడుదల చేయాలన్నారు. పుష్కరాల ప్రారంభానికి ఒకటి, రెండు రోజుల ముందే ఘాట్లకు నీరు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కందకుర్తి, దాని కింది భాగంలోని ఇతర ఘాట్లలో నీటికి కొంత ఇబ్బంది ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ దిగువ భాగంలోని ఘాట్ల వద్ద భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. అన్ని ఘాట్లలో ప్రత్యామ్నాయ నీటి ఏర్పాట్లతో షవర్లు ఏర్పాటు చేయాలన్నారు. శనివారం రాత్రిలోగా అన్ని పుష్కర పనులు పూర్తి చేయూలని ఆదేశించారు. ఘాట్ల వద్ద అధికారులందరికీ విధులు కేటారుుంచాలని, పురోహితులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ధరలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయూలని చెప్పారు. అనంతరం జేసీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులు జిల్లాలోని అన్ని ఘాట్లలో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారని, పనులు పూర్తి స్థాయిలోకి వచ్చాయని చెప్పారు. అన్ని ఘాట్లలో షవర్‌బాత్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐకేపీ పీడీ వెంకటేశం, డీపీఓ కృష్ణమూర్తి, పుష్కరాల లైజనింగ్ అధికారి సుధాకర్ పాల్గొన్నారు. -
రోజూ 10 లక్షల మందికి అన్నదానం
కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలు - ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తాం - ధర్మపురిలో సీఎం కేసీఆర్ పుష్కర స్నానం - వర్తక, వాణిజ్య సంఘాలు ముందుకు రావాలి - ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల ముకరంపుర : గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, రైస్‌మిల్లర్స్‌తో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు. గోదావరిలో నీటి కొరత దృష్ట్యా ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 5కోట్ల మంది జిల్లాలో పుష్కరస్నానాలకు వచ్చే అవకాశముందన్నారు. పుష్కర భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా రాష్ట్రంలో రూ.600 కోట్లతో పలు ఏర్పాట్లు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 13న ధర్మపురి చేరుకుని రాత్రి బస చేస్తారని, 14న ఉదయం 6.26 గంటలకు ధర్మపురిలో పుష్కరస్నానం ఆచరిస్తారని పుష్కరాలను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సేవలందించేందుకు ముందుకు రావాలి పుష్కరాల్లో రోజుకు 10లక్షల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం దాతలు, స్వచ్చంద సంఘాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నర్సింగరావుతో పాటు బాధ్యులు ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల వద్ద ఉద్యోగులకు, ఇతర భక్తులకు రోజుకు 2-4 వేల మందికి అన్నదానం చేసేందుకు సహకరిస్తామన్నారు. జువెల్లరీ అసోసియేషన్ బాధ్యులు రమేష్ మినరల్ వాటర్ అందిస్తామన్నారు. కంకర క్రషర్ సంఘం ప్రతినిధి అంజయ్య రూ.2లక్షలు విరాళం అందిస్తామన్నారు. ఐఎంఏ బాధ్యులు అవసరమైన వైద్యసిబ్బందితో క్యాంపులు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ప్రైవేట్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ బాధ్యులు జిల్లా వైద్యశాఖ సూచనల మేరకు అన్నివిధాలా సహకరిస్తామన్నారు. వెల్గటూర్ కంకర ప్రెషర్ యాజమాన్య బాధ్యులు చక్రవర్తి కోటిలింగాల వద్ద 500 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తామని, పుష్కరఘాట్లకు ప్రెషర్ డస్ట్‌ను పంపిస్తామని అన్నారు. దాతలు అందించే సేవా కార్యక్రమాలను డీఆర్వో వీరబ్రహ్మయ్య, సీపీవో సుబ్బారావు పర్యవేక్షిస్తారని కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. -
జిల్లాలో పోలీస్స్టేషన్లన్నీ ఖాళీ
- పుష్కరాలకు తరలనున్న పోలీసు యంత్రాంగం - 10న రాజమండ్రిలో రిపోర్ట్ చేయనున్న పోలీసులు - స్థానికంగా అరకొర సిబ్బందితో కొంత ఇబ్బందే నూజివీడు : గోదావరి పుష్కరాల పుణ్యమా అని జిల్లాలోని పోలీసు స్టేషన్లన్నీ మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్నాయి. పుష్కరాలకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను జిల్లాలోని పోలీసు సిబ్బందిని పెద్ద ఎత్తున బందోబస్తు విధులకు నియమించారు. దీంతో పోలీసు అధికారులతో పాటు సిబ్బంది అంతా పుష్కరాల బందోబస్తు విధులకు తరలివెళ్లనున్నారు. వీరంతా ఈనెల 10వ తేదీనే రాజమండ్రి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు అక్కడే వారికి పలు అంశాలలో శిక్షణనిస్తారు. జిల్లా నుంచి సీఐలు 20 మంది, ఎస్ఐలు 60మంది, హెడ్కానిస్టేబుల్లు, ఏఎస్ఐలు కలిపి 200 మంది, కానిస్టేబుళ్లు 650 మంది, మహిళా కానిస్టేబుళ్లు 80మంది, మహిళా హోంగార్డులు 20 మంది, హోంగార్డులు 100 మందిని ఇప్పటికే పుష్కరాల విధులకు నియమిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో డ్యూటీ పడిన వారంతా ఈ నెల 10వ తేదీన రాజమండ్రిలో రిపోర్ట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వీరంతా మరల ఈ నెల 26న తమతమ పోలీస్స్టేషన్లకు తరలిరానున్నారు. అప్పటి వరకు స్థానిక పోలీసుస్టేషన్లలో అరకొర సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించనున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే... ఇంత పెద్ద ఎత్తున పోలీసులు పుష్కరాలకు వెళ్తున్న నేపథ్యంలో పట్టణాల్లో, గ్రామాల్లో నైట్బీట్లు సమర్థవంతంగా అమలుకాని పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే దొంగతనాలు జరిగే ప్రమాదముందని, స్థానికులు పోలీసులకు సహకరించాలని పలువురు సూచిస్తున్నారు. -
పుష్కర ఏర్పాట్లు వేగవంతం
- 90 శాతం పూర్తయిన ‘సాధుగ్రామ్’ - నాసిక్, త్రయంబకేశ్వర్‌లో ఘాట్ నిర్మాణ పనులు ముమ్మరం - ఏర్పాట్లలో నిమగ్నమైన అన్ని విభాగాల అధికారులు - పదిరోజుల్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలు సాక్షి, ముంబై: మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. పుష్కరాలు సమీపిస్తుండటంతో పనులను తొందరగా పూర్తి చేసేందుకు అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు. త్రయంబకేశ్వర్, నాసిక్‌లో జరిగే పుష్కరాలకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉండటంతో గతంలో కంటే మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ‘సింహస్థ కుంభమేళా 2015-16’ కోసం ప్రభుత్వం రూ. 2378.78 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులను వినియోగిస్తూ పనులు పూర్తి చేసే బాధ్యతలను 23 విభాగాలకు అప్పగించింది. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టనున్న 109 రకాల పనుల కోసం విడుదల చేసిన రూ. 1112 కోట్ల నిధులు కూడా ఇందులోనే ఉన్నాయి. కుంభమేళాకు వచ్చే లక్షలాది సాధువులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘సాధుగ్రామ్’ (సాధువుల గ్రామం) ను నిర్మిస్తున్నారు. నాసిక్‌లో ఈ పనులు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. త్రయంబకేశ్వర్లోసుమారు 15 ఎకరాలను సాధుగ్రామ్ కోసం సేకరించారు. ఇక్కడ మొత్తం 68 రకాల పనులు ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. మరికొన్ని పనులు టెండర్ల ద్వారా జరుగుతున్నాయి. నాసిక్‌లో సుమారు 2,690 మీటర్ల మేర నూతన రామ్‌ఘాట్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఆ పనులను జలవనరుల శాఖకు అప్పగించింది. త్రయంబకేశ్వర్‌లో కూడా నాలుగు ఘాట్ల నిర్మాణం జరుగుతోంది. దీంతో కొత్తగా 950 మీట్ల పొడవైన ఘాట్ భక్తులకు అందుబాటులోకి రానుంది. సీసీటీవీలు, కమ్యూనికేషన్ కోసం సెల్‌ఫోన్ టవర్ల నిర్మాణం వంటి పనులు పెద్దెత్తున జరుగుతున్నాయి. సాధుగ్రామ్‌కు రెండింతల స్థలం 2003లో జరిగిన కుంభమేళా కోసం నిర్మించిన సాధుగ్రామ్ కంటే ఈ సారి రెండింతలు అధికంగా స్థలాన్ని సేకరించారు. 315 ఎకరాల స్థలం సాధుగ్రామ్ కోసం అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున గదుల నిర్మాణం జరుగుతోంది. సాధుగ్రామ్లో 300, 600 చదరపు మీటర్లతో 1,537 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. పనుల పర్యవేక్షణకు డిప్యూటీ కమిషనర్లు హరిభావు ఫడోల్, డీటీ గోతిసే, రోహిదాస్ దోరకుల్కర్లను నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ గోడామ్ నియమించారు. కుంభమేళా కోసం నాలుగు లక్షల మందికిపైగా సాధువులు రానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చే సాధువుల కోసం 3,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2,100 మెట్రిక్ టన్నుల గోధుమ, 1,200 మెట్రిక్ టన్నుల బియ్యం, పప్పుదినుసులు అందులో ఉన్నాయి. సాధువుల కోసం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందుబాటులో ఉంచనున్నారు. 20 వేల మంది పోలీసులతో బందోబస్తు నాసిక్‌లో జరగనున్న కుంభమేళా కోసం 20 వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులందరికీ ఉండేందుకు స్థలం, భోజన సదుపాయాలపై కూడా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. భాషాప్రావీణ్యుల సహకారం... పుష్కరాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు అంతకంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారిని అధికారులు ఎంపిక చేశారు. ప్రధానంగా తెలుగు, కన్నడ, తమిళం తదితర భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారిని నియమించనున్నారు.