మహాజనపాతం | Lots of people continuing for Pushkarni | Sakshi
Sakshi News home page

మహాజనపాతం

Published Tue, Jul 21 2015 4:55 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

మహాజనపాతం

మహాజనపాతం

గోదావరికి వెల్లువొచ్చినట్టు.. పుష్కర రాజధాని రాజమహేంద్రిని ముంచెత్తిన జనప్రవాహం.. జలపాతాన్ని తలపించింది. పావన గోదావరిలో పుణ్యస్నానం చేయాలన్న ఆతృతతో అన్నివైపుల నుంచీ భక్తజనవాహిని ఈ నగరిని చుట్టేసింది. ఏ రోడ్డు చూసినా..
ఏ సందు చూసినా.. గుంపులుగుంపులుగా సాగుతున్న జనమే.. వారు నడిచే ప్రతి దారీ గోదారి దరికే దారి తీశాయి. వారు చేరిన ప్రతి కూడలీ అడుగుతీసి అడుగు వేయలేనంతగా కిక్కిరిసిపోయాయి. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి నగరం.. సోమవారం జనసాగరమే అయింది. జిల్లాలోని ఇతర స్నానఘట్టాల్లోనూ ఇటువంటి దృశ్యాలే ఆవిష్కృతమయ్యాయి.
- ఘాట్‌ల వద్ద జనజాతర
- సోమవారం ఒక్క రోజే 35 లక్షల మంది పుష్కర స్నానం
- నేటితో రెండు కోట్లు దాటనున్న యాత్రికుల సంఖ్య
రాజమండ్రి :
గోదావరి పుష్కరాలకు పోటెత్తిన భక్తజన వరద కాస్త తగ్గినా.. పుష్కరాల ప్రధాన వేదికగా ఉన్న రాజమండ్రి నగరం, జిల్లాలోని గోదావరి తీర గ్రామాలు ఇంకా జనవాహిని ముంపులోనే ఉన్నాయి. శని, ఆదివారాలతో పోల్చుకుంటే జనం కొంతవరకూ తగ్గినా కానీ అంచనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో యాత్రికులు సోమవారం కూడా పుష్కర స్నానాలకు తరలివచ్చారు. వారి రాకతో రాజమండ్రి నగరం, గ్రామీణ ప్రాంతాల్లోని పుష్కర ఘాట్‌లు, ఆయా ప్రాంతాలు కిటకిటలాడాయి. రాజమండ్రి నగరంలోని కొన్ని ప్రాంతాలు ఇసుక వేస్తే రాలనంతగా వచ్చిన జనంతో కిక్కిరిసిపోయాయి.

అధికారుల లెక్కల ప్రకారం సోమవారం రాత్రి 8 గంటల సమయానికి జిల్లావ్యాప్తంగా 35,11,746 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. రాత్రికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా. పుష్కరాలు ఆరంభమైన తరువాత ఇప్పటి వరకు 1.91 కోట్ల మందికిపైగా భక్తులు స్నానాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తొలి రోజైన 14న 18.01 లక్షలు, 15న 16.32 లక్షలు, 16న 22.42 లక్షలు, 17న 22.11 లక్షలు, 18న 38.95 లక్షలు, 19న 37.86 లక్షలు, సోమవారం 35.11 లక్షల (రాత్రి తొమ్మిది గంటలకు) మంది స్నానాలు చేశారు. 1.40 లక్షల పిండప్రదానాలు జరిగాయి. సోమవారం గ్రామీణ ఘాట్‌లలో సైతం భక్తుల తాకిడి స్వల్పంగా తగ్గింది. కోటిపల్లిలో 2 లక్షల మంది స్నానాలు చేయడం గమనార్హం. అప్పనపల్లి ఘాట్‌లో 1.50 లక్షలు, సోంపల్లిలో 90 వేలు, మురమళ్లలో 50 వేలు, గేదెల్లంకలో 35 వేలు, కుండలేశ్వరంలో 65 వేల మంది చొప్పున భక్తులు స్నానాలు చేశారు.
 
నేటితో రెండు కోట్లు
జిల్లావ్యాప్తంగా పుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య మంగళవారంతో రెండు కోట్లకు చేరనుంది. గడచిన ఏడు రోజుల్లో ఇప్పటివరకూ 1.91 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు. మరో 9 కోట్ల మంది భక్తులు స్నానం చేస్తే భక్తుల సంఖ్య రెండు కోట్లకు చేరనుంది. నిరంతరాయంగా 24 గంటలూ స్నానాలకు అనుమతి ఇవ్వడంతో మంగళవారం ఉదయానికే స్నానాలు చేసినవారి సంఖ్య రెండు కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
24 గంటల స్నానంతో తగ్గిన ఒత్తిడి
పుష్కర స్నానాలకు వచ్చే యాత్రికుల సంఖ్య స్వల్పంగా తగ్గడంతోపాటు, 24 గంటలూ స్నానాలు చేసే అవకాశం కల్పించడంతో ఘాట్‌ల వద్ద భక్తుల సందడి చాలావరకూ తగ్గినట్టు కనిపించింది.
 
ప్రముఖుల పుష్కర స్నానాలు
సోమవారం పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటి జయప్రద పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కర స్నానానికి వచ్చిన జయప్రద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ సినీ హాస్య నటులు గౌతంరాజు, చిట్టిబాబు కూడా పుష్కర స్నానాలు చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య కమిషనర్ పూనం మాలకొండయ్య, వైఎస్సార్‌సీపీకి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పుష్కర స్నానాలు చేసినవారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement