హిమగిరి ఎత్తు గురితో..
వరద నీరు బిరబిరా ప్రవహించిపోరుునట్టు.. చూస్తుండగానే.. ‘చూసువారలకు మాటలకందని ముచ్చట’గా, ‘స్నానం చేసువారలకు ఏ కాటా చాలని పున్నెపుమూట’గా సాగుతున్న గోదారమ్మ పుష్కరపర్వంలో పదిరోజులు గడిచిపోయూరుు. ‘తనపై గురి హిమగిరి ఎత్తున ఉందా? తన ఒడిలో ఓలలాడాలనే బిడ్డలు ఇన్నికోట్లున్నారా?’ అని ఆ నదీమతల్లే విస్తుబోరుు, కెరటాల కనురెప్పలు విప్పార్చి చూసేస్థారుులో.. తెలుగు రాష్ట్రాల్లోని నలుచెరగుల నుంచీ; దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచీ; విదేశాల నుంచీ భక్తులు పోటెత్తారు. వరదవేళ బ్యారేజి లాకులెత్తితే కడలి దిక్కుకు దుమికే జలరాశిలా జనరాశి తీరాలకు పరవళ్లు తొక్కారు. పదోరోజైన గురువారం ప్రతి రేవూ భక్తజన సింధువే అరుుంది.
- గోదారమ్మను చేరుతున్న భక్తజనఝరి
- పదోరోజూ ఉరవడి తగ్గని పుష్కర సంరంభం
- గురువారం 33 లక్షల మంది పుణ్యస్నానాలు
- సెలవు రోజులను తలపించిన వైనం
- మరో రెండు రోజూలూ ఇంతే !
- బ్యారేజి గేట్లు ఎత్తడంతో తేటపడనున్న ఘాట్ల నీరు
రాజమండ్రి : పన్నెండేళ్లకోసారి పన్నెండురోజులు జరిగే గోదావరి పుష్కరాల్లో పదిరోజులు గడిచిపోయూయి. గురువారం కూడా రాజమండ్రి సహా జిల్లాలోని ఘాట్లు భక్తులతో కిక్కిరిశారు. సెలవు రోజుల్లో మాదిరిగా యాత్రికులు పోటెత్తారు. ఈ నదీపర్వంలో చివరి రెండురోజులైన శుక్ర, శనివారాలు ఈ సంఖ్య మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. గురువారం రాజమండ్రి నగరంలో పలుమార్లు, పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించి భక్తులు అష్టకష్టాలు పడ్డారు.
పుష్కరాలు ఆరంభమైన తరువాత గత శని, ఆదివారం సెలవు రోజుల్లో యాత్రికులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. గురువారం మరోసారి అదే తాకిడి కనిపించింది. రాత్రి ఎనిమిది గంటల సమయానికి జిల్లాలో పుష్కరస్నానాలు చేసినవారి సంఖ్య 33 లక్షల మందికి చేరింది. పుష్కరాలు ఆరంభమయ్యూక ఒకేరోజు 30 లక్షల మంది దాటి భక్తులు రావడం ఇది నాల్గవసారి. రాజమండ్రిలో కోటిలింగాలు, పుష్కరఘాట్‌లు జనసంద్రంగా మారాయి. కోటిలింగాల ఘాట్‌కు తాకిడి మరీ ఎక్కువగా ఉంది. కోటిపల్లి ఘాట్‌లో 2.30 లక్షల మందికి పైగా స్నానాలు చేశారు. అంతర్వేదిలో 50 వేల మంది, కుండలేశ్వరంలో 40 వేలు, అప్పనపల్లిలో 55 వేలు, సోంపల్లిలో 75 వేల మంది పుష్కర స్నానాలు చేశారు. మిగిలిన గ్రామీణ ఘాట్‌లలో సైతం స్నానాలు చేసిన వారి సంఖ్య గణనీయంగానే ఉంది.
పదే పదే అవే ఇక్కట్లు..
యాత్రికుల రద్దీతోపాటు వారి ఇక్కట్లు కూడా భారీగా పెరిగాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో నిలబడేందుకు సైతం జాగాలేక ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ వద్ద పరిస్థితి మరీదారుణంగా ఉంది. బస్సులు బయటకు వచ్చేందుకు, లోనికి వెళ్లేందుకు సైతం స్థలం లేక పోవడం, బస్టాండ్ బయటే బస్సులు నిలిచిపోవడంతో తాడితోట- మోరంపూడి రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించింది. హైవేలో కూడా స్వల్పంగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
మూడు కోట్లకు చేరువలో..
జిల్లాలో పుష్కరస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం మూడు కోట్లకు చేరుకునే అవకాశముంది. పుష్కరాలు ఆరంభమైన ఈ పది రోజుల్లో సుమారు 2.72 కోట్ల మంది స్నానాలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో పుష్కరాలు ముగుస్తున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంది. శుక్రవారం కూడా ఇదే స్థాయిలో భక్తుల తాకిడి ఉంటే స్నానాలు చేసిన వారి సంఖ్య మూడు కోట్లుదాట నుంది.
పుష్కరస్నానం చేసిన ప్రముఖులు
ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి సరస్వతిఘాట్‌లో పుష్కరస్నానం చేశారు. ఆయనతోపాటు సినీరంగానికి చెందిన ప్రముఖ నటుడు, వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు విజయచందర్, అడిషనల్ డీజీపీ ఆర్.పి.ఠాకూర్, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.సి.శర్మ, డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కన్నబాబు పుణ్యస్నానాలు చేశారు.
గోదావరికి పెరిగిన ఇన్‌ఫ్లో
గోదావరి పరీవాహక ప్రాంతంలో బుధవారం కురిసిన వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో పెరిగింది. సీలేరు నుంచి రోజూ విడుదలవుతున్న పది వేల క్యూసెక్కుల నీటికి తోడు ఇన్‌ఫ్లో పెరగడంతో బ్యారేజ్ నుంచి గురువారం 56,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇదే సమయంలో డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి నీరు సముద్రంలోకి విడుదల చేయడంతో.. ఇప్పటి వరకూ ఘాట్లలో కలుషితమైన నీరు పోయి.. కొత్తనీరు రానుంది. ఈ రెండు రోజులూ భక్తులు కొంచెం స్వచ్ఛమైన నీటిలో స్నానం చేసే అవకాశం లభించింది.