పుష్కర విలాపం
అవధుల్లేని భక్తితో బయల్దేరిన వారి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. అచంచల విశ్వాసంతో పయనమైన వారిని అనుకోని ఆపద కబళించింది. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల కోసం ప్రయాస పడి వెళ్లిన వారి జీవితం అత్యంత విషాదకర పరిస్థితుల్లో కడతేరిపోయింది. గోదావరి నదిలో, పుణ్య ఘడియల్లో స్నానం చేసి తరిద్దామనుకుని విశాఖనగర పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా బయల్దేరిన వారిని చివరికి మృత్యువు క్రూరంగా నులిమేసింది. దారుణ నిర్లక్ష్యమో, ఘోరమైన బాధ్యతా రాహిత్యమో.. ఏదైతేనేం.. వేరొకరి పొరపాటు కారణంగా ఈ అమాయకుల బతుకు అనూహ్యంగా ముగిసిపోయింది. పుష్కరం వీరి సన్నిహితులకు చివరికి మహా విషాదాన్ని మిగిల్చింది. అది పన్నెండేళ్లకే కాదు.. బతుకు చివరి వరకు పీడకలలా వెంటాడుతూనే ఉంటుంది.
- పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట
- జిల్లావాసులు ఐదుగురి దుర్మరణం
- మృతులందరూ మహిళలే
- మరో ముగ్గురికి గాయాలు
- విషాదాన్ని మిగిల్చిన ప్రభుత్వ వైఫ్యల్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పుష్కర గోదావరి కోలాహలాన్ని విషాద కెరటం ముంచెత్తింది. శోభాయమానం వేడుకగా సాగాల్సిన గోదావరి పుష్కరాల ఏర్పాట్లల్లో ప్రభుత్వ వైఫల్యం జిల్లాకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందంగా పుష్కర యాత్రకు తీరని శోకాన్ని మిగిల్చింది. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో జిల్లకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యకు అంతకుమించే ఉంటుందని తెలుస్తోంది. పుష్కరాలకు వెళ్లిన తమ వారి ఆచూకీ కోసం జిల్లావాసులు తీవ్ర ఆందోళన చెందారు.
అందరూ మహిళలే : తొక్కిసలాటలో జిల్లాకు చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. అందరూ మహిళలే కావడం గమనార్హం. సాధారణంగా పుష్కరాలంటే మహిళలే అత్యధికంగాభక్తిశ్రద్ధలు కనబరుస్తారు. ప్రభుత్వ వైఫల్యం వారి పాలిటశాపంగా పరిణమించింది. ఈ దుర్ఘటనలో నగర శివారులోని మారికవలసకు చెందని అవ్వ బంగారమ్మ(34), ఆమెకుమార్తె (16), సీతమ్మధారకు చెందిన కోటిన మహాలక్ష్మి(68), పెందుర్తికి చెందిన గొర్లె మంగమ్మ(61), గాజువాకకు చెందిన పాండవుల మహాలక్ష్మి( 61) ప్రాణాలు కోల్పోయారు. పెందుర్తికి చెందిన గొర్లె అచ్చియమ్మ, చీపురుపల్లి సాదమ్మ, నరవ అచ్చియమ్మలు తీవ్రంగా గాయపడ్డారు.
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం : మధురవాడలోని మారికవలసకు చెందిన పేద ఆటోడ్రైవర్ అవ్వ కృష్ణ కుటుంబాన్ని విషాదం ఆవహించింది. భోగాపురానికి చెందిన అవ్వ కృష్ణ ఏడాదిన్నరగా మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో నివాసిస్తున్నారు. ఆయన భార్య బంగారమ్మ ఆ కాలనీలో కొబ్బరి బొండాలు విక్రయిస్తారు. ఆయన కుమార్తె గౌరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు రాంబాబు పాలిటెక్నిక్ విద్యార్థి. పుష్కరాల కోసం కృష్ణ తన కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. పుష్కరఘాట్‌కు చేరుకుని ఎప్పుడు గేటు తీస్తారా అని నిరీక్షిసున్నారు. అధికారులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో అవ్వ కృష్ణ భార్య బంగారమ్మ(35), ఆమె కుమార్తె గౌరి(16) దుర్మరణం చెందారు. వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అవ్వ కృష్ణ, ఆయన కుమారుడు రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. కనిపించకుండా పోయిన తన భార్య, కుమార్తె కోసం అవ్వ కృష్ణ చాలాసేపు వెతుకసాగారు. ఇంతలోనే విశాఖపట్నంలోని ఆయన సమీప బంధువులు బంగారమ్మ, గౌరీల మృతదేహాలను టీవీలో చూసి కృష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దాంతో కృష్ణ హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశారు. విగతజీవులై పడి ఉన్న తన భార్య, కుమార్తెలను చూసి హతాశుడయ్యారు.
ఒక్క ఆధారం తెగిపోయింది: సీతమ్మధారకు చెందిన కోటిన మహాలక్ష్మి( 68) రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త పింఛనే ఆమె కుటుంబానికి ఆధారం. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహాలక్ష్మి తమ బంధువులతో కలసి సోమవారం రాత్రి విశాఖపట్నంలో బయలుదేరి వెళ్లారు. తొక్కిసలాటలో ఆమె కిందపడిపోయి ప్రాణాలు విడిచారు. దాంతో ఆ కుటుంబానికి ఉన్న ఒక్క ఆదరవూ లేకుండాపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ కుటుంబాని నిండాముంచేసింది.
పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు : కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వారిని రాజ మండ్రి దుర్ఘటన కబళించేసింది. పెందుర్తికి చెందిన గొర్లె మంగమ్మ (61) అసువులు బాశారు.ఆమె తమ బంధువులతో కలసి మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. పుష్కరస్నానం కోసం నీరిక్షిస్తున్న ఆమె తొక్కిసలాటలో కిందపడిపోయి ప్రాణాలు విడిచారు. మంగమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమెతోపాటు పుష్కరాలకు వెళ్లిన పెందుర్తికి చెందిన గొర్లె అచ్చియమ్మ, చీపురుపల్లి సాదమ్మ, నరవ అచ్చియమ్మలు తీవ్రంగా గాయపడ్డారు.
గాజువాకకు చెందిన అగనంపూడికి చెందిన పాండవుల విజయలక్ష్మి( 61) రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో దుర్మరణం చెందారు. అగనంపూడికి చెందిన ఆమె కొంతకాలంగా గాజువాకలో తన కుమారుల వద్ద ఉంటున్నారు. విజయలక్ష్మి తమ బంధువలతో కలసి మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. సాయంత్రానికి వచ్చేస్తానని తన కుమారులకు ఫోన్ చేసి చెప్పారు కూడా. కానీ అంతలోనే పుష్కరఘాట్‌లో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడిచారు. జిల్లా నుంచి వెళ్లిన వేలాదిమందిలో పలువురి ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.