పుష్కర ఏర్పాట్లు వేగవంతం | Authorities special care on godavari pushkarni works | Sakshi
Sakshi News home page

పుష్కర ఏర్పాట్లు వేగవంతం

Published Tue, Jul 7 2015 2:18 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

పుష్కర ఏర్పాట్లు వేగవంతం - Sakshi

పుష్కర ఏర్పాట్లు వేగవంతం

- 90 శాతం పూర్తయిన ‘సాధుగ్రామ్’
- నాసిక్, త్రయంబకేశ్వర్‌లో ఘాట్ నిర్మాణ పనులు ముమ్మరం
- ఏర్పాట్లలో నిమగ్నమైన అన్ని విభాగాల అధికారులు
- పదిరోజుల్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలు
సాక్షి, ముంబై:
మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. పుష్కరాలు సమీపిస్తుండటంతో పనులను తొందరగా పూర్తి చేసేందుకు అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు. త్రయంబకేశ్వర్, నాసిక్‌లో జరిగే పుష్కరాలకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉండటంతో గతంలో కంటే మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ‘సింహస్థ కుంభమేళా 2015-16’ కోసం ప్రభుత్వం రూ. 2378.78 కోట్ల నిధులను కేటాయించింది.

ఈ నిధులను వినియోగిస్తూ పనులు పూర్తి చేసే బాధ్యతలను 23 విభాగాలకు అప్పగించింది. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టనున్న 109 రకాల పనుల కోసం విడుదల చేసిన రూ. 1112 కోట్ల నిధులు కూడా ఇందులోనే ఉన్నాయి. కుంభమేళాకు వచ్చే లక్షలాది సాధువులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘సాధుగ్రామ్’ (సాధువుల గ్రామం) ను నిర్మిస్తున్నారు. నాసిక్‌లో ఈ పనులు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. త్రయంబకేశ్వర్‌లోసుమారు 15 ఎకరాలను సాధుగ్రామ్ కోసం సేకరించారు.

ఇక్కడ మొత్తం 68 రకాల పనులు ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. మరికొన్ని పనులు టెండర్ల ద్వారా జరుగుతున్నాయి. నాసిక్‌లో సుమారు 2,690 మీటర్ల మేర నూతన రామ్‌ఘాట్ నిర్మాణాన్ని  ప్రభుత్వం చేపట్టింది. ఆ పనులను జలవనరుల శాఖకు అప్పగించింది. త్రయంబకేశ్వర్‌లో కూడా నాలుగు ఘాట్‌ల నిర్మాణం జరుగుతోంది. దీంతో కొత్తగా 950 మీట్ల పొడవైన ఘాట్ భక్తులకు అందుబాటులోకి రానుంది. సీసీటీవీలు, కమ్యూనికేషన్ కోసం సెల్‌ఫోన్ టవర్ల నిర్మాణం వంటి పనులు పెద్దెత్తున జరుగుతున్నాయి.
 
సాధుగ్రామ్‌కు రెండింతల స్థలం
2003లో జరిగిన కుంభమేళా కోసం నిర్మించిన సాధుగ్రామ్ కంటే ఈ సారి రెండింతలు అధికంగా స్థలాన్ని సేకరించారు. 315 ఎకరాల స్థలం సాధుగ్రామ్ కోసం అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున గదుల నిర్మాణం జరుగుతోంది. సాధుగ్రామ్‌లో 300, 600 చదరపు మీటర్లతో 1,537 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. పనుల పర్యవేక్షణకు డిప్యూటీ కమిషనర్లు హరిభావు ఫడోల్, డీటీ గోతిసే, రోహిదాస్ దోరకుల్కర్‌లను నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్  డాక్టర్ ప్రవీణ్ గోడామ్ నియమించారు. కుంభమేళా కోసం నాలుగు లక్షల మందికిపైగా సాధువులు రానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చే సాధువుల కోసం 3,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2,100 మెట్రిక్ టన్నుల గోధుమ, 1,200 మెట్రిక్ టన్నుల బియ్యం, పప్పుదినుసులు అందులో ఉన్నాయి. సాధువుల కోసం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను అందుబాటులో ఉంచనున్నారు.
 
20 వేల మంది పోలీసులతో బందోబస్తు

నాసిక్‌లో జరగనున్న కుంభమేళా కోసం 20 వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులందరికీ ఉండేందుకు స్థలం, భోజన సదుపాయాలపై కూడా అధికారులు ప్రత్యేక  శ్రద్ద తీసుకున్నారు.
 
భాషాప్రావీణ్యుల సహకారం...

పుష్కరాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు అంతకంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారిని అధికారులు ఎంపిక చేశారు. ప్రధానంగా తెలుగు, కన్నడ, తమిళం తదితర భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారిని నియమించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement