కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలు
- ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తాం
- ధర్మపురిలో సీఎం కేసీఆర్ పుష్కర స్నానం
- వర్తక, వాణిజ్య సంఘాలు ముందుకు రావాలి
- ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల
ముకరంపుర : గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, రైస్‌మిల్లర్స్‌తో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ పాల్గొన్నారు. గోదావరిలో నీటి కొరత దృష్ట్యా ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 5కోట్ల మంది జిల్లాలో పుష్కరస్నానాలకు వచ్చే అవకాశముందన్నారు. పుష్కర భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా రాష్ట్రంలో రూ.600 కోట్లతో పలు ఏర్పాట్లు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 13న ధర్మపురి చేరుకుని రాత్రి బస చేస్తారని, 14న ఉదయం 6.26 గంటలకు ధర్మపురిలో పుష్కరస్నానం ఆచరిస్తారని పుష్కరాలను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
సేవలందించేందుకు ముందుకు రావాలి
పుష్కరాల్లో రోజుకు 10లక్షల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం దాతలు, స్వచ్చంద సంఘాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నర్సింగరావుతో పాటు బాధ్యులు ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల వద్ద ఉద్యోగులకు, ఇతర భక్తులకు రోజుకు 2-4 వేల మందికి అన్నదానం చేసేందుకు సహకరిస్తామన్నారు. జువెల్లరీ అసోసియేషన్ బాధ్యులు రమేష్ మినరల్ వాటర్ అందిస్తామన్నారు.
కంకర క్రషర్ సంఘం ప్రతినిధి అంజయ్య రూ.2లక్షలు విరాళం అందిస్తామన్నారు. ఐఎంఏ బాధ్యులు అవసరమైన వైద్యసిబ్బందితో క్యాంపులు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. ప్రైవేట్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ బాధ్యులు జిల్లా వైద్యశాఖ సూచనల మేరకు అన్నివిధాలా సహకరిస్తామన్నారు. వెల్గటూర్ కంకర ప్రెషర్ యాజమాన్య బాధ్యులు చక్రవర్తి కోటిలింగాల వద్ద 500 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తామని, పుష్కరఘాట్లకు ప్రెషర్ డస్ట్‌ను పంపిస్తామని అన్నారు. దాతలు అందించే సేవా కార్యక్రమాలను డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, సీపీవో సుబ్బారావు పర్యవేక్షిస్తారని కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు.
రోజూ 10 లక్షల మందికి అన్నదానం
Published Fri, Jul 10 2015 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement