సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహస్య పాలన సాగుతోంది. ప్రభుత్వ పరిపాలన రోజురోజుకు గోప్యమవుతోంది. సర్కారు జారీ చేసే ఉత్తర్వులు ప్రజలు తెలుసుకోడానికి అందుబాటులో తెచ్చిన జీఓఐఆర్ (గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్) వెబ్‌సైట్‌లో జీవోల నమోదు క్రమంగా తగ్గిపోతోంది. గత మూడేళ్లలో వెబ్‌సైట్‌లో జీవోల అప్‌లోడ్ తంతు మూడో వంతుకు పడిపోయింది. చిన్నాచితకా అంశాల జీవోలు మినహా.. పాలనాపరమైన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నియామకాలకు సంబంధించిన కీలక జీవోలను బహిర్గతం చేయడం లేదు. పాలనలో పారదర్శకత పాటిస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారు.. కీలక నిర్ణయాలు, ఆదేశాల జారీలో మాత్రం గోప్యత పాటిస్తోంది.
2017లో 8,600 జీవోలే
2015 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి 21,702 జీవోలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా.. 2017లో కేవలం 8,696 జీవోలే అప్‌లోడ్ అయ్యాయి. ఈ లెక్కన మూడేళ్లలో జీవోల సంఖ్య మూడో వంతుకు పతనమైంది. పాలనాపర అంశాలపై సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవోలు జారీ చేస్తున్నా.. వాటిని వెబ్‌సైట్‌లో మాత్రం అప్‌లోడ్ చేయడం లేదు. సాంకేతిక విభాగం క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతోనే జీవోలు ప్రజల్లోకి వెళ్లడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు రెండు, మూడేళ్లుగా వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఉన్నతాధికారుల బదిలీలు, కొందరి నియామకాలు, పదోన్నతులు, శాఖాపరమైన అంశాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల జీవోలు కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం లేదు. కొన్ని ఆయా శాఖల ప్రత్యేక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నా ఆ వెబ్‌సైట్లపై అవగాహన లేక వివరాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు.
కుప్పలుతెప్పలుగా సాధారణ జీవోలు
చిన్నాచితకా ఉత్తర్వులే వెబ్‌సైట్‌లో కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. అధికారులు, ఉద్యోగులకు టీఏ, డీఏ మంజూరు, పేపర్ బిల్లుల చెల్లింపులు, స్టేషనరీ, లేబర్ కేసుల వివరాలు వందల్లో దర్శనమిస్తున్నాయి. ఇవి ప్రజలకు పెద్దగా ఉపయోగపడనప్పటికీ.. ప్రత్యేకంగా అప్‌లోడ్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఇటీవల ఫిర్యాదు చేసింది. త్వరలో ఈ అంశంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు సంస్థ కార్యదర్శి, మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డి చెప్పారు.
చాటుమాటు పాలన..!
Published Mon, Jun 25 2018 2:37 AM | Last Updated on Mon, Jun 25 2018 2:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment