స్మితా సబర్వాల్ , సంగీత, రాహుల్ బొజ్జా, చంద్రశేఖర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు పాలనలో మార్పుబాట పట్టింది. ఇప్పటి వరకు వివిధ శాఖలు, విభాగాల్లో కీలకంగా పనిచేస్తూ వచ్చిన పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీస్థాయి అధికారులను బదిలీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల అమలుతోపాటు కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి తన జట్టును సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాలనా యంత్రాంగంలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టారు. తాజాగా ఒకేసారి 26 మంది ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లు, 21 మంది నాన్ కేడర్ ఎస్పీస్థాయి అధికారులకు స్థాన చలనం కల్పించారు.
ఐఏఎస్‌లలో 18 మందికి పూర్తిగా కొత్త బాధ్యతలు అప్పగించగా.. మిగతా 8 మందికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఐదు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఐపీఎస్‌లలో అందరినీ కొత్త స్థానాలకు బదిలీ చేశారు. నాన్ కేడర్ ఎస్పీ అధికారులకు కొన్ని స్థానాల్లో కీలక పోస్టింగ్‌లు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడం ఇష్టం లేని, 18 గంటలు పనిచేయాలా అని అసంతృప్తిగా ఉండే అధికారులను పెద్దగా పనిలేని స్థానాలకు బదిలీ చేయడానికి సర్కారుకు అభ్యంతరం లేదని ఇటీవల సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇది జరిగి వారం గడవక ముందే భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు జరగడం గమనార్హం.
ఫైనాన్స్ కమిషన్‌కు స్మితా సబర్వాల్
గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా, మిషన్ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూసుకున్న స్మితా సబర్వాల్ పెద్దగా ప్రాధాన్యత ఉండని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. గత ప్రభుత్వం నవంబర్ 30న ఆమెకు నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కానీ సర్కారు మారడంతో ఆమె ఆ బాధ్యతలను చేపట్టడానికి ఆసక్తి చూపలేదు. దీంతో నీటి పారుదల శాఖ అదనపు బాధ్యతల నుంచి సైతం స్మితను ప్రభుత్వం తప్పించింది.
ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీ రంగారెడ్డి కలెక్టర్‌గా నియమించిన భారతి హొళికేరిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించి వెయిటింగ్‌లో పెట్టింది. తాజాగా రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్‌గా ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. భూముల వ్యవహారంలో ఆమెపై ఆరోపణలు రావడంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఆర్‌డబ్ల్యూఎస్ కార్యదర్శిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
రాహుల్ బొజ్జాకు నీటిపారుదల శాఖ
సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సుదీర్ఘకాలం నుంచి అప్రాధాన పోస్టుల్లో కొనసాగుతున్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ అదనపు డీజీ బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కాకు ఎట్టకేలకు కీలక పోస్టింగ్ లభించింది. ఆయనకు ప్రభుత్వం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్‌లో ఉన్న డి.దివ్యను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌గా నియమించింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను గిరిజన శాఖ కార్యదర్శిగా బదిలీ చేయగా.. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశంకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు.
కీలకమైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పదవి కె.శశాంకకు దక్కింది. నారాయణపేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పరి్ణకారెడ్డి తల్లి, 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చిట్టెం లక్ష్మి ఇన్నాళ్లూ వెయిటింగ్‌లో ఉండగా.. ఆమెను టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియమించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావుకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ జె.శంకరయ్య (నాన్ కేడర్)ను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది.
సీఎం పేషీకి మూడు కొత్త ముఖాలు
ప్రభుత్వం మరో ముగ్గురు అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ చేసింది. తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ, ఎండీగా ఉన్న ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి జి.చంద్రశేఖరరెడ్డిని ముఖ్యమంత్రికి కార్యదర్శిగా సీఎంఓకు బదిలీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ బాధ్యతలు కూడా నిర్వహించాలని ఆయనను ఆదేశించారు. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు (నాన్ కేడర్ అధికారి)ను ముఖ్యమంత్రికి ఓఎస్డీగా సీఎంఓకు బదిలీ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కుమార్తె, 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీ పోస్టు నుంచి బదిలీ చేస్తూ.. ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శిగా కీలక పదవిలో నియమించారు. దీంతో సీఎం కార్యాలయంలో కీలకమైన పదవుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, డిఫెన్స్ సర్వీసెస్, గ్రూప్–1 అధికారులను నియమించినట్టు అయింది. ఇప్పటికే సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి (ఐఏఎస్), కార్యదర్శిగా షానవాజ్ ఖాసీమ్ (ఐపీఎస్), అదనపు కార్యదర్శిగా అజిత్‌రెడ్డి (డిఫెన్స్ సర్వీసెస్) అధికారులను ప్రభుత్వం నియమించింది.
మూడు కమిషనరేట్లకు కొత్త సీపీలు
రాష్ట్రంలో మూడు కమిషరేట్లకు ప్రభుత్వం కొత్త పోలీస్ కమిషనర్లను నియమించింది. రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఎల్‌ఎస్ చౌహాన్‌ను, ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా సునీల్‌దత్, సిద్దిపేట పోలీసు కమిషనర్‌గా బి.అనురాధను ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఐదు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావును అదనపు డీజీ (టెక్నికల్ సర్వీసెస్)గా ప్రభుత్వం బదిలీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతల్లోనూ కొనసాగాలని ఆయనను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment