అభివృద్ధికి నూతన ఒరవడి
∙ స్వాతంత్య్ర దినోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
∙ అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం
∙ రైతు సంక్షేమానికి పెద్దపీట
∙ అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం
∙ వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి రాయితీ
∙ కులవృత్తిదారులకు ఆర్థిక తోడ్పాటు
∙ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
∙ జిల్లాకు త్వరలోనే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి
∙ హరితహారం లక్ష్యాన్ని చేరుకుంటాం
‘అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నూతన ఒరవడితో అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం.. వ్యవసాయంలో రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్ర సౌభాగ్యం కోసం అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.. మానవతా కోణంలో రైతులకు వచ్చే ఏడాది నుంచి 2 పంటలకు 8 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని తప్పకుండా అమలు చేస్తాం.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం.. పాలకులు, అధికార యంత్రాంగంపై పూర్తి విశ్వాసం కలిగేలా ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తాం’ అని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం కరీంనగర్ పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. – సాక్షి, కరీంనగర్
కరీంనగర్: పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి..
స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,79, 581 కుటుంబాలకు గాను 1,76,083 కుటుంబాలకు రూ.48 కోట్లతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో, దేశంలో 20వ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 98 శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకుని వాడుకుంటున్నాయని.. వచ్చే గాంధీ జయంతి నాటికి మిగితా 2 శాతం మరుగుదొడ్లు నిర్మించుకొని సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జిల్లాలోనే ప్రారంభించి పిలుపునివ్వడంతో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు 1.10 కోట్లకు గాను 35 లక్షలు నాటినట్లు తెలిపారు. వర్షాభావంతో మందగించినా లక్ష్యం మేరకు మొక్కలు నాటుతామని తెలిపారు. నాటిన మొక్కలను రక్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.
వచ్చే ఏడాది రైతులకు పెట్టుబడి..
అన్నం పెట్టే రైతులకు మానవీయ కోణంతో వచ్చే ఏడాది నుంచి రెండు పంటలకు గాను రూ.8 వేల పెట్టుబడి నగదు సహాయాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైస్‌బోల్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఆహార ఉత్పత్తిలోనూ అగ్రగామిగా ఉందని, ఇదే స్ఫూర్తిని రైతులు కొనసాగించాలని కోరారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపే దృఢసంకల్పం తో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని ప్రాథమిక సహకార సంఘాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 2017–18 ఖరీఫ్ సీజన్‌కు రూ.763.67 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులను అప్పుల ఊబి నుంచి తొలగించామన్నారు. రైతులు తక్కువ నీరు ఎక్కువ సాగు, అధిక దిగుబడులు వచ్చే బిందు తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత..
ప్రభుత్వం సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. గోదావరి జలాలను మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అన్నారు. కోటి ఎకరాలకు నీరందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్‌కు శ్రీకారం చుట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నీటిలో నింపేందుకు రూ.వెయ్యి కోట్లతో పోచంపాడు వద్ద ఇటీవల ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శంకుస్థాపన చేశారని, దీంతో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. మధ్య మానేరు ప్రాజెక్టులో ఈ ఏడాది 10 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నామన్నారు.
ఉచిత విద్యుత్తు..
జిల్లాలో 1,02,696 వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత జూలై 18 నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.91 కోట్ల 66 లక్షల సబ్సిడీ భరిస్తోందని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో వ్యవసాయబావులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు 16, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు కావాల్సి ఉండగా 5 సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని, మిగిలినవి కూడా త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నివాస గృహాలపై ఉన్న ప్రమాదకరమైన హైటెన్షన్ విద్యుత్ లైన్లు తొలగిస్తున్నామన్నారు. కరీంనగర్ సిటీ ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా రూ.28.50 కోట్లతో 580 విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశామన్నారు.
డిసెంబర్‌లోగా ఇంటింటికీ నీరు..
తాగునీటికి మహిళలు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడానికి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి ఇంటికీ నల్లాకనెక్షన్ ద్వారా డిసెంబర్‌లోగా తాగునీటిని అందించనున్నామని తెలిపారు. జిల్లాలో రూ.1,492 కోట్లతో 2 సెగ్మెంట్‌లలో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. మిషన్‌కాకతీయ పథకం ద్వారా మొదటిదశలో రూ.88 కోట్లతో 223 చెరువులు మంజూరు చేసినట్లు తెలిపారు. 215 చెరువులలో పనులు పూర్తయ్యాయని, రెండో దశలో రూ.122.54 కోట్లతో 290 చెరువుల పనులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అందులో 153 చెరువు పనులు పూర్తి చేశామని, మిగిలినవి ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. మూడో దశలో 299 చెరువులలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
నాణ్యమైన విద్య, వైద్యం..
ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 6 మైనార్టీ గురుకుల, 5 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు. మూడేళ్లలో 504 గురుకుల పాఠశాలలు ప్రభుత్వం మంజూరు చేసి ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రతి పేద విద్యార్థిపై సంవత్సరానికి రూ.1.05 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. అన్ని పాఠశాలలకు రూ.50 కోట్లతో ప్రహరీల నిర్మాణం, గేట్లు అమర్చేందుకు తదితర మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి ఉత్తమ వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రూ.20 కోట్లతో నిర్మించిన 150 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి సేవలందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇంతవరకు 768 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఆడపిల్లల తల్లులకు రూ.13 వేలు, మగబిడ్డ తల్లులకు రూ.12 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు..
అన్ని వర్గాల సంక్షేమం..
ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన 5,284 డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో 279 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలినవి అగ్రిమెంట్ దశలో, టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలలో భాగంగా పేదకుటుంబాలకు రూ.75,116 చొప్పున ఆర్థిక సాయమందిస్తోందన్నారు. గొల్ల కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తూ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. జిల్లాలో 2,347 యూనిట్లు లక్ష్యం కాగా.. రూ.14 ,69 కోట్లతో 1,323 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. మత్స్యకారుల కోసం చేపల పెంపకానికయ్యే పెట్టుబడిని ప్రభుత్వమే భరించి, లాభాలను బెస్త, ముదిరాజ్ తదితర మత్స్యకారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చేనేత కార్మికులకు అవసరమయ్యే నూలు, రసాయనాలను 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోందన్నారు. నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. నవీన క్షౌ రశాలలు పెట్టుకునేందుకు నాయీ బ్రాహ్మణులకు రూ.లక్ష ఆర్థిక సహకారమందిస్తుందన్నారు. రజకులకు అధునాతన యంత్రాలనందించనుందన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఆర్థిక తోడ్పాడునందించనుందన్నారు. ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసరా పథకంలో 1.15,160 మందికి జిల్లాలో పింఛన్లు అందుతున్నాయన్నారు.
∙ బ్యాంకు లింకేజీ కింద స్వశక్తి సంఘాలకు 2017–18 సంవత్సరంలో రూ.246 కోట్ల బ్యాంకు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించి ఇంత వరకు రూ.50 కోట్ల రుణాలిప్పించామన్నారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా 2016–17 సంవత్సరంలో 80 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా ఇంతవరకు రూ.19 కోట్లు పంపిణీ చేశారని తెలిపారు.
∙ ఆర్‌అండ్‌బీ ద్వారా జిల్లాలో అన్ని రకాల రోడ్లను అభివృద్ధి చేసేందుకు, లింకు రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతుకు ప్రభుత్వం జిల్లాకు రూ.218 కోట్లు మంజూరు చేయగా పనులన్నీ ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.
∙ స్మార్ట్‌సిటీగా ఎంపికైన కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఎల్‌ఎండీ దిగువన మానేరు రివర్‌ఫ్రంట్‌ను ఉత్తర తెలంగాణ మణిమకుటంగా సుందరంగా నిర్మించనున్నామని తెలిపారు. ఉజ్వలపార్కు వద్ద హరిత హోటల్‌ను నిర్మిస్తామని తెలిపారు.
∙ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం కృషిని అభినందించారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించలేదని, ఉక్కుపాదం మోపడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, వొడితెల సతీష్‌బాబు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగరపాలక కమిషనర్ శశాంక, జేసీ బద్రి శ్రీనివాస్, ఆర్డీవో రాజాగౌడ్, ›ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.