తిండి లేదు...వసతి దొరకదు !
- పుష్కరాల్లో సిబ్బంది ఇబ్బందులు
చిత్తూరు (అర్బన్) : ప్రపంచమే తలెత్తి చూసేలా గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇక్కడ పనిచేసే సిబ్బంది గోడును ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. పుష్కరాల విధులకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. పుష్కరాల విధుల్లో ఉన్న వారికి కనీసం భోజనం, వసతులు ఏర్పాటు చేయకపోవడంతో జిల్లా నుంచి వెళ్లిన సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.
పుష్కరాల కోసం జిల్లా నుంచి దాదాపు 1600 మంది పోలీసులు, 200 మంది మునిసిపల్ ఉద్యోగులు, సిబ్బంది వెళ్లారు. ఇతర శాఖల నుంచి 500 మంది వరకు పుష్కరాల విధులకు వెళ్లారు. వీరిలో గెజిటెడ్ ర్యాంకు ఉన్న అధికారులకు కొద్దో గొప్పో కాస్త తినడానికి తిండి, ఉండటానికి చోటు కల్పించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందిని పూర్తిగా విస్మరించారు. ప్రధానంగా పారిశుద్ధ్య పనుల నిర్వహించడానికి జిల్లా నుంచి వెళ్లిన మునిసిపల్ కార్మికులు తిండి లేకుండా అలమటిస్తున్నారు.
వీరికి టీఏ, డీఏలు ఇస్తామని తీసుకెళ్లిన అధికారులు పనులు చేయమని రాజమండ్రి ఇతర ప్రాంతాల్లో విధులు కేటాయించారు. అయితే సమయానికి భోజనాలు పంపించడం లేదని విధుల్లో ఉన్న కొందరు సిబ్బంది ఫోన్ ద్వారా వారి ఆవేదన వ్యక్తంచేశారు. ఆలయాల వద్ద పెట్టే ప్రసాదాలు తిని కడుపు నింపుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ఎప్పుడో పొట్లాల్లో ప్యాక్ చేసి ఉంచిన భోజనాలు పంపిస్తుండటంతో అవి పాచిపోయి కంపుకొడుతున్నాయని తెలిపారు. విధులు పూర్తిచేసిన తరువాత ఉండటానికి గదులు ఇవ్వకపోవడంతో గుడుల వద్ద, రోడ్డు పక్కన పడుకోవాల్సి వస్తోందని చె ప్పారు.
పట్టించుకునే దిక్కులేదు...
తిండీ తిప్పలు, బస సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పుష్కరాల విధు ల్లో ఉన్న పర్యవేక్షకులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అదిగో.. మీ సమస్య తీర్చేస్తాం, ఇప్పుడే భోజనాలు పంపిస్తాం.. అంటూ జిల్లాకు చెందిన సిబ్బందిని కొందరు అధికారులు మభ్యపెడుతున్న ట్లు బాధితులు వాపోతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దితే తప్ప తమ సమస్యలు తీరవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.