సారీ.. ‘నో రూమ్‌’! | Trains full Rush sankranti festival | Sakshi
Sakshi News home page

సారీ.. ‘నో రూమ్‌’!

Published Mon, Dec 31 2018 12:00 PM | Last Updated on Mon, Dec 31 2018 12:00 PM

Trains full Rush sankranti festival - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): సంక్రాంతికి దాదాపు రైళ్లన్నీ ఫుల్‌ అయ్యాయి. చాలా రైళ్లల్లో నో రూమ్‌ దర్శనమిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌–హౌరా వెళ్లే మార్గంలో రద్దీ బాగా ఉంది. విశాఖ, హౌరా వైపు వెళ్లే ఫలక్‌నూమా, కోరమాండల్, మెయిల్, గోదావరి, సికింద్రాబాద్‌ వైపు వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో జనవరి 9, 10, 11, 12 తేదీల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ కూడా పూర్తయి నోరూమ్‌ దర్శనమిస్తుంది. అదే విధంగా తిరుపతి వైపు వెళ్లే తిరుమల, పద్మావతి, భువనేశ్వర్‌ వైపు వెళ్లే విశాఖ, కోణార్క్, చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లల్లో జనవరి 9 నుంచి పండుగ రోజుల్లోనూ వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లో ఉంది. మరో వైపు విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు Ððవెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు రత్నాచల్, పినాకినీ, శాతవాహన రైళ్లల్లో జనవరి 9, 10, 11, 12 తేదీల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ చాంతాడంతా ఉంది. మరో వైపు సువిధ ప్రత్యేక రైళ్ల పేరుతో రైల్వేశాఖ అధిక చార్జీలతో ప్రయాణికులను నడ్డి విరుస్తోంది.

ఆశలన్నీ తత్కాల్‌ పైనే.. 
ఇప్పటికే పలురైళ్లల్లో రిజర్వేషన్లు పూర్తవడంతో ప్రయాణికుల తత్కాల్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. దీంతో తత్కాల్‌ టికెట్లకు ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది.

ప్రత్యేక రైళ్లదీ అదే తీరు
మరోవైపు సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో 100 పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే అవి ప్రస్తుత రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. విజయవాడ మీదుగా అన్‌సీజన్‌లో రోజుకు లక్ష మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుండగా పండుగ సమయాల్లో రోజుకు 2 లక్షల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారని అంచనా.

దళారుల దందా..
ప్రత్యేక రైళ్లకు బుకింగ్‌లు ప్రారంభమైన క్షణాల వ్యవధిలోనే దళారులు రిజర్వేషన్లను ఎగరేసుకెళ్తున్నారు. దీంతో సగటు ప్రయాణికుడు ఉసూరంటూ వెనుదిరగ వలసి వస్తోంది. లేదా వెయిటింగ్‌ జాబితాకు పరిమితం కావలసి వస్తోంది.

 అధికారుల నియంత్రణ చర్యలను తోసిరాజని దళారులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. కొన్ని ట్రావెల్స్‌ యాజమాన్యాలు మారుపేర్లతో టికెట్లు బుక్‌ చేసి దళారులు ద్వారా విక్రయాలు జరుపుతున్నాయి. కన్‌ఫమ్‌ టికెట్ల కోసం వారు అడిగినంత ఇచ్చి టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రయాణికులకు కల్పిస్తున్నారు. 

మరిన్ని ప్రత్యేక రైళ్లు పెడితేనే..
ప్రయాణికుల రద్దీని దృష్ట్యా మరిన్ని అదనపు ప్రత్యేక రైళ్లు నడపాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. సికింద్రాబాద్‌–తిరుపతి, సికింద్రాబాద్‌–చెన్నై, సికింద్రాబాద్‌ –హౌరా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిడితే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement