ప్లాట్లు, పొలాలు, నగలు, నగదు | Transport Deputy Commissioner Corruption | Sakshi

ప్లాట్లు, పొలాలు, నగలు, నగదు

Apr 29 2016 2:28 AM | Updated on Aug 17 2018 12:56 PM

కాకినాడలో రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఆదిమూలం మోహన్‌కు ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లో గల ఆస్తులపై అవినీతి నిరోధకశాఖ

 కాకినాడ రూరల్ : కాకినాడలో రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఆదిమూలం మోహన్‌కు ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లో గల ఆస్తులపై అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. మోహన్ ఆదాయూనికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఈ దాడులు చేశామని ఏసీబీ డీఎస్పీ ఎ.రమాదేవి చెప్పారు. దాడుల్లో భారీగా బంగారం, వెండి వస్తువులు, నగదుతో పాటు రూ.కోట్ల విలువ చేస్తే ప్లాట్లు, పొలాలు, బినామీ పేర్లతో ఉన్నా ఐదు కంపెనీలకు సంబంధించిన దస్తావేజులు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మోహన్‌కు నెల్లూరు, హైదరాబాద్‌లలో పలు కంపెనీలున్నట్లు దాడుల్లో బయటపడింది.
 
 డీటీసీ మోహన్ భారీగా ఆస్తులు కూడబెట్టడంతో పాటు బంధువుల పేరుతో రక,రకాల వ్యాపారాలు సృష్టించి నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు యత్నించారని ఏసీబీ అధికారులు చెప్పారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ గైగోలుపాడులోని మోహన్ నివాసంతో పాటు ఏపీ, తెలంగాణ , కర్నాటక రాష్ట్రాల్లో తొమ్మిదిచోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల్లో బయటపడ్డ ఆస్తుల మార్కెట్ విలువ రూ.35 కోట్లు పైబడి ఉండవచ్చని, వాస్తవ విలువ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ ఉండొచ్చని ఏసీబీ అధికారుల అంచనా.
 
 హైదరాబాద్‌లో 12 ప్లాట్లు, ఓ అపార్ట్‌మెంట్
 కాకినాడతో పాటుహైదరాబాద్, అనంతపురం, విజయవాడ, ప్రొద్దుటూరు, కడప, నెల్లూరు, కాకినాడ, చిత్తూరు, బళ్లారిల్లో ఏకకాలంలో ఏసిబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో 8  ప్లాట్లు, మాదాపూర్‌లో నాలుగు ప్లాట్లు, పంజాగుట్టలో ఒక ప్లాటు, జూబ్లీ హిల్స్‌లో 699 గజాల్లో నాలుగంతస్తుల అపార్టుమెంటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడలో కుమార్తె పేరుతో ఒక ఇల్లు అల్లుడి పేరుతో  రెండు ఇళ్లు, చిత్తూరులో తొమ్మిది ఎకరాల భూమి, ప్రకాశం జిల్లాలో 45 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాక బళ్లారి, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాదుల్లో ఇంకా అనేక ఎకరాల భూములు ఉన్నట్లు భావిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
 
 బ్యాంక్ ఖాతాలు, లాకర్ల సీజ్
 కాకినాడతో పాటు రాష్ట్రంలో డీటీసీ మోహన్‌తో పాటు అతని కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలను, లాకర్లను సీజ్ చేయనున్నట్లు డీఎస్పీ రమాదేవి చెప్పారు. దాడుల్లో పలు కీలక దస్తావేజులతో పాటు సెల్‌ఫోన్లు, బ్యాంకు పుస్తకాలు సీజ్ చేశామని, సోదాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని వివరించారు. మోహన్ కుమార్తె పేరుతో హైదరాబాదు, నెల్లూరుల్లో ఐదు సంస్థలు నడుపుతున్నట్లు రికార్డులున్నా ఆ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలే తప్ప సంస్థలు లేవని తేలిందన్నారు.
 
  రికార్డుల్లో శ్రీ తేజా బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్, తేజ అండ్ తేజశ్రీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెర్క్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి దివ్య డెవలపర్స్, రోజాలిన్ రాక్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో సంస్థలు నడుపుతున్నట్లు ఉందన్నారు. మూడు రాష్ట్రాల్లో  తొమ్మిది చోట్ల జరుగుతున్న దాడుల్లో ముగ్గురు డీఎస్పీలు, 9 మంది సీఐలు, 25 మంది సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు.  ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన డీటీసీ మోహన్‌ను అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు చెప్పారు. కాకినాడలో నిర్వహించిన దాడుల్లో డీఎస్పీ రమాదేవితో పాటు సీఐలు సుదర్శనరెడ్డి, సతీష్‌కుమార్, ఎస్‌ఐ విష్ణువర్ధన్‌లతో పాటు మరో ఆరుగురు సిబ్బంది పాల్గొన్నారు.
 
 ఇరిగేషన్ ఏఈ నుంచి డీటీసీగా..
 డీటీసీ మోహన్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1989లో ఆర్టీవో అరుు వరంగల్, నిజామాబాద్, హైదరాబాదుల్లో పనిచేశారు. 1998లో గ్రూప్-1 అధికారిగా ఎంపికై నేరుగా రవాణాశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, మళ్లీ నెల్లూరుల్లో పనిచేసి డీటీసీగా కాకినాడకు ఏడాదిన్నర క్రితం వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement