► ఎడాపెడా ఫీజుల వాయింపు
► ఎల్‌ఎల్‌ఆర్ నుంచి లెసైన్సు వరకు మోత
► రిజిస్ట్రేషన్లు, ఎఫ్‌సీలనూ వదలని వైనం
► సామాన్యుడే లక్ష్యంగా వడ్డన
► నేటి నుంచి కొత్త చార్జీల వసూళ్లు
చిత్తూరు (అర్బన్) : ‘రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆదాయ మార్గాలు అన్వేషించాలి. డబ్బును పొదుపు చేయాలి.’ ఇవి సీఎం చంద్రబాబునాయుడు నిత్యం వల్లించే నీతిసూత్రాలు. అదే సమయంలో ఆయన రూ.కోట్లు కుమ్మరించి బంధుమిత్ర సపరివార సమేతంగా విదేశాలకు వెళ్లొస్తూ ఆ భారాన్నంతా సామాన్యులపై మోపుతున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచిన రాష్ట్ర సర్కారు తాజాగా రవాణా శాఖలో సేవా రుసుమును 50 నుంచి 100 శాతం పెంచుతూ శనివారం రాత్రి ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేసింది. పెంచిన చార్జీలను సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
జిల్లాలో ప్రతియేటా సగటున 28 వేలకు పైగా వాహనాలకు కొత్తగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సంవత్సరంలో 84 వేల మంది లెర్నర్ లెసైన్సులు (ఎల్‌ఎల్‌ఆర్), 75 వేల మంది డ్రైవింగ్ లెసైన్సుల కోసం వస్తుం టారు. ఇవిగాకుండా వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ)కోసం, పర్మిట్ల జారీ కోసం 15 వేలకు పైగా వాహనచోదకులు వస్తుంటారు. వీటితో పాటు త్రైమాసిక పన్నులు, అపరాధ రుసుము, జీవితకాలపు పన్నులు ఇలా రకరకాల సేవల ద్వారా జిల్లా రవాణాశాఖకు ఏటా రూ.100 కోట్లకు పైనే వసూలవుతోంది.
2009-10లో రవాణా శాఖ నుంచి జిల్లాలో రూ.89.65 కోట్ల లక్ష్యం కేటాయించగా రూ.86.20 కోట్లు వసూలైంది. 2010-11లో రూ.111.44 కోట్లకుగానూ రూ.117.43 కోట్లు, 2011-12లో రూ.139.91 కోట్లకు గానూ రూ.126.19 కోట్లు, 2012-13లో రూ.150.65 కోట్లకు గానూ రూ.139.74 కోట్లు, 2013-14లో రూ.177.20 కోట్లకు గానూ రూ.127.63 కోట్లు, 2014-15లో రూ.150 కోట్లకు గానూ రూ.148.15 కోట్లు జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.
2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రవాణా శాఖలో యూజర్ చార్జీలు ప్రవేశపెట్టి ప్రజలపై భారం మోపారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని రద్దు చేయగా ఇప్పడు మళ్లీ బాబు ప్రభుత్వం యూజర్ చార్జీలను ప్రవేశపెట్టడమేగాక అన్ని రుసుములూ 50 నుంచి 100 శాతానికి పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లా ప్రజలకు ఏటా అదనంగా రూ.60 కోట్ల వరకు భారం పడనుంది.
ఇలా పెంచేశారు..
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం రవాణా శాఖ కార్యాలయానికి ఏ పనిపై వెళ్లినా పెరిగిన సేవా రుసుం ప్రకారం నగదు చెల్లించాల్సిందే. ఒక్క వాహనం కోసం ఎల్‌ఎల్‌ఆర్ తీసుకునే వ్యక్తి నుంచి ఇప్పటి వరకు రూ.30 రుసుం, రూ.30 యూజర్ చార్జీలు కలిపి రూ.60 వసూలు చేస్తుండగా తాజాగా పెరిగిన రుసుం ప్రకారం దీన్ని రూ.120కి పెంచేశారు. ఎల్‌ఎంవీ లెసైన్సులకు రూ.100 నుంచి రూ.150, ట్రాన్స్‌పోర్టు లెసైన్సులకు రూ.150 నుంచి రూ.225కు పెంచేశారు. ఇక రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే ద్విచక్ర వాహనాలకు ఇప్పటి వరకు రూ.100 రుసుం ఉండగా దీన్ని రూ.150కి, రవాణేతర వాహనాలకు రూ.200 నుంచి రూ.300కు, ఆటోలకు రూ.100 నుంచి రూ.150, ఆటోలకు ఉన్న ఎఫ్‌సీలు రూ.30 నుంచి రూ.60, పర్మిట్లకు రూ.100 నుంచి రూ.150 చొప్పున పెంచేశారు.
‘రవాణా’ వాతలు !
Published Mon, Apr 20 2015 4:42 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement