నిగ్గు తేలుస్తారా? | Treasury is investigating the scam vanting ocarlapai | Sakshi
Sakshi News home page

నిగ్గు తేలుస్తారా?

Published Fri, Feb 26 2016 11:25 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

నిగ్గు తేలుస్తారా? - Sakshi

నిగ్గు తేలుస్తారా?

చింతపల్లి ట్రెజరీ కుంభకోణంలో వాంటింగ్ ఓచర్లపై ఆరా
12 మందిని విచారించిన జేడీ
ఇంటర్నల్ ఆడిట్‌పై కానరాని విచారణ
నోట్‌ఫైల్ లేకుండా బడ్జెట్ రిలీజ్ ఎలా చేశారో?
నేడూ దర్యాప్తు

 
మహారాణిపేట(విశాఖ): చింతపల్లి ట్రెజరీ కుంభకోణం దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న అధికారులతో పాటు గత ఐదేళ్లుగా ఈ శాఖలో జరిగిన చెల్లింపులపై ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ శివప్రసాద్ శుక్రవారం జిల్లా ఖజానాకార్యాలయంలో విచారణ చేపట్టారు. శనివారం కూడా ఇది కొనసాగుతుంది. సంబంధితశాఖ నోట్‌ఫైల్ ఆధారంగా బడ్జెట్‌ను ఆర్థికశాఖ విడుదల చేస్తుంది. కానీ ఈ కుంభకోణం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సంచలనమైన దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 2010 నుంచి 2015 మధ్య కాలంలో వైద్య,ఆరోగ్యశాఖలో కాంటాక్ట్ ఉద్యోగుల జీతాలను బినామీ పేర్లతో రూ.4 కోట్లు డ్రా చేసిన సంఘటనపై ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు డెరైక్టర్ ఆఫ్ ట్రెజరీస్‌ను ఆదేశించింది. 2010-15 మధ్య చింతపల్లి ఉపఖజానా కార్యాలయంలో పని చేసిన సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లు, ఎస్‌టీవో స్థాయి అధికారులు 12 మందిని  జేడీ విచారించారు. ఆరోగ్యశాఖలో ఈ కాలంలో ఎంతమంది కాంటాక్ట్ ఉద్యోగులు పని చేశారు.. వారి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, జీతాల ప్లేస్లిప్‌లతో పాటు వారి వద్ద నుంచి వచ్చిన ఓచర్లు, వాంటింగ్ ఓచర్లపై ఆరా తీశారు. ఆ సమయంలో సూపర్‌విజన్ ఆఫీసర్లు ఒకొక్కరిని విడివిడిగా విచారించిన జేడీ వారి వద్ద నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు.

వాంటింగ్ ఓచర్లు ఎలా వస్తాయి..
వాస్తవానికి ఈ విచారణ ప్రాథమిక స్థాయిలోనే తొక్కేసి అసలు దోషులను తప్పించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయన్న వాదన ఖజానాశాఖ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నాలుగుఐదేళ్లుగా రాని వాంటింగ్ ఓచర్లు ఇప్పుడెలా వస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా అసలు దోషులు బయటపడడానికే అన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
 
నోట్‌ఫైల్ లేకుండా బడ్జెట్ ఎలా..
బడ్జెట్ ఇచ్చేముందు సంబంధిత శాఖ నుంచి నోట్‌ఫైల్ ఉండాలి. దాని ఆధారంగా బడ్జెట్‌ను ఆర్థికశాఖ విడుదల చేస్తుంది. కానీ ఈ కుంభకోణం ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బడ్జెట్ కోసం డెరైక్టర్ ఆఫ్ ట్రెజరీస్, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్,వైద్య ఆరోగ్యశాఖ, సంబంధిత సెక్రటేరియేట్ విభాగం సిబ్బంది కలిసి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు నివేదించాలి. వారందరి ఆమోదంతోనే బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ఈ కాలంలోనే బడ్జెట్ రిలీజ్‌లోనూ తేడాలున్నాయి. ఏడాదికి రూ. కోటి అవసరమైనప్పుడు, తర్వాత సంవత్సరం అదే డిపార్ట్‌మెంట్‌కు రూ. నాలుగు కోట్లు.. ఆ తర్వాత ఏడాది దానికి రెట్టింపు నిధులు ఎలా విడుదల చేశారన్నదానిపై విచారణ జరపితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశముంది. ఈ బడ్జెట్ రిలీజ్‌లో తేడాలెందుకున్నాయో గమనించి విచారణ చేపట్టకుండా కేవలం వాంటింగ్‌ఓచర్లుపై విచారణ చేపడితే లాభం ఉండదు. వాస్తవాలు బయటకు రావన్న వాదన ఉంది. దీంతోపాటు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండా ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్‌లు ఎలా జరిగాయి అనే కోణంలోనూ విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. అసలు విషయాలు బయటకు రావాలన్నా...విచారణ పూర్తిస్థాయిలో జరగాలన్నా... పై అంశాలపై  ఆరా తీస్తే బాగుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement