గిరిజానపదం... ఝల్లుమంది | tribal peoples celebrations | Sakshi
Sakshi News home page

గిరిజానపదం... ఝల్లుమంది

Published Fri, Feb 21 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

గిరిజానపదం... ఝల్లుమంది

గిరిజానపదం... ఝల్లుమంది

 డప్పు వాయిద్యాల మోతలు, ఈలల గోలలు, నృత్యాలు, గుండెలు ఝల్లన గజ్జెల సవ్వడులు, పక్షుల కిలకిలారావాల్లా శ్రావ్యంగా గిరిపడతుల జానపదాలు ఇలా ఒకటేమిటి ఆదివాసుల అబ్బుర విన్యాసాలన్నీ అక్కడ ఆవిష్కృతమయ్యాయి. వీధులన్నీ సాంస్కృతిక పరవళ్లతో పులకించిపోయాయి. రహదారులు గిరిజనుల కళా వైభవానికి వేదికలయ్యాయి. మలి సంధ్యవేళ...మలయమారుతం స్పర్శలో తనువులు తన్మయంలో ఉన్న సమయం....అంతకు రెట్టించిన ఆనందం, సమ్మెహనంతో ఆహూతులు ఆదమరిచి, మరో లోకంలో విహరించారు. ఏజెన్సీ వాసుల కళావైభవాన్ని తిలకించి అబ్బురపడ్డారు.
 
 పార్వతీపురం, న్యూస్‌లైన్:
 గిరిజన సాంస్కృతిక వేదిక ‘స్పందన’ పేరుతో నిర్వహిస్తు న్న గిరిజనోత్సవాలు గురువారం సాయంత్రం పార్వతీపురంలో నవనవోన్మేషంగా ప్రారంభమయ్యాయి. ముందుగా వైఎస్సార్ విగ్రహం జంక్షన్ వద్ద ఐటీడీఏ పీఓ రజిత్ కుమార్ సైనీ, సబ్-కలెక్టర్ శ్వేతా మహంతి పచ్చ జెండా ఊపి ఉత్సవాల ఆరంభ సూచికగా ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా పీఓ డప్పు వాయించి ఉత్సవానికి ఊపు తీసుకొచ్చారు. అనంతరం కోయ, థింసా నృత్యాలతో గిరిజన సంస్కృతి ప్రతిబింబించే వివిధ ప్రదర్శనలతో ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మతోపాటు పలు శాఖలకు చెందిన అధికారులతో ఉత్సవ ప్రాంగణానికి ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 150 స్టాల్స్‌ను ప్రారంభించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన డప్పు విన్యాసం, సవర నృత్యం, సంప్రదాయ సంగీతం, లం బాడా, కూచిపూడి నృత్యం ఆహూతులను అలరించాయి.
 
 సంస్కృతి పరిరక్షణకే ఉత్సవాలు: శ్రీకాకుళం కలెక్టర్
 అంతకు ముందు జరిగిన ఉత్సవాల ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ గిరిజనుల ఆచారాలు, సంస్కృతిని పరిరక్షించేందు ఈ ఉత్సవాలు దోహదపడతాయని చెప్పారు. ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్‌సైనీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సౌరభగౌర్ మాట్లాడుతూ మంచి మనస్సుగల గిరిజనులు  ఆర్థిక, విద్యా రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఉత్సవాలను జరిపేందుకు నిర్ణయించినప్పటికీ కొన్ని ఆటంకాల వల్ల చివరి క్షణంలో రద్దు చేసినట్టు చెప్పారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ ఏ అధికారైనా గిరిజనుల అభివృద్ధి కోసం కృషిచేసి వారి ఆచార సంప్రదాయాలకు గౌరవమిచ్చేలా విధులు నిర్వర్తించిన నాడు జీవితంలో  సంతృప్తి పొందుతారని చెప్పారు.
 
 ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ మాట్లాడుతూ గిరిజనుల మనోభావాలను గుర్తించి, వారి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడి, జీవన విధానంలో మార్పు తెచ్చేందుకే ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇతర జిల్లాలలోని గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను, వారి జీవన విధానాలను ఈప్రాంతంలో ఉన్న వారికి తెలియపరిచేందుకు నాలుగు రోజులపాటు పలు కళారూపాలు, నృత్యప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సవరపు జయమణి, జాయింట్ కలెక్టర్ బి. రామారావులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ యూజీసీ నాగేశ్వరరావు, పార్వతీపురం సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, విజయనగరం ఆర్డీఓ బి. వెంకట్రావుతోపాటు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు యేచపు లక్ష్మి, డివిజన్ మహిళాసమాఖ్య అధ్యక్షురాలు నిమ్మక పెంటమ్మలు పాల్గొన్నారు. గిరిజన మహిళలైన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఏచపు లక్ష్మి, డివిజన్ మిహ ళాసమాఖ్య అధ్యక్షురాలు నిమ్మక పెంటమ్మలు ఉత్సవ వేదికపై మాట్లాడుతూ గిరిజన సంప్రదాయాలను వివరించారు. అనంతరం గిరిజన విద్యార్థులచే నిర్వహించిన విలువిద్యా ప్రదర్శన కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరబ్ గౌర్ ప్రారంభించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement