పంచాయతీలుగా తండాలు | Tribal Thandas will be recognized as Panchayats, says Uttam kumar Reddy | Sakshi
Sakshi News home page

పంచాయతీలుగా తండాలు

Published Wed, Feb 26 2014 1:36 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Tribal Thandas will be recognized as Panchayats, says Uttam kumar Reddy

లంబాడాల భేరిలో మంత్రి ఉత్తమ్ హామీ

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మంగళవారమిక్కడ నిజాం కళాశాల మైదానంలో లంబాడాల రాజ్యాధికార సమరభేరి జరిగింది. ఇందులో మంత్రి పాల్గొని మాట్లాడారు. తండాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ. 200 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. త్వరలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతుందన్నారు. గుడుంబా అమ్మకాలకు సంబంధించి అమాయక గిరిజనులపై మోపిన ఐదున్నర లక్షల కేసులను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. తండాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మోడీని కోరతానన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో చెంచు జాతి పూర్తిగా అంతరించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాబోయే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కేలా చూడాలని టీజీవోల చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ కోరారు.

 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు..

 లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలోని తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 12 శాతానికి పెంచాలని కోరారు. మూడు లక్షల మంది గిరిజనులను నిర్వాసితులను చేస్తూ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో రెండు శాసనసభ, ఒక లోక్‌సభ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు గిరిజనులకు కేటాయించాలని కోరారు. తమ సమస్యల పరిష్కార సాధన దిశగా త్వరలో జింఖానా గ్రౌండ్స్‌లో మరో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, లంబాడీ హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు నాయక్, పలువురు నేతలు, సంఘాల నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనం పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement