వేంపల్లె : ట్రిపుల్ ఐటీలు ట్రబుల్‌లో పడనున్నాయి. వీటిని యూనివ ర్శిటీ పరిధిలో లేకుండా చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణ విద్యార్థులకు దీటుగా గ్రామీణ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యను అందించాలన్న ఉద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు.
ఆర్‌జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ నాలెడ్జి టెక్నాలజీ) పరిధిలో రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు వైఎస్‌ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ, కృష్ణా జిల్లా నూజివీడు, అదిలాబాద్‌లోని బాసర ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న సిలికాన్ ర్యాలీ తరహాలో ఇక్కడ కూడా వీటిని అభివృద్ధి పరిచేందుకు ఆర్‌కీ వ్యాలీ పేరుతో శ్రీకారం చుట్టారు. వైఎస్ మరణానంతరం విద్యార్థుల సంఖ్య తగ్గడం.. నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం వీటి నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. అధికారుల మధ్య విభేదాలు, ప్రభుత్వం తీరు వీటికి శాపంగా మారాయి. యూనివర్శిటీని రద్దు చేసి ఏదో ఒక దాంట్లో కలిపి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
2008లో ప్రారంభం :
2008 ఆగస్ట్‌లో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ట్రిపుల్ ఐటీనుంచి 2వేలమందిని పదవ తరగతిలో మార్కుల ఆధారంగా ఎంపిక చేసేవారు. 80శాతం మంది గ్రామీణ విద్యార్థులకే ఇందులో అవకాశం కల్పించేలా చేశారు. వైఎస్ మరణం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో 2010లో 2వేల నుంచి 1000కి విద్యార్థుల సంఖ్యను కుదించారు. అంతేకాకుండా రిజర్వేషన్లలో కూడా మార్పు తెచ్చారు.
పేరుకే అటానమస్.. :
రాష్ట్ర విభజన తర్వాత ట్రిపుల్ ఐటీల నిర్వహణకు సంబంధించి వారికి వారే నిర్వహించుకోవాలని స్వయం ప్రతిపత్తి (అటానమస్)గా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతవరకు ఈ అటానమస్ అమలులోకి నోచుకోని పరిస్థితి. గతంలో యూనివర్శిటీనుంచి నిధులు రావాల్సి ఉండగా.. ఏ ట్రిపుల్ ఐటీకి చెందిన బడ్జెట్‌ను వారు వాడుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క ట్రిపుల్ ఐటీకి రూ. 100కోట్లనుంచి రూ. 200కోట్ల వరకు నిధులు అవసరమవుతున్నాయి.
త్వరలోనే నిర్ణయం
ప్రస్తుత ప్రభుత్వం ఆర్‌జీయూకేటీ యూనివర్శిటీ ని విలీనం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యూనివర్శిటీని రద్దు చేసి జవహర్‌లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్శిటీ(జేఎన్‌టీయూ)లోగానీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ తరహాలోగానీ నిర్వహించాలనే తర్జనభర్జన జరుగుతోంది. ఇదే జరిగితే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ తరహాలో 50శాతం ఉచితంగా సీట్లను కేటాయించి.. మరో 50శాతం పేమెంటు సీట్లుగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం గ్రామీణ విద్యార్థులకు శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఈ గవర్నింగ్ సమావేశంలో నిర్ణయం :
జనవరి 9వ తేదీన యూనివర్శిటీలో జీసీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వీటి భవిత్యంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యూనివర్శిటీ విషయమై ఇప్పటికే చాన్సలర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. వచ్చేనెల 17వ తేదీ నాటికి వైస్‌చాన్సలర్ రాజ్‌కుమార్ పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత వైస్ చాన్సలర్‌గా వేరే వ్యక్తికి అవకాశం ఇస్తారా.. ఆయననే కొనసాగిస్తారన్నది తెలియరావడం లేదు. జనవరి 18వ తేదీన చాన్సలర్ రాజిరెడ్డి అమెరికాకు వెళ్లనున్నారు. అంతలోపే వీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రబుల్ ఐటీ
Published Mon, Dec 29 2014 3:19 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement