విజయవాడ సిటీ : పెద అవుటపల్లిలో ట్రిపుల్ మర్డర్ ఘటన జరిగి ఏడాది పూర్తయింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామ కక్షలకు ఈ ఘటనలో మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ 24న పెద అవుటపల్లి జాతీయ రహదారిపై ప్రత్యర్థులను వెంబడించి వేటాడిన దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు మారయ్య (40), పగిడి మారయ్య (35)లను హతమార్చారు. విదేశాల్లో తలదాచుకున్నట్టు పోలీసులు చెబుతున్న ప్రధాన నిందితుడు, అతని సోదరుడు మూడు హత్యలకు కుట్ర చేసి ఏడాది గడిచినా పోలీసులకు చిక్కలేదు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో ఢిల్లీకి చెందిన కిరాయి హంతకులు పాల్గొన్నారు. కేసు దర్యాప్తులో పోలీసులు మొదట చూపిన ఉత్సాహం ఆ తర్వాత చూపకపోవడమే ప్రధాన నిందితుల ఆచూకీ దొరకకపోవడానికి కారణంగా తెలుస్తోంది. కిరాయి షూటర్లు సహా 20 మందికి పైగా నిందితులను కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసినా, ప్రధాన కుట్రదారులు మాత్రం నేటికీ చిక్కకపోవడం గమనార్హం.
ఆరోజు ఏం జరిగిందంటే..
ముంబైలో తలదాచుకొని కోర్టు వాయిదాకు వస్తున్న గంధం మారయ్య, పగిడి మారయ్యతో పాటు వారిని తోడ్కొని వెళ్లేందుకు వచ్చిన తండ్రి నాగేశ్వరరావు పెద అవుటపల్లి జాతీయ రహదారిపై ఆగంతకులు జరిపిన కాల్పుల్లో మృతిచెందారు. పినకడిమి గ్రామంలో గంధం, భూతం కుటుంబాల మధ్య బెడిసికొట్టిన ప్రేమ వివాహం కక్షలను రాజేస్తే, పంచాయతీ పోరు ఆజ్యం పోసింది. ఈ క్రమంలోనే 2014 ఏప్రిల్ 6న ఏలూరు జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా తూరపాటి నాగరాజును పేర్కొన్న పోలీసులు అతని కుమారునితో పాటు గంధం మారయ్య, పగిడి మారయ్యలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ముంబైలో తలదాచుకున్న గంధం సోదరులు కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనంలో వెళుతూ హత్యకు గురయ్యారు. ఈ కేసులో విదేశాల్లో ఉంటున్నట్టు చెపుతున్న భూతం గోవింద్, ఇతని సోదరుడు శ్రీనివాసరావుతో పాటు 30 మంది వరకు నిందితులుగా పేర్కొన్నారు.
దర్యాప్తు ఇలా..
రెండోసారి పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ట్రిపుల్ మర్డర్ జరగడంతో ఈ కేసును పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పినకడిమి గ్రామాన్ని జల్లెడ పట్టిన పోలీసులు గంధం, భూతం కుటుంబాల మధ్య నెలకొన్న వైరమే మూడు హత్యలకు కారణంగా నిర్ధారించారు. ఓంబీర్ పరారవ్వగా గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసుల సాయంతో కుట్రదారులైన పంకజ్, మంజిత్‌సింగ్‌తో పాటు షూటర్లు ప్రతాప్‌సింగ్, ధర్మవీర్, నితిన్, నీరజ్, సతీష్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. వీరి సమాచారం ఆధారంగా చిన్న శ్రీనివాసరావుతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భూతం అనుచరులు, బంధువులు సహా 17 మందిని అరెస్ట్ చేశారు.
రెడ్ కార్నర్ నోటీసు
విదేశాల్లో ఉన్న ప్రధాన కుట్రదారు గోవింద్‌ను రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్టు అప్పటి పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇది జరుగుతుండగానే హైదరాబాద్‌లో అజ్ఞాత జీవితం గడుపుతున్న తూరపాటి నాగరాజుపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే అధికారులు మారారు. స్టేషన్ స్థాయిలో సైతం మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో కేసుపై పోలీసులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఏడాది ముగిసినా ప్రధాన నిందితులు పట్టుబడకపోవడం గమనార్హం.
రక్త చరిత్రకు ఏడాది
Published Fri, Sep 25 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM
Advertisement
Advertisement