జలం.. కలవరం | Troubled water | Sakshi
Sakshi News home page

జలం.. కలవరం

Published Sat, Apr 25 2015 3:44 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

Troubled water

కడప ఎడ్యుకేషన్ : భానుడి ప్రతాపానికి జిల్లా జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకు భూరగ్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షం కొంతమేర ఉపశమనం ఇచ్చినా మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. జిల్లా వ్యాప్తంగా రోజూ ట్యాంకర్ల ద్వారా 765 గ్రామాలకు 1,116 ట్రిప్పులను గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. బోర్లను అద్దెకు తీసుకుని 183 గ్రామాలకు నీరందిస్తున్నారు. రోజురోజుకూ నీటి ఎద్దడి గ్రామాలు పెరగుతున్నాయి.
 
 దీంతో జిల్లా జనం కలవర పడుతున్నారు. ఫిబ్రవరిలో 327 గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి ఉండగా మార్చి నెల వచ్చేసరికి ఆ సంఖ్య 463 గ్రామాలకు చేరింది. ఏప్రిల్ మూడవ వారం వచ్చేసరికి  765 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 647 మీల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా కేవలం 324 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 49.9 శాతం తక్కువ వర్షం కురిసింది. జిల్లా వాప్తంగా రోజుకు మంచి నీటి కోసం ప్రభుత్వం రూ.3.20 లక్షలు ఖర్చు చేస్తోంది.
 
 కరువు తాండవం
 జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలలో కరువు విలయతాండవం చేస్తోంది. గుక్కెడు మంచి నీటి కోసం జనం భగీరథ యత్నం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పశువులకు తినేందుకు మేతలేక రైతులు విలవిలలాడుతున్నారు. గ్రామాల్లో బిందెడు నీటి కోసం జనం రాత్రిళ్లు జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే జనం వలస వెళ్లక తప్పకపోవచ్చు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 21 గ్రామాల్లో, కమలాపురం నియోజకవర్గంలో 36 గ్రామాలు, కోడూరు నియోజకవర్గంలో 35 గ్రామాలు, పులివెందుల నియోజకవర్గంలో 26 గ్రామాలు, రాజంపేట నియోజకవర్గంలో 153 గ్రామాలు, రాయచోటి నియోజకవర్గంలో 235 గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడితో జనం అల్లాడుతున్నారు.
 
 
  చాలా గ్రామాల్లో భూగర్భ జలమట్టం 30 మీటర్ల లోతుకు పడిపోయింది. గాలివీడు, ఓబులవారిపల్లె, పెండ్లిమర్రి, కాశినాయన ,బద్వేల్, పుల్లంపేట, ఒంటిమిట్ట, ఆట్లూరు, చిట్వేలి, లింగాల, పెనగలూరు. పోరుమామిళ్ల, రామాపురం, కోడూరు మండలాల్లో జలం పాతాళానికి పడిపోయింది.

 ఎవరైనా డబ్బు వృధా చేస్తుంటే నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారంటాం. అలాంటిది నీళ్ల కోసమే పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. నగరం, పట్టణాల్లో సైతం నీటి ఎద్దడి నెలకొన్న తరుణంలో నీటి వ్యాపారం మూడు పూవులు.. ఆరు కాయలుగా సాగుతోంది. గతంలో ధనిక వర్గాల వారు మాత్రమే మినరల్, ప్యాకేజ్డ్ నీటిని కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం నెలకొన్న నీటి ఎద్దడికి తోడు.. చాలా ప్రాంతాల్లో కలుషిత నీరు వస్తోంది. దీంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల వారు సైతం తాగడానికి క్యాన్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో ఒక్కో కుటుంబం సగటున నెలకు రూ.600 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని లక్షలాది మధ్యతరగతి, దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబాల వారు ఖర్చు చేస్తున్న మొత్తం ఎంతో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement