మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చిత్రంలో అనిల్ కుమార్ సింఘాల్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, తిరుపతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటు ఉద్యోగులు... అటు రోగులకు... భక్తులకు కొండంత అండగా నిలవనుంది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు పాలక మండలి నడుం బిగించింది. తిరుమల అన్నమయ్య భవన్‌లో బుధవారం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) ఆసుపత్రిని టీటీడీలో విలీనం చేసి, ‘నిమ్స్’ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తిరుమల
తిరుమలలో సంక్రాంతి తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లకు బదులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ నీళ్ల సీసాల స్థానంలో గాజు సీసాలు ప్రవేశపెట్టాలని, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. అలాగే మినరల్ వాటర్ కంటే మరింత బాగా శుద్ధి చేసిన తాగునీటిని భక్తులకు పంపిణీ చేయాలని టీటీడీ పాలక మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి స్వామివారి జలప్రసాదంగా నామకరణం చేశారు. తిరుమల తరహాలో తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరం వరకూ మద్యం అమ్మకాలు సాగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు.
గరుడ వారధితో ట్రాఫిక్ సమస్యకు చెక్
తిరుపతిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు గరుడ వారధిని రీడిజైన్ చేసి, రీటెండర్లు పిలువాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల కల సాకారం
టీటీడీ విద్యాసంస్థల్లో పని చేస్తున్న 382 మంది కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్లు, కల్యాణకట్టలోని 246 మంది పీస్‌రేట్ క్షురకులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపజేసేందుకు పాలక మండలి అంగీకారం తెలిపింది. టీటీడీ అటవీ విభాగంలో పనిచేస్తున్న 162 మంది సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడంతోపాటు మిగిలిన 200 మందికి మినిమమ్ టైం స్కేల్ వర్తింపజేయనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల బహుమానం కింద శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.6,850 చొప్పున అందజేయనున్నారు.
అలిపిరి వద్ద శ్రీవారి భక్తిధామం
తిరుమల, తిరుపతి ప్రజల దాహార్తి తీర్చేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద 200 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో శ్రీవారి భక్తిధామం నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మత మార్పిడులను అరికట్టేందుకు పలు ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తుడా ఛైర్మన్, ఎక్స్ అఫిషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, బోర్డు సభ్యులు భూమన కరుణాకరరెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నంబర్ వన్ ఆసుపత్రిగా స్విమ్స్
‘‘తిరుపతి స్విమ్స్‌ను టీటీడీలో విలీనం చేస్తున్నాం. రాష్ట్రంలోనే నంబర్ వన్ ఆసుపత్రిగా స్విమ్స్‌ను తీర్చిదిద్దుతాం. టీటీడీ సేవలను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మెరుగైన వైద్య సేవల కోసం ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. తిరుపతి స్విమ్స్‌లోనే అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు తిరుమలలో సంక్రాంతి తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది’’
– వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్
టీటీడీ నిర్ణయం హర్షణీయం
‘‘స్విమ్స్‌కు టీటీడీ అండగా నిలవడం సంతోషకరం. ఈ నిర్ణయంలో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత కోస్తా ప్రాంతం నుంచి కూడా రోగులు అధికంగా వస్తున్నారు. టీటీడీ సహకారంతో స్విమ్స్ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి’’
– వెంగమ్మ, స్విమ్స్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment