రుత్వికులకు టీటీడీ చైర్మన్ చీవాట్లు
సమాచారం లోపంతో ఆలస్యంగా వచ్చిన చదలవాడ
అప్పటికే ముగిసిన యాగం
తిరుమల: టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి ఆగ్రహం వ చ్చింది. తను వచ్చేలోపే వరుణయాగం పూర్తి చేయడం పై శుక్రవారం ఆయన రుత్వికులకు చీవాట్లు పెట్టారు. తిరుమల పారువేట మండపం వద్ద నిర్వహించే వరుణయాగంలో మూడోరోజు కార్యక్రమం కోసం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు రావాలని పండితులు ఆహ్వానించారు. ఆ సమాచారం చైర్మన్‌కు అందలేదు. దీంతో ఆయన సతీసమేతంగా మధ్యాహ్నం 12.50 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే యాగం ముగిసింది. దీంతో చైర్మన్ నిర్ఘాంతపోయారు.
‘‘మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించాల్సిన యాగాన్ని 12 గంటలకే ఎలా ముగి స్తారు? అలా చేయడం సరికాదు? నాకు అందిన సమాచారం ప్రకారం మధ్యాహ్నం 1 గంట వరకు యాగం ఉంటుందని చెబితేనే నేను వచ్చాను? లేనిపక్షంలో రాను?’’ అని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి యాగాన్ని పర్యవేక్షించే టీటీడీ పండితుడు వడ్లమానిని నిలదీశారు. ‘‘మధ్యాహ్నం కాకముందే ఆకలవుతోందా?’’ అంటూ చీవాట్లు పెట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 8.30 గంటల నుంచి 12 గంటలకే పూర్తి చేశామని వడ్లమాని బదులిచ్చారు. తర్వాత చైర్మన్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు.