టీటీడీ చైర్మన్‌గా చదలవాడ
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా చిత్తూరు జిల్లా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. పాలకవర్గానికి ఏడాది కాలపరిమితిగా నిర్ణయించారు. ఈ పాలకమండలిలో 15 మంది సభ్యులను నియమించారు. మరో ముగ్గురు అధికార హోదాలో సభ్యులుగా ఉంటారు. చదలవాడ 1999 నుంచి 2004 వరకు టీడీపీ తరఫున తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పాలకమండలిలో మిత్రపక్షమైన బీజేపీ సభ్యులకు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణకు చెందిన బీజేపీ వారెవరికీ అవకాశం ఇవ్వలేదు.
కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకుడిని సభ్యుడిగా నియమించారు. పాలకమండలి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి (శృంగవరపుకోట), పిల్లి అనంతలక్ష్మి (కాకినాడ గ్రామీణ), డోల బాలవీరాంజనేయస్వామి (కొండెపి), తెలంగాణకు చెందిన సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), జి. సాయన్న (సికింద్రాబాద్ కంటోన్మెంట్), టీడీపీ నేతలు వై.టి.రాజా (తణుకు మాజీ ఎమ్మెల్యే), ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు), ఎన్‌టీఆర్ హాయాంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేసిన ఎ.వి.రమణ (ైెహ దరాబాద్), తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వి.కృష్ణమూర్తి, జె.శేఖర్‌రెడ్డి, డి.పి.అనంత్ (బీజేపీ), సంపత్ రవినారాయణ న్ (బిజినెస్), సీఐఐ మహిళా విభాగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుచిత్రా ఎల్లా, ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ సిఫార సు మేరకు తిరుపతికి చెందిన పి.హరిప్రసాద్‌ను సభ్యులుగా నియమించారు.
వీరితోపాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా, టీటీడీ ఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా జె.ఎస్.వి.ప్రసాద్, దేవాదాయశాఖ కమిషనర్‌గా అనూరాధ, టీటీడీ ఈవోగా సాంబశివరావు వ్యవహరిస్తున్నారు. తమిళనాడు నుంచి ఎండీఎంకే నేత వి.గోపాలస్వామి (వైగో) సిఫారసు మేరకు కృష్ణమూర్తికి పాలకవర్గంలో స్థానం కల్పించినట్టు తెలిసింది.